గురువారం 28 జనవరి 2021
Zindagi - Nov 29, 2020 , 01:56:52

జమీన్‌ ఆస్మాన్‌ ఫరక్‌

జమీన్‌ ఆస్మాన్‌ ఫరక్‌

బిగ్‌బాస్‌ 3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌ పక్కా హైదరాబాద్‌ పోరగాడు. భాగ్యనగరం బస్తీల్లో పెరిగిన పిల్లగాడు. మనోడు పాట అందుకుంటే తీన్మార్‌ దరువులే! తాజాగా ‘మన నగరం హైదరాబాద్‌' అంటూ గళమెత్తాడు. గ్లోబును తన వైపు తిప్పుకొన్న నయా హైదరాబాద్‌ కీర్తి పతాకను తన పాటలో ఆవిష్కరించాడు. విడుదలైన గంటల్లోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న ఈ పాట హైదరాబాదీల గుండె చప్పుడును వినిపిస్తున్నది, మత సామరస్యాన్ని ప్రకటిస్తున్నది. ఈ సందర్భంగా రాహుల్‌ సిప్లిగంజ్‌ను ‘జిందగీ’ పలకరించింది.

‘మన నగరం’ పాటకు స్పందన ఎలా ఉంది? 

చాలా బాగుంది.  మన హైదరాబాద్‌  కల్చర్‌ను, ఐడెంటిటీనీ చూపించే పాట ఇది. హైదరాబాద్‌ సంస్కృతిని ప్రతిబింబించేలా నగరంలోని అన్ని వర్గాల ప్రజలనూ చూపించాం ఇందులో. భాగ్యనగరిలోని అన్ని లొకేషన్స్‌లో షూట్‌ చేశాం. ఈ చారిత్రక నగరాన్ని పాటగా పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉన్నది. ప్రతి ఒక్కరూ ఓన్‌ చేసుకుంటున్నరు.

మీరు పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. చిన్నప్పటి నుంచీ ఎలాంటి మార్పులు చూశారు? 

ఊహించనన్ని మార్పులు చూశాను. అప్పటి హైదరాబాద్‌కు.. ఇప్పటి నగరానికి జమీన్‌ ఆస్మాన్‌ ఫరక్‌ ఉంది. మా చిన్నప్పుడు రైలు చూడాలంటే నాంపల్లి స్టేషన్‌కు వెళ్లేవాళ్లం. మరి ఇప్పుడు.. మన కండ్ల ముందు నుంచే మెట్రో రైలు రయ్‌మని దూసుకుపోతున్నది. ఎక్కడికక్కడ కొత్త ఫ్లై ఓవర్లు వచ్చినయ్‌. లింకు రోడ్లవల్ల ప్రయాణం సులువైంది. ట్రాఫిక్‌ సమస్య చాలా తగ్గింది. కరెంట్‌ సమస్య పూర్తిగా పరిష్కారమైంది. చిన్నప్పుడు మా బస్తీల్లో కరెంటే ఉండేది కాదు. ఇప్పుడు 24 గంటలు ఉంటున్నది.  

 తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్‌ ఎలా ఉంది? 

తెలంగాణ వచ్చిన తర్వాత  హైదరాబాద్‌ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అన్నీ కండ్లముందే ఉన్నయి. నేను రోజంతా బయట తిరుగుతూ ఉంటాను. చాలా మార్పు వచ్చింది. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతున్నది. ఎవరికైనా కావాల్సింది రక్షణే. ఆ విషయంలో హైదరాబాద్‌ సేఫ్‌ సిటీ అని చెబుతాను. ఫ్రెండ్లీ పోలీస్‌వల్ల సమస్యలు వాళ్ల దృష్టికి తీసుకెళ్లడం ఈజీ అయింది. ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వమే అధికారంలో ఉండాలి. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు అదృష్టవంతులు. నగరంలో ఐటీ రంగ అభివృద్ధి ఆశ్చర్యం కలిగిస్తున్నది. ప్రపంచ దిగ్గజ సంస్థలన్నీ మన సిటీకి రావడం గర్వకారణం. ఈ విషయంలో కేటీఆర్‌ గారి కృషి చాలా గొప్పది.

కేటీఆర్‌ను మీరు ఫాలో అవుతారా? 

రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటాను. ఆయన యంగ్‌ లీడర్‌. కేటీఆర్‌ గారి ఇంటర్వ్యూలు, ఉపన్యాసాలు తరచూ చూస్తుంటాను. ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతారు. కార్పొరేట్‌ మీటింగ్స్‌లో ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడుతారు. ప్రజల్లోకి వస్తే అందరికీ అర్థమయ్యేలా సాదాసీదాగా మాట్లాడుతారు. మంచి నాయకుని లక్షణం అదే. దీంతో పాటు ఆయన మాటల్లో నిజాయతీ ఉంటుంది. రాజకీయ నాయకులు అంటే లేనిది ఉన్నట్లు ప్రచారం చేస్తుంటారు. కానీ కేటీఆర్‌ గారు చాలా ఫెయిర్‌గా ఉంటారు. అదే నాకు నచ్చింది.

హైదరాబాద్‌ ఎలా ఉండాలని అనుకుంటున్నారు?

భాగ్యనగరంలో అన్ని వర్గాల ప్రజలూ ఉన్నారు. ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తున్నదీ నగరం. తెలంగాణ వచ్చిన తర్వాత శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తున్నాయి. హైదరాబాద్‌ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి బాగున్నది. ప్రజలూ ఆనందంగా ఉన్నారు.  మన సిటీ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నది. 

కొందరు విద్వేషాల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు.. దీనిపై మీరేమంటారు?

నిజమే! కానీ వారి ఆటలు సాగవేమో అనిపిస్తుంది. ఈ సిటీలో  కుల, మత భేదాలు ఉండవు. బస్తీల్లో అయితే అంతా ఒక్కటే అన్నట్టు ఉంటారు. హిందువులు, ముస్లింలు  కలిసి పండుగలు చేసుకుంటారు. అంతకన్నా ముఖ్య విషయం ఏంటంటే.. ప్రజలు ఆలోచిస్తున్నారు. మనుషుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ఎవరూ సహించారు. విద్వేషాలను రెచ్చగొట్టే వాళ్లను దూరంగా ఉంచాలి. అప్పుడే నగర అభివృద్ధి మరింత పురోగమిస్తుంది.

బిగ్‌బాస్‌తో లైఫ్‌ మారింది

బిగ్‌బాస్‌ తర్వాత నా లైఫ్‌ బాగా మారిపోయింది. మంచి పేరు కూడా వచ్చింది. అభిమానులు ఓట్లు వేసి గెలిపించడంతో ప్రజల్లో నాపై మరింత నమ్మకం పెరిగింది.  సినిమా అవకాశాలు, పాటల అవకాశాలూ పెరిగాయి. ఇటీవల ఓ సినిమాలో చాన్స్‌ వచ్చింది. కరోనాతో కొంత ఇబ్బంది ఎదుర్కొన్నా.. ఆ ప్రభావం తగ్గుతున్న కొద్దీ ఇండస్ట్రీలో బిజీ అయిపోతున్నా. ఇప్పుడు బిగ్‌బాస్‌ సీజన్‌లో విన్నర్‌ ఎవరో చెప్పలేను కానీ, నాకైతే సోహైల్‌, అభిజిత్‌ అంటే ఇష్టం. ఇద్దరూ బాగా ఆడుతున్నారు.


logo