శనివారం 28 నవంబర్ 2020
Zindagi - Nov 20, 2020 , 23:20:50

హిమసీమలో వెలుగురేఖ

హిమసీమలో వెలుగురేఖ

నిండుపున్నమి వెన్నెల వెలుగులే వారికి దీపకాంతులు. సూరీడు కొండ దిగకముందే పనులన్నీ చక్కబెట్టుకోవాలి. లేదంటే.. గుడ్డిదీపం వెలుగులో చేతులు కాల్చుకోవాల్సిందే! ఆమె బాల్యమంతా అలాంటి చోటే గడిచింది. ఓసారెప్పుడో విద్యుత్‌ బల్బ్‌ చూసి చందమామ కిందికి దిగివచ్చాడా అని ఆశ్చర్యపోయింది. ఆనాడు అంతలా అచ్చెరువొందిన అమ్మాయే.. ఇప్పుడు ఊరూరా విద్యుత్‌ కాంతులు నింపుతున్నది. సౌరశక్తిని కాంతిపుంజంలా తీర్చిదిద్ది గుడిసె గుడిసెకూ వెలుగులు పంచుతున్నది.

పాతికేండ్ల కిందటి ముచ్చట. గుర్మిత్‌ ఆంగ్మోకు అప్పుడు 11 ఏండ్లుంటాయి. లఢక్‌ రీజియన్‌లోని మారుమూల పల్లె సుమ్దా చెన్మోలో ఉండేది వారి కుటుంబం. తల్లిదండ్రులు వ్యవసాయదారులు. బడికి వెళ్లి.. అక్కడ్నుంచి పొలానికి వచ్చి కన్నవారికి సాయం చేసేది. రవి అస్తమించకముందే హుటాహుటిన ఇంటికి చేరి వంటావార్పూ చేసేది. సూర్యాస్తమయం అయితే ఇళ్లంతా చీకటే. ఊరంతా చీకటే. కరెంట్‌ గురించి అక్కడి వారికి తెలియదు. శీతకాలం వచ్చిందంటే ఈ హడావుడి రెట్టింపయ్యేది. నాలుగింటికల్లా ఈ హిమసీమ చీకట్లోకి జారుకునేది. ఆలోపే పనులు చక్కబెట్టుకోవాల్సి వచ్చేది. ఇలాంటి వాతావరణంలో పెరిగింది గుర్మిత్‌. ఓసారి లెహ్‌ పట్టణానికి వెళ్లిందామె. అక్కడ మొదటిసారి నిండుగా వెలుగుతున్న బల్బును చూసింది. ‘ఇలాంటిది మా ఇంట్లోనూ ఉంటే ఆదరాబాదరాగా పని చేసే దుస్థితి తప్పుతుంది కదా’ అనుకుంది.


కూతుళ్లను వదిలి శిక్షణకు..

రోజులు గడిచిపోయాయి. ఏండ్లు దొర్లిపోయాయి. గుర్మిత్‌ కుటుంబం లద్దాక్‌కు వలస వచ్చింది. అక్కడే మెట్రిక్యులేషన్‌ చదివింది. సర్కారు ఉద్యోగానికి ప్రయత్నించి విఫలమైంది. మంచి సంబంధం చూసి పెండ్లి చేశారు తల్లిదండ్రులు. భర్త కార్పెంటర్‌. రెండేండ్లకు కూతురు పుట్టింది. మరో రెండేండ్ల తర్వాత ఇంకో బిడ్డకు జన్మనిచ్చింది గుర్మిత్‌. జీవితం ప్రశాంతంగానే సాగిపోతున్నది. కానీ, తెలియని అసంతృప్తి గుర్మిత్‌ గుండెలో గూడు కట్టుకున్నది. ఓ రోజు ఆమె తమ్ముడు వచ్చాడు. తను గ్లోబల్‌ హిమాలయన్‌ ఎక్స్‌పడేన్‌ సంస్థలో పనిచేస్తున్నాని చెప్పాడు. హిమాలయ గ్రామాల్లో వారి సంస్థ నిర్వహిస్తున్న పనుల గురించి ఏకరువు పెట్టాడు. గుర్మిత్‌ మదిలో ఓ ఆలోచన మెదిలింది. తనకు సైన్స్‌ అంటే ఇష్టం. కరెంట్‌ పనులంటే ఇంకా ఇష్టం. ఆ సంస్థలో చేరి శిక్షణ తీసుకుంటానని భర్తను అడిగింది. ఆయన సరేనన్నారు. కూతుళ్లను భర్తకు అప్పజెప్పి శిక్షణ కోసం రాజస్థాన్‌లోని తిలోనియాకు వెళ్లింది. 

అందరికీ ఆదర్శం

ఆరు నెలల్లో సోలార్‌ పవర్‌ నిర్వహణలో శిక్షణ పూర్తయింది. 2017లో గుర్మిత్‌కు మొదటి టాస్క్‌ ఇచ్చింది శిక్షణనిచ్చిన సంస్థ. ఓ మారుమూల పల్లెకు సోలార్‌ వెలుగులు ఇవ్వాల్సిందిగా చెప్పింది. అందుకు తగ్గ సామగ్రి అప్పగించింది. ఆమెకు తోడుగా ఓ సహాయకుడిని పంపింది. పది రోజల్లో 97 ఇండ్లలో సోలార్‌ ప్యానల్స్‌ బిగించి, విద్యుత్‌ సౌకర్యం కల్పించాలి. ఎల్‌ఈడీ బల్బులు వెలిగేలా చేయాలి. తొమ్మిది రోజుల్లోనే అన్ని ఇండ్లల్లో కాంతులు నింపింది గుర్మిత్‌. గ్రామస్థులంతా సంబురపడ్డారు. గుర్మిత్‌ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. ఆనాటి నుంచి గుర్మిత్‌కు చేతినిండా సోలార్‌ ప్యానల్సే, ఇంటి నిండా ఎల్‌యీడీ బల్బులే. సంస్థ నిర్దేశించిన ఊరికి వెళ్లడం సోలార్‌ ప్యానెల్స్‌ బిగించడం, విద్యుత్‌ను ప్రసాదించడం.. ఇదే పని. ఈ రెండున్నరేండ్లలో దాదాపు 50 గ్రామాల్లో పనిచేసిందామె. వేలాది నివాసాల్లో వెలుగులు నింపింది. లఢక్‌ రీజియన్‌తో పాటు మేఘాలయలోనూ పని చేసింది. లఢక్‌ వంటి ప్రాంతంలో ఒక మహిళ ముందుకు రావడం, అందునా మగవారికి దీటుగా కరెంట్‌ పని చేయడమంటే అనుకున్నంత తేలికేం కాదు. అన్నిటినీ దాటుకొని లఢక్‌ మహిళలకు ఆదర్శంగా నిలిచింది గుర్మిత్‌. ప్రతి మహిళా ఆర్థిక స్వాతంత్య్రం సాధించాలని ఆమె చెబుతున్నది. మన సంపాదనే మనకు రక్ష అని హితవు పలుకుతున్నది.