ఆదివారం 17 జనవరి 2021
Zindagi - Nov 29, 2020 , 01:56:56

నన్నలా చూడలేరు!

నన్నలా చూడలేరు!

తెలుగు వెండితెర నుంచి బాలీవుడ్‌కు వెళ్లి సక్సెస్‌ అయిన వారిలో తాప్సీ ఒకరు. పింక్‌, బద్లా, థప్పడ్‌.. ఇలా వరుస హిట్లతో బీటౌన్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల భామ.. చక్కటి అభినయంతో ఫుల్‌ మార్కులు కొట్టేసింది. చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉన్న తాప్సీ సామాజిక మాధ్యమాల్లోనూ తన జోరును కొనసాగిస్తున్నది. తాజాగా, ‘రశ్మీ రాకెట్‌' చిత్రంలో నటిస్తున్న తాప్సీతో చిట్‌చాట్‌ ...

మాల్దీవుల్లో మజాగా...

లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమయ్యా. దాదాపు ఆరు నెలలు బయటకు వెళ్లలేదు. ఇటీవలే మాల్దీవులు వెళ్లాను. చాలా రిలాక్స్‌ అయ్యాను. సముద్ర తీరాల్లో హంగామా చేశానంటే నమ్మండి. స్కూబా డైవింగ్‌ చేస్తున్నప్పుడైతే నా ఆనందానికి అవధుల్లేవు. నా అనుభవాలు ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూనే ఉన్నాననుకోండి. ఈ టూర్‌కు ముందు ఓ తమిళ చిత్రం షూటింగ్‌ పూర్తి చేశాను. మాల్దీవుల నుంచి వచ్చిన తర్వాత ‘హసీన్‌ దిల్‌రుబా’ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నా.

ఫిట్‌నెస్‌ కోసం...

‘రశ్మీ రాకెట్‌' చిత్రం కోసం చాలా కసరత్తులే చేశాను. ఇందులో స్ప్రింటర్‌గా నటిస్తున్నా. దానికి తగ్గట్టుగా ఫిట్‌నెస్‌ ఉండాలి కదా! అందుకే కష్టపడుతున్నా. రోజూ రకరకాల ఎక్సర్‌సైజులు చేస్తున్నా. అలాగని కండరాలు తేలిపోయేలా భారీ వర్కవుట్లు చేయడం లేదు. ఫిట్‌నెస్‌తో పాటు నాజూకుగా కనిపించాలి కదా! అందుకే ఓ పద్ధతి ప్రకారం వర్కవుట్లు చేస్తున్నా.

బికినీ నచ్చదు

అందంగా కనిపించడం అంటే అంగాంగ ప్రదర్శన కాదు. ఈ విషయంలో నేను చాలా పరిధులు పెట్టుకున్నా. ఒకట్రెండు సినిమాల్లో బికినీ వేసుకోక తప్పలేదనుకో! కానీ, నాకు ఆ డ్రెస్‌ వేసుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. నా అభిమానులు కూడా హర్షించరు. అందుకే సోషల్‌ మీడియాలోనూ ఎప్పుడూ బికినీ ఫొటోలు పెట్టను.

అయిష్టంగానే..

ఆటలంటే చాలా ఆసక్తి. స్కూల్‌ డేస్‌లో బ్యాడ్మింటన్‌ బాగా ఆడేదాన్ని. పరుగు పందెంలోనూ సత్తా చాటాను. బాస్కెట్‌బాల్‌ కూడా ఆడేదాన్ని. మా క్లాస్‌లో నేనే పొడవుగా ఉండేదాన్ని. దాంతో నన్ను బలవంతంగా ఆడమనే వాళ్లు. ఆ ఆటంటే నాకు ఇంట్రెస్ట్‌ లేకున్నా తప్పకపోయేది. చిన్నప్పుడు ఆడిన ఆటలు ఫిట్‌నెస్‌ ఇవ్వడంతోపాటు నా వ్యక్తిత్వాన్నీ ప్రభావితం చేశాయనిపిస్తుంది.

మాటకు మాట

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటా. కాకపోతే, నేను ఎవరి జోలికీ వెళ్లను. ఎవరైనా నా జోలికి వస్తే మాత్రం వదిలి పెట్టను. సిన్సియర్‌ కామెంట్స్‌ను స్వీకరిస్తాను. దెప్పిపొడిచే ఉద్దేశంతో కావాలనే కొందరు కామెంట్‌ చేస్తుంటారు. వారికి నాదైన శైలిలో బదులిస్తా.

ఫస్ట్‌ క్రష్‌

తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఓ అబ్బాయిని ఇష్టపడ్డా. తనూ నన్ను ఆరాధించేవాడు. సడన్‌గా చదువుపై కాన్సన్‌ట్రేట్‌ చేయాలంటూ నన్ను దూరం పెట్టేశాడు. ఇప్పట్లా అప్పుడు సెల్‌ఫోన్లు ఎక్కడివి. నేను లోకల్‌ ఫోన్‌ బూత్‌కు వెళ్లి తనతో మాట్లాడుతూ వెక్కి వెక్కి ఏడ్చేశా. మొదటి క్రష్‌ ఎంతైనా మధుర జ్ఞాపకమే.

బెస్ట్‌ స్టూడెంట్‌ని

చిన్నప్పుడు, మాది మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ. చాలా లిమిటేషన్స్‌ ఉండేవి. ఎన్ని ఆటలు ఆడినా చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఓసారి స్కూల్‌లో టాపర్‌గా నిలవాలని లక్ష్యం పెట్టుకున్నా. అనుకున్నట్టుగానే ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌'గా నిలిచా. మనస్ఫూర్తిగా ఏదైనా అనుకొని కష్టపడితే.. తప్పకుండా సాధిస్తామని అప్పుడే అర్థమైంది. హయ్యర్‌ స్టడీస్‌లోనూ నేనంటే ఏంటో నిరూపించుకున్నా. 90 శాతం మార్కులతో ఎంబీఏ పాసయ్యా.

కాలు నిలబడేది కాదు

చిన్నప్పుడు నేను చాలా హైపర్‌ యాక్టివ్‌. బడికి వెళ్లినప్పుడు ఎంత యాక్టివ్‌గా ఉండేదాన్నో.. ఇంటికి వచ్చేటప్పుడూ అలాగే ఉండేదాన్ని. అలసట అనేదే తెలిసేది కాదు. స్కూల్‌ చుట్టూ పరుగులే పరుగులు. ఇంటికి వచ్చి తిని, పడుకునే వరకూ నా కాళ్లు ఒక్కచోట నిలబడేవి కావు. ఆ రోజుల్లో ఎంత తిన్నా.. ఇట్టే అరిగిపోయేది. మళ్లీ మళ్లీ ఆకలి వేసేది. స్కూల్‌, కాలేజ్‌ పూర్తయి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొద్దిగా బరువు పెరిగా. ఆమాత్రానికే కొందరైతే.. ‘బరువు తగ్గమని నీకు ఎవరూ చెప్పలేదా?’ అనేవారు. ఎంత తిన్నా.. నేను బరువు పెరగను. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలినే!