శుక్రవారం 04 డిసెంబర్ 2020
Zindagi - Oct 31, 2020 , 01:53:30

మనలోని.. ఈ రెండూ తెలుసుకుందాం!

మనలోని.. ఈ  రెండూ తెలుసుకుందాం!

ఇంట్లో అయినా, పని చేసే చోటయినా మనకంటూ ఓ గుర్తింపు రావాలంటే నిరంతర పరిశ్రమ ఒక్కటే సరిపోదు. మనలోని బలాలు, బలహీనతలు తెలుసుకోవాలి. బలాలను ఎక్కడ ఉపయోగించాలి, బలహీనతలను ఎలా అధిగమించాలో తెలుసుకోగలిగితేనే విజయం సాధ్యమవుతుంది.

  • పనిచేసే చోట ఒత్తిడి సహజం. రకరకాల ఉద్వేగాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అయితే ఏ సందర్భాల్లో ఒత్తిడికి గురవుతున్నామో గుర్తించాలి. ఆయా సందర్భాల్లో ఎలా స్పందించాలో ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ముందస్తుగా సిద్ధం కావడం వల్ల కంగారు పడాల్సిన అవసరం ఉండదు.
  • మనలో ఎన్ని బలాలు ఉన్నా.. బలహీనతలూ కాచుకొని ఉంటాయి. ఈ సమయంలో ఇతరుల సానుభూతిని కోరుకోవద్దు. దీనివల్ల అవతలి వ్యక్తులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని గుర్తించండి. మీకు ఎదురైన సమస్యను మీ అంతట మీరే పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. దాన్ని సవాలుగా స్వీకరించండి. ఆలస్యమైనా స్వశక్తితో ఆ పనిని చక్కబెట్టండి.
  • ఇతరుల మెప్పుకోసం ప్రయత్నించొద్దు. చేసిన ప్రతి పనినీ ఎవరో ప్రశంసించాలని భావించొద్దు. తమలోని ప్రతిభను అందరూ గుర్తించాలనే ఆరాటంలో మల్టీటాస్కింగ్‌ రిస్క్‌ చేయొద్దు. ఈ తరహా పనితనం అన్ని వేళలా సాధ్యపడకపోవచ్చు. ఇదే ధోరణిని కొనసాగిస్తూ పోతే తొందరపాటులో ఏ పనీ సరిగ్గా చేయలేకపోవచ్చు. అందుకే మీకు అప్పగించిన పనిని సమర్థంగా నెరవేర్చండి. మెప్పు దానంతట అదే వస్తుంది.
  • ఒక పనిని గడువులోగా పూర్తి చేయాల్సినప్పుడు పక్కా ప్రణాళిక అవసరం. అందుకు తగ్గట్టుగా మానసికంగానూ సిద్ధంగా ఉండాలి. ఈలోపు ఇతరులు తమ పనిని అప్పగిస్తే, వారి కోసం మీ పనిని పక్కన పెట్టకండి. ‘నా పని పూర్తయ్యాక చేస్తాన’ని ముందుగానే చెప్పేయండి. అనవసరమైన మొహమాటాల కారణంగా మీ బాధ్యత అసంపూర్ణంగా మిగిలిపోయి ఒత్తిడికి గురవ్వాల్సి వస్తుంది.