బుధవారం 25 నవంబర్ 2020
Zindagi - Oct 31, 2020 , 01:53:27

డిప్రెషనే డాక్టర్‌ను చేసింది!

డిప్రెషనే డాక్టర్‌ను చేసింది!

ఎవరన్నారు పెండ్లయితే కెరీర్‌ లేదని.. ఎవరన్నారు కుటుంబ బాధ్యతలుంటే చదవలేరని.. మహిళలు ఏ వయసులోనైనా ఏదైనా సాధించగలరని నిరూపించారామె. సాధారణ గృహిణి స్థాయి నుంచి నిపుణులైన సైకాలజిస్టుల వరుసలో నిలిచారు. నాలుగు పదుల వయసులో తిరిగి చదువును ప్రారంభించి, వృత్తి జీవితంలో విజయాలు సాధిస్తున్నారు డాక్టర్‌ రాధిక నల్లాన్‌ ఆచార్య.  ఇల్లాలి నుంచి సైకాలజిస్టుగా ఆమె ఎదిగిన తీరు ఇది...

“అమ్మ కెరీర్‌కి నేను అడ్డంగా ఉన్నా. నాకిది ఇష్టం లేదు. ఆమె ఎదుగుదలకు ఆటంకం కావొద్దనే వెళ్లిపోతున్నా!” ఆత్మహత్యకు పాల్పడిన తొమ్మిదో తరగతి విద్యార్థి రాసిన లేఖ అప్పట్లో దుమారం రేపింది. కల్పకంలోని అణుపరిశోధనా సంస్థలో ఇంజినీర్లుగా పనిచేస్తున్న ఆ పిల్లవాడి తల్లిదండ్రులు బిడ్డతో సమయం వెచ్చించలేకపోయారు. కొడుకు చనిపోయాక ఆ తల్లి ఉద్యోగానికి రాజీనామా చేసింది. కానీ ఏం లాభం..! ఈ సంఘటన అప్పుడే ఒక చంటివాడికి తల్లయిన రాధిక మనసుపై తీవ్ర ప్రభావం చూపింది. అందుకే, పిల్లల కోసం ముంగిట్లోకి వచ్చిన ఉద్యోగావకాశాలను వద్దనుకున్నది. మూడేండ్ల వయసులోనే స్కూల్‌లో చేరి, 13 ఏండ్లకే పదోతరగతి పూర్తి చేసుకున్న తెలివైన విద్యార్థిని ఆమె. కానీ, డిగ్రీ పరీక్షల మధ్యలోనే పెండ్లిపీటల మీద తలొంచుకొని కూర్చున్నది. చేతికి పసుపుతాడు, మెడలో తాళిబొట్టుతో మిగిలిన పరీక్షలు రాసింది. ఇంకా ఎన్నో సాధించాలనుకుంది. తనకు నచ్చిన రంగంలో రాణించాలనుకుంది. కానీ, పిల్లల కోసం అన్నీ వద్దనుకుంది. ఆశలను, ఆశయాలను పక్కనపెట్టి సాధారణ గృహిణిగా మిగిలిపోయింది. తన భర్త సంపాదనలో కొంత పొదుపు చేస్తే తానూ సంపాదించినట్టే కదా అని సర్దిచెప్పుకొంది.

అలా మొదలైంది...!

కాలచక్రం గిర్రున తిరిగింది. చూస్తుండగానే పెద్దకొడుకు ఇంజినీరింగ్‌లో చేరాడు. చిన్నోడు హైస్కూల్‌కు వచ్చేశాడు. మధ్యలోనే కరిగిపోయిన తన కలను మళ్లీ నిజం చేసుకునే తరుణం వచ్చేసిందనుకుంది రాధిక. అప్పుడప్పుడే దూరవిద్య అందరికీ దగ్గరవుతున్నది. తనకోసమే ఈ అవకాశం తలుపు తట్టిందని భావించింది రాధిక. డిస్టెన్స్‌లో ఎంఏ తెలుగు చేసింది. అధ్యాపకురాలిగా కొత్త జీవితం ప్రారంభించాలనుకుంది. అంతలోనే సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగి అయిన రాధిక భర్తకు ముంబయికి బదిలీ అయింది. పట్టాలు ఎక్కక ముందే ఆమె కెరీర్‌ ట్రాక్‌ తప్పింది. ముంబయిలో సంసారం. జీవితంలో కొన్ని సమస్యలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. రాధిక మనసు కకావికలమైంది. ఏదో నమ్మకం ఆమెను నిలబెడుతూ వచ్చింది. మానసిక ఆందోళనను అధిగమించడానికి మ్యాగజైన్లు తిరగేయడం వ్యాపకంగా చేసుకుంది. అందులో సైకాలజీ వ్యాసాలు ఆకర్షించాయి. కానీ, ఎన్ని వ్యాసాలు చదివినా.. తన సమస్యకు పరిష్కారం దొరకలేదు. సైకాలజిస్ట్‌ను కలిస్తే ప్రయోజనం ఉంటుందనుకుంది. అదీ చేసింది. అయినా ఫలితం లభించలేదు. అప్పుడే తనెందుకు సైకాలజీ చదవకూడదు? అనుకుంది రాధిక. అనుకున్నదే తడవుగా సైకాలజీ డిగ్రీలో చేరింది.

పిల్లల అండతో..

చిన్నప్పటి నుంచీ రాధిక చదువంతా సాగింది తెలుగు మీడియంలో! అసలే అర్థం కాని సైకాలజీ, అందులోనూ ఆంగ్లం.  తన వల్ల కాదేమో అనిపించింది. ఎదిగిన పిల్లల ముందు చులకన అయిపోతానేమోనని దిగులు. వాళ్లకు రోల్‌మోడల్‌గా ఉండాలంటే కష్టపడాలని నిర్ణయించుకుంది. తల్లికి అండగా నిలిచారు పిల్లలు. చిన్నప్పుడు తమను చదివించినట్టు.. తల్లికి చదువు చెప్పారు. ‘అదే సమయంలో మావారికి హైదరాబాద్‌కు బదిలీ అయింది. నా కెరీర్‌లో ఊహించని మలుపు. నా కెరీర్‌ను మలచుకోవడం కోసం ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్‌ నిరంజన్‌ రెడ్డి గారిని కలిశాను. ఆయన సలహా మీదట ఎంఫిల్‌, ఆపై క్లినికల్‌ సైకాలజీలో డిప్లొమో చేశాను. ఆయన దగ్గరే ఇంటర్న్‌షిప్‌ చేశాను. ‘ఒక సైకాలజిస్ట్‌గా ఇలా ఉన్నానంటే కారణం ఆయనే’ అంటుంది డాక్టర్‌ రాధిక.

ఇష్టమైన కష్టం!

కుటుంబం, పిల్లలు, వారి పెండ్లిళ్లు.. ఇలా బాధ్యతల నడుమ సాగాల్సిన నడి వయసులో ఆమె చదువు విజయవంతంగా పూర్తి చేసింది. ‘40 ఏండ్ల వయసులో ఏం చదువుతాంలే అనుకోవడం తప్పు. చదువుకూ, కెరీర్‌కూ వయసు ఎప్పుడూ అడ్డంకి కాదు. కుటుంబ సహకారం, మనలో ఆసక్తి ఉండాలే గానీ ఏ వయసులో అయినా విజయాలు సాధించవచ్చు’ అంటుందామె. ఆమె సైకాలజీ కోర్సులో చేరేనాటికే పెద్దబ్బాయి సెటిలయ్యాడు. ఏ పిల్లల కోసమైతే తన కెరీర్‌ను పణంగా పెట్టిందో ఆ పిల్లల సహకారంతోనే తన చదువును పూర్తి చేసుకుంది. ‘ఇంగ్లిష్‌ విషయంలో మా వారి నుంచి, పిల్లల నుంచి సపోర్టు దొరికింది. ఇంటి పనుల్లో కూడా సాయం చేసేవాళ్లు. కాలేజీ వర్క్‌, అసైన్‌మెంట్స్‌, ప్రెజెంటేషన్లు.. అన్నిటికీ పిల్లల సాయమే. అందుకే లేటు వయసు చదువులో సమస్యల కన్నా సదుపాయాలే ఎక్కువ లభించాయి’ అని చెప్పుకొచ్చింది రాధిక.  డాక్టర్‌ నిరంజన్‌ రెడ్డి, డాక్టర్‌ రఘురామి రెడ్డి వంటి వారి దగ్గర శిష్యరికంతో సైకాలజిస్ట్‌గా రూపాంతరం చెందింది రాధిక.

ఏదైనా సాధ్యమే

కెరీర్‌ అంటే కుటుంబాన్ని డిస్ట్రబ్‌ చేసుకోవడం కాదు, కుటుంబాన్ని చూసుకుంటూ కూడా కెరీర్‌లో ఎదగొచ్చు అని నిరూపించింది రాధిక. ‘వయసు పైబడిన తర్వాత కూడా ఎందరో ఎన్నో సాధించారు. ఆన్‌లైన్‌ కోర్సులు వచ్చాయి. ఇంట్లో ఉండే కెరీర్‌ను మలచుకోగలిగే అవకాశాలున్నాయి. బిజినెస్‌ కూడా ఇంట్లో కూర్చుని చేయవచ్చు. పెండ్లి కాగానే ఇక అంతా అయిపోయింది. నేనేమీ చేయలేను అనుకోవద్దు. ఇష్టంగా కష్టపడితే ఏదైనా సాధ్యమే’ అని చెబుతుంది రాధిక. ఇది చెప్పినంత తేలికేం కాదు. ఈ ప్రయత్నంలో తరచూ సమస్యలు పలకరిస్తూ ఉంటాయి. సమస్యలు వస్తేనే కదా, వాటిని అధిగమించడం తెలుస్తుందనేది ఆమె భావన. ఒక సైకాలజిస్ట్‌గా ఎందరి జీవితాలనో తీర్చిదిద్దారు రాధిక. నిరాశలో కూరుకుపోయిన ఎందరికో ఆశాజ్యోతి చూపించింది. బతుకుపై నమ్మకాన్ని కలిగించింది. తన జీవితాన్నే ఉదాహరణగా చెప్పి వెన్నుతట్టి ప్రోత్సహించింది. “నాకే ఎందుకొచ్చిందీ సమస్య’ అన్న ఆలోచన నుంచి బయటపడాలి. పరిస్థితులనో, మనుషులనో నిందించవద్దు. ఆలోచనా విధానం, నమ్మకాలు, దృష్టికోణం అనేవే ముఖ్యమైనవి. వాటిని మార్చుకోవాలి. రియాలిటీకి దగ్గరగా ఆలోచన ఉండాలి. మనలో ప్రతి ఒక్కరికీ సమస్యను పరిష్కరించగలిగే సత్తా ఉంటుంది. కాని భావోద్వేగాలు ఆ సామర్థ్యాన్ని కప్పేస్తాయి. వాటి తెర తొలగిస్తే పరిష్కారం లభిస్తుంది. సాధ్యం కాకపోతే నిపుణులను కలవడానికి వెనుకంజ వేయవద్దు’ అని చెబుతుంది డాక్టర్‌ రాధిక నల్లాన్‌ ఆచార్య. 

నీలోనే సమాధానం

సైకాలజిస్ట్‌ కావాలనుకున్న తన లక్ష్యం నెరవేరింది. ఆ చదువు ఆమె ఆలోచనా వైఖరిని, భావోద్వేగాలను, వ్యక్తిత్వాన్నీ మార్చేసింది. అంతకు ముందు తనకే ఎందుకు ఇలా అవుతున్నది? సమస్యలన్నీ తననే చుట్టుకుంటున్నాయనే భావనలో ఉండేది రాధిక. తనను తాను ఎప్పుడూ ఒక బాధితురాలిగా ఊహించుకునేది. తన జీవితాన్ని తీర్చిదిద్దుకోలేకపోతున్నానే అని అనుక్షణం ఒత్తిడికి గురయ్యేది. ‘నా పరిస్థితులను మార్చుకోవడానికే ఈ రంగంలోకి వచ్చాను కాబట్టి నేర్చుకుంటున్న ప్రతిదీ నా లోపాలను అధిగమించడం కోసం ఉపయోగించాను. మన జీవితంలో కొన్ని అవాస్తవిక అంచనాలుంటాయి. అవన్నీ నిజం కావని అర్థం చేసుకున్నాను. ఇందుకు దృష్టికోణం మారాలి. ఆ తరువాత జీవితాన్ని మెరుగుపర్చుకోవడం పెద్ద కష్టమేమీ కాద’ని రాధిక అభిప్రాయపడుతుంది. ఎందరి జీవితాలనో తన నోటి మాటతో తీర్చిదిద్దిన ఆమె మాత్రం ఎవరి జీవితంలోని సమస్యలకు వాళ్లే పరిష్కారం వెతుక్కోవాలని చెబుతారు. సైకాలజిస్ట్‌లు ఆ వెతుక్కునే సామర్థ్యాన్ని పెంచుతారంతే అని చెబుతుంది.