శనివారం 28 నవంబర్ 2020
Zindagi - Nov 20, 2020 , 23:20:50

రామసక్కనోడు!

రామసక్కనోడు!

బాల్యంలోనే నాటకాల్లో రాటుదేలాడు. వయసొచ్చాక టీవీ సీరియల్స్‌తో కెరీర్‌ను నిర్మించుకున్నాడు. అందివచ్చిన సినిమా అవకాశాలనూ సద్వినియోగం చేసుకున్నాడు. ఏ ఆర్భాటాలూ లేకుండా సహజ నటనతో బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇప్పుడు వెండితెరపై హీరోగా కనిపించనున్నాడు. ‘నరసింహపురం’ చిత్రంతో హీరోగా ప్రేక్షకులను పలకరిస్తున్న నందకిశోర్‌ ధూళిపాళను ‘జిందగీ’ పలకరించింది. తన ఇరవై ఏండ్ల నట ప్రస్థాన విశేషాలను ఇలా పంచుకున్నాడు..

నటుడిగా నేను ప్రేక్షకుల అభిమానం పొందానంటే, అందుకు కారణం హైదరాబాదే. చిన్నప్పుడు ఇక్కడ జరిగే ఎన్నో కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనేవాణ్ని. నటనలో ఓనమాలు దిద్దుకుని స్టేజ్‌ అనుభవం సాధించాను. బుల్లితెరతో ప్రజలకు దగ్గరయ్యాను. మాది గుంటూరు జిల్లా చిలకలూరిపేట. పుట్టింది అక్కడే అయినా, నాకు మూడేండ్లు ఉన్నప్పుడు మా కుటుంబం హైదరాబాద్‌కి షిఫ్ట్‌ అయింది. నాన్న డీవీ రమణ రైల్వే ఉద్యోగి. అమ్మ గృహిణి. నాన్నకు నాటకరంగం అంటే ఎంతో అభిమానం. వాళ్ల ఆఫీస్‌ కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌లో పాలుపంచుకునేవారు. ఆయనే నన్నూ ప్రోత్సహించారు. వాళ్ల కార్యక్రమాల్లో నాకు అవకాశం ఇస్తుండేవారు. స్వయంగా నాన్నే మేకప్‌ వేసేవారు. ఇలా నటించాలని చెప్పేవారు. ఆయనే నా తొలి గురువు. చిన్నప్పుడు సరదాగా అనిపించినా కొన్నాళ్లకు నాటకాలంటే అభిమానం, నటనపై అభిరుచి ఏర్పడ్డాయి. పదో తరగతిలో ఉన్నప్పుడు గరికిపాటి ఉదయభాను గారి ‘భూమిక నాటక మండలి’లో భాగం అయ్యాను. ఎక్కువగా తెలుగు, హిందీ జానపద నాటకాలు వేసేవాళ్లం. స్టేజ్‌ అనుభవంతో.. నటనతోపాటు పాటలు పాడటం, డ్యాన్స్‌లో ప్రావీణ్యం సాధించగలిగాను. తెలంగాణ మాండలికంలో మేం ప్రదర్శించిన ఒక నాటకానికి మూడు నంది పురస్కారాలు లభించాయి. ఆ నాటకాన్ని దాదాపు వంద ప్రదర్శనలిచ్చాం. నాటక రంగం నుంచి చిన్నితెర, అక్కడి నుంచి వెండితెరవైపుగా నా ప్రయాణం కొనసాగింది.

అలా  సీరియల్స్‌లోకి..

నాటకాల్లో యాక్టివ్‌గా ఉన్నప్పుడు టీవీ సీరియల్స్‌లో ట్రై చేయమని స్నేహితులు సలహా ఇచ్చారు. ఆ ప్రయత్నంలో ఉండగా దూరదర్శన్‌లో ‘వెలుగు నీడలు’ సీరియల్‌లో అవకాశం వచ్చింది. దాదాపు రెండేండ్లు అందులో నటించాను. మరోవైపు మా టీవీ, ఈటీవీ సీరియల్స్‌లోనూ అవకాశాలు వచ్చాయి. 2001లో సీరియల్స్‌ ప్రస్థానం మొదలైంది. 2005లో జెమినిలో వచ్చిన ‘చి.ల.సౌ స్రవంతి’ నాకు మంచి బ్రేక్‌ ఇచ్చింది. ఐదేండ్లపాటు సాగిన ఈ సీరియల్‌తో నాకు మంచి గుర్తింపు వచ్చింది. అవకాశాలూ వెల్లువెత్తాయి. వివిధ చానల్స్‌లో సీరియల్స్‌ చేస్తూ వచ్చాను. ప్రసుత్తం జీ కుటుంబంలో ఒకడిగా ఉన్నాను. అందులో ప్రసారం అవుతున్న ‘రామసక్కని సీత’ సీరియల్‌లో మెయిన్‌ రోల్‌ చేస్తున్నా. ఈ పాత్రకు ‘జీ కుటుంబం’ అవార్డ్స్‌లో ఉత్తమ భర్త పురస్కారం అందుకున్నా.

హీరోగా మొదటిసారి..


సీరియల్స్‌ చేస్తూనే వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకున్నా. ‘ద్రోణ’తోపాటు దాదాపు పది చిత్రాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించాను. ఇప్పుడు ‘నరసింహపురం’ అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. పీఆర్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి దర్శకుడు శ్రీరాజ్‌ బళ్ల. అన్నాచెల్లెండ్ల సెంటిమెంట్‌తో రూపొందుతున్నది. దాదాపు ఏడాదిన్నరగా ఈ సినిమా కోసం కష్టపడుతున్నా. లాక్‌డౌన్‌ కారణంగా ఆలస్యమైంది. షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఓటీటీ ద్వారా రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నా నమ్మకం. సినిమాల్లో సక్సెస్‌ఫుల్‌ ఆర్టిస్టుగా స్థిరపడాలన్నదే నా కోరిక.

సమాజ సేవ కోసం..

సమాజానికి ఎంతోకొంత సేవ చేయాలని ఉంది. దానికోసమే క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలుగు టెలివిజన్‌ (క్యాట్‌)  సంస్థని ప్రారంభించాం. అవకాశాలు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సహాయం చేయడమే క్యాట్‌ లక్ష్యం. మాటలు చెప్పి మంచివాడు అనిపించుకోవడం కంటే, మంచి పనులు చేసి గుర్తింపు తెచ్చుకోవాలనేది నా అభిమతం. టీవీల్లో మంచి ఆర్టిస్ట్‌లున్నా సరైన అవకాశం రాక షైన్‌ కాలేకపోతున్నారు. అవకాశాలను అందుకోవడం ఎంత ముఖ్యమో.. వాటిని సద్వినియోగం చేసుకోవడమూ అంతే ముఖ్యం. హార్డ్‌వర్క్‌ చేస్తే ఎప్పటికైనా అనుకున్నది సాధించవచ్చు. మన ప్రవర్తన, పద్ధతి, మాటతీరు బాగుంటే.. ఏ పరిశ్రమైనా అక్కున చేర్చుకుంటుందనడానికి నేనే ఒక ఉదాహరణ. 

అందరి ప్రోత్సాహం


నాకు ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళెవరూ లేరు. నాకు నేనుగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాను. సెలెబ్రెటీ క్రికెట్‌ లీగ్‌ (సీసీఎల్‌) ద్వారా ఇండస్ట్రీలో చాలామందితో పరిచయం ఏర్పడింది. అక్కినేని అఖిల్‌, హీరో శ్రీకాంత్‌, తరుణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌.. ఇలా చాలామంది నన్ను తమలో ఒకడిగా చూసుకుంటూ ఎంతగానో ఆదరించారు. అప్పుడప్పుడు వెంకటేష్‌గారితో కొన్ని విషయాల గురించి చర్చిస్తూ ఉంటాను. ఫిలసాఫికల్‌గా  మాట్లాడుతారు. ఆయనే నాకు స్పూర్తి. నన్ను బాగా ప్రోత్సహిస్తారు కూడా. అవసరమైన విషయాల్లో సలహాలిస్తుంటారు. నా కెరీర్‌ తొలినాళ్లలో తమ్మారెడ్డి భరద్వాజగారు చాలా సపోర్ట్‌ చేశారు. నా సినిమా ఫస్ట్‌లుక్‌ని కూడా భరద్వాజగారే రిలీజ్‌ చేశారు. అందరూ నన్ను ఎంతగానో ఆదరించారు.. ఆదరిస్తున్నారు.. ఇంతమంది గొప్పవారి ప్రోత్సాహం లభించడం నిజంగా నా అదృష్టం. 

విలన్‌గా చేయాలనుంది

ఇప్పటికి చాలా సీరియల్స్‌లో నటించాను. మొదట్లో చిన్న చిన్న పాత్రలే చేసినా తర్వాత ప్రధాన పాత్రల్లో నటించాను. మొదటి సీరియల్లో నెగెటివ్‌ షేడ్‌ ఉన్న రోల్‌ చేశాను. తర్వాత పాజిటివ్‌ పాత్రల్లో కనిపిస్తున్నా. నిజానికి నాకు నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్లు చేయడం అంటే ఇష్టం. అలాంటి పాత్రల్లో నటనకు ఎక్కువ స్కోప్‌ ఉంటుంది. ఎప్పటికైనా నెగెటివ్‌ షేడ్స్‌లో మంచి పాత్ర చేయాలనుకుంటున్నాను. సినిమా అయినా, సీరియల్‌ అయినా విలన్‌గా నటించాలని ఉంది.