బుధవారం 25 నవంబర్ 2020
Zindagi - Oct 30, 2020 , 01:54:37

ప్రపంచంలో సగం

ప్రపంచంలో సగం

ఆమె.. అమెరికా అధికారస్వామ్యంలో సగం,  అంతర్జాతీయ ద్రవ్యనిధిలో సగం! ప్రపంచ బ్యాంకులో సగం, ప్రపంచ ఆరోగ్య సంస్థలోనూ సగమే! అద్దాల గోడలను బద్దలుకొట్టి, వివక్ష వెన్ను విరిచి విశ్వ వేదిక మీద తమను తాము నిరూపించుకుంటున్నారు భారతీయ మూలాలున్న మహిళలు.. 

1. నికీ హేలీ (48)

అమెరికా రాజకీయవేత్త

కమలా హ్యారిస్‌ డెమొక్రాటిక్‌ పార్టీ తరఫున అద్భుతాలు సాధిస్తుంటే... రిపబ్లికన్‌ పార్టీలో తన ఉనికిని ఘనంగా చాటుకుంటున్నారు నిమ్రత ఉరఫ్‌ నికీ హేలీ. పంజాబీ కుటుంబానికి చెందిన నికీ 

అకౌంట్స్‌లో దిట్ట. ఓ మిలటరీ అధికారిని ప్రేమించి పెండ్లి చేసుకుంది. ఇక నికీ స్థిరపడిపోయినట్టే అనుకున్నవారిని ఆశ్చర్యపరుస్తూ, ప్రజాజీవితంలోకి అడుగుపెట్టింది. భారతీయ సంతతికి చెందిన తొలి మహిళా గవర్నర్‌గా, తొలి రాయబారిగా చరిత్ర సృష్టించింది. ట్రంప్‌కు నమ్మినబంటుగా ఉన్నా, అవసరం అయితే తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టేస్తుంది. ఓ 

నివేదిక ప్రకారం... అమెరికాలో అధ్యక్ష పదవి చేపట్టడానికి అర్హత కలిగిన మహిళలలో నికీ హేలీది తొలి స్థానం. 

2. కమలా హ్యారిస్‌ (56)

అమెరికా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థి

సాంకేతిక విప్లవం పుణ్యమా అని, అమెరికాలో తీసుకునే ప్రతి నిర్ణయం మన జీవితాల మీదా ప్రభావం చూపుతుంది. అందుకనే, కమలా హ్యారిస్‌ ఆ దేశ ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్నదని తెలియగానే భారతీయులలో ఉత్కంఠ మొదలైంది. ఈ పీఠానికి పోటీ పడుతున్న తొలి నల్లజాతి స్త్రీ కమల. 

నిజానికి, ‘తొలి’ రికార్డులు తనకి కొత్తేమీ కాదు. క్యాలిఫోర్నియా అటార్నీ జనరల్‌ పదవిని చేపట్టిన తొలి భారతీయురాలు, అమెరికన్‌ సెనెట్‌లోకి అడుగుపెట్టిన తొలి దక్షిణాసియా మహిళ.. ఆమే! అందుకే జాతి వివక్షతో నివురుగప్పిన అగ్రరాజ్యాన్ని, కమలా హ్యారిస్‌ మాత్రమే సంబాళించగలదనే నమ్మకం పెరుగుతున్నది. కమల తల్లి శ్యామలా గోపాలన్‌ అమెరికాలో స్థిరపడిన వైద్యురాలు. పౌరహక్కుల కోసం పోరాడుతూ, ఆ ఉద్యమంలోనే పరిచయం అయిన ఓ జమైకన్‌ను వివాహం చేసుకున్న అభ్యుదయవాది. ఆ లక్ష్యాలకు ప్రతిరూపమే కమలా హ్యారిస్‌. 

3. అన్షులా కాంత్‌ (60)

మేనేజింగ్‌ డైరెక్టర్‌- చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌ ప్రపంచ బ్యాంకు 

అన్షులా కాంత్‌ భర్త వారణాసిలో చార్టర్డ్‌ అకౌంటెంట్‌. కాబట్టి, రిటైర్మెంట్‌ తర్వాత హాయిగా అక్కడే సేదతీరాలని భావించింది. ఈలోగా ప్రపంచ బ్యాంక్‌ నుంచి పిలుపు, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా చేరమంటూ.  స్టేట్‌ బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరిన కాంత్‌, 2018 నాటికి మేనేజింగ్‌ డైరెక్టర్‌ స్థాయికి చేరుకుంది. బ్యాంక్‌ నిరర్థక ఆస్తుల పనిపట్టడంలో కాంత్‌ పాత్ర చాలానే ఉంది. కొవిడ్‌ ప్రళయకాలంలో, ప్రపంచబ్యాంక్‌ వందకు పైగా దేశాల అర్థిక వ్యవస్థలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఆ నిర్ణయాలలో ఆమెది చాలా ముఖ్యమైన భూమిక.

4. ప్రీతి పటేల్‌ (48)

బ్రిటన్‌ హోమ్‌ సె్రక్రటరీ

ఉగాండా చరిత్రలో ఈదీ అమీన్‌ శకం ఓ పీడకల. ఈ నియంత, ఎంత క్రూరుడంటే... అతనో నరమాంస భక్షకుడని చాలామంది నమ్ముతారు. అమీన్‌ పీడ నుంచి తప్పించుకున్న ఓ గుజరాతీ జంట ఇంగ్లండ్‌కు వలస వెళ్లింది. కొత్త చోట కష్టాలకు ఎదురీది... జీవితంలో స్థిరపడింది. వాళ్లకు పుట్టిన పాపే ప్రీతి పటేల్‌. వలస బతుకులోని చేదు అనుభవాలు ఆమెను రాజనీతి శాస్త్రం వైపు నడిపించాయి. పట్టుబట్టి బ్రిటిష్‌ పార్లమెంట్‌కు పోటీచేసి గెలిచింది. ‘బ్రెగ్జిట్‌' ఉద్యమంలో కీలకపాత్ర వహించింది. ప్రీతి పటేల్‌ ప్రస్తుతం బ్రిటన్‌ హోమ్‌ సెక్రటరీ. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కి ప్రీతి అంటే ఎంతో నమ్మకం. రాబోయే రోజుల్లో తనే ప్రధాని అవుతుందనేది అక్కడక్కడా వినిపించే విశ్లేషణ.

5. గీతా  గోపీనాథ్‌ (48)

ముఖ్య అర్థికవేత్త అంతర్జాతీయ  ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్‌) 

గీతా గోపీనాథ్‌కు ఏడేండ్ల వయసు ఉన్నప్పుడు... ఆమె తండ్రి కూరగాయలను కుప్పగా పోసి, వాటితో గుణింతాలు నేర్పే ప్రయత్నం చేశారు. నలభై ఏండ్లు తిరిగేసరికి... ఆమె దేశాధ్యక్షులతోనే ఎక్కాలు వల్లె వేయిస్తున్నది. ఎంతైనా, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్‌)కి ముఖ్య అర్థికవేత్త (చీఫ్‌ ఎకానమిస్ట్‌) కదా! లక్ష్మీదేవిలాగే, గీత జీవితంలో కూడా స్థిరత్వం తక్కువ. తల్లిదండ్రులది కేరళ. తాను పుట్టింది కోల్‌కతాలో, పెరిగింది మైసూరులో. ఉన్నత చదువులేమో ఢిల్లీలో! క్రీడల మీద ఆసక్తి ఉన్నా, కెరీర్‌ కోసం వాటిని పక్కన పెట్టింది. చీఫ్‌ ఎకానమిస్ట్‌గా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే కొవిడ్‌తో ప్రపంచం విలవిల్లాడుతున్నా.. తను మాత్రం నిబ్బరంగా బాధ్యతలు నిర్వర్తించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అంచనా వేస్తూ, విలువైన సూచనలు అందించింది.

6. సౌమ్య స్వామినాథన్‌ (61)

చీఫ్‌ సైంటిస్టు,  ప్రపంచ ఆరోగ్య సంస్థ 

హరిత విప్లవ సృష్టికర్త ఎమ్మెస్‌ స్వామినాథన్‌ కూతురుగా పరిచయం చేసుకోవాల్సిన అగత్యం ఏమాత్రం లేదామెకు. ప్రపంచ ఆరోగ్య సంస్థలో చీఫ్‌ సైంటిస్టుగా తనదైన గుర్తింపు ఉండనే ఉంది. కొవిడ్‌ నేపథ్యంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేక విమర్శలు ఎదుర్కొన్నా... సౌమ్య స్వామినాథన్‌ నిబ్బరంగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగని, లేనిపోని భ్రమలను కల్పించడం లేదు. కొవిడ్‌ టీకా అందరికీ అందుబాటులోకి రావాలంటే కనీసం రెండేండ్ల్లు పడుతుందని కుండబద్దలు కొట్టేశారు. వైరస్‌ నియంత్రణలో ప్రభుత్వాల లోపాలను ఎండగట్టారు. శిశు వైద్యురాలిగా సౌమ్య ప్రస్థానం మొదలైంది. పిల్లల్లో క్షయవ్యాధి మీద అరుదైన పరిశోధనలు చేయడంతో ప్రపంచదృష్టిని ఆకర్షించింది. ఆ డాక్టరమ్మ ఇప్పుడు అందరి బాధలు తీర్చే పెద్దక్కగా మారారు.