లాస్ ఏంజెలిస్: తెరుచుకున్న నోటిలో సన్నని సూదుల్లాంటి పలువరస.. తల మీద నుంచి ముందుకు వాలిన కుచ్చుల చెర్నాకోల లాంటి తోక.. ఆ తోకలో కాంతిని ప్రసరించే లైటు.. ఇదీ పసిఫిక్ ఫుట్బాల్ ఫిష్ ఆకారం. ఫైండింగ్ నీమోలో ఓ పాత్రగా ఇది మనకు దర్శనమిస్తుంది. సముద్రపు లోలోతుల్లో జీవించే ఈ అరుదైన చేప తాజాగా కాలిఫోర్నియా తీరంలోకి కొట్టుకువచ్చింది. క్రిస్టల్ కోవ్ అనే చేట ఇది నిర్జీవ స్థితిలో కనిపించింది. జాలరిగా పనిచేసే బెన్ ఎస్టెస్ ఈ చేపను ముందుగా చూసి అధికారులకు తెలియజేశారు. ఇలాంటి చేపను నేనైతే జీవితకాలంలో ఎప్పుడూ చూడలేదని, ఇది ఆసాధారణమైన చేప అని ఆయన అభివర్ణించారు. ఎస్టెస్కు తాను కనిపెట్టింది ఏమిటో తనకు తెలుసో లేదో అని మత్స్య నిపుణురాలు జెస్సికా రోయమ్ అన్నారు. చేప చెక్కుదెరకుండా ఉందని, 3 వేల అడుగుల లోతున జీవించే ఈ చేప తీరానికి ఎలా వచ్చిందో తెలియడం లేదని ఆమె పేర్కొన్నారు. అంత లోతునుంచి వీటిని సేకరించి తీసుకురావడమూ అరుదే. స్థానికులు బీచిలో దొరికిన ఫుట్బాల్ చేపను ఫ్రీజ్ చేసి లాస్ ఏంజెలిస్ కౌంటీ నేచురల్ హిస్చరీ మ్యూజియంకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ మూడు చేపలు ప్రదర్శనలో ఉన్నాయి. కానీ ఒక్కటీ ఇంతటి చెక్కుచెదరని స్థితిలో లేదట.