శుక్రవారం 04 డిసెంబర్ 2020
Zindagi - Oct 29, 2020 , 00:07:32

పల్లెపాటల పచ్చబొట్టు!

పల్లెపాటల పచ్చబొట్టు!

ఆడపిల్ల..  పోరు పెడితే.. పొయ్యింట్లో పోపు గింజలేరుకుంటుంది. ప్రోత్సహిస్తే.. ప్రతిభావంతురాలిగా ప్రావీణ్యం చాటుతుంది.ఆదరిస్తే.. ఆణిముత్యమై అవని అంతా వెలుగుతుంది. స్వేచ్ఛనిస్తే.. విజయ గీతికలను వినిపిస్తుంది. దివ్యశ్రీలా జానపద పాటకు పచ్చబొట్టయి సందడి చేస్తుంది. 

పెండ్లయిన తర్వాత కెరీర్‌ మొదలుపెట్టి.. సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణిస్తున్న దివ్య శ్రీ పరిచయం.. ఒకప్పుడు.. నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో షూటింగ్‌ జరుగుతున్నది. జనాలంతా ఎగబడి చూస్తున్నారు. ‘నాన్నా.. నేనూ షూటింగ్‌ చూస్తా ప్లీజ్‌!’ అంటూ ఓ అమ్మాయి వాళ్ల నాన్నను అడిగింది. ఆ తండ్రి కూతుర్ని భుజాలపై ఎక్కించుకొని షూటింగ్‌ చూపించాడు. ఇప్పుడు.. ఆ అమ్మాయే నటి అయ్యింది. ఆమె షూటింగ్‌లను  జనాలు ఎగబడి చూస్తున్నారు. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ ఇస్తున్నారు. ప్రేక్షకుల ఆదరణకు తగ్గట్టుగా సహజ నటనతో అందరినీ మెప్పిస్తూ పల్లె పాటలకు ప్రతినిధిగా మారింది దివ్యశ్రీ. 

సినీ హీరోలు, హీరోయిన్లకే అభిమానులుంటారా? యూట్యూబ్‌ స్టార్లకు కూడా అభిమాన సంఘాలు ఉంటాయి. అలాంటి స్టార్స్‌లో ఒకరు దివ్యశ్రీ. పుట్టి పెరిగింది నాంపల్లిలోని జంగంబస్తీ. ఇప్పుడు ఉండేది సిరిసిల్ల దగ్గర మండపల్లి. ఎంఎం మ్యూజిక్‌ ద్వారా పరిచయం అయిన దివ్య ఇప్పటివరకు  ఇరవైకి పైగా జానపద గీతాల్లో నటించింది. ఆమె నటించిన పాటలన్నీ అభిమానుల ఆదరణను పొందినవే. అప్‌లోడ్‌ చేసిన గంటల వ్యవధిలోనే లక్షల వ్యూస్‌ సంపాదించిన రికార్డు కూడా ఉంది. తాజాగా ‘పచ్చబొట్టు’ అనే సాంగ్‌లో నటించింది తను. అప్‌లోడ్‌ చేసి నాలుగు రోజుల్లోనే ఆ పాట 3 లక్షల వ్యూస్‌ దాటింది. ‘పానమంతా గుంజుతుందే బావా.. నా గుండెపై పచ్చబొట్టయినావా’ అంటూ సాగే ఈ పాటలో దివ్యశ్రీ జీవించేసింది. పల్లెటూరి బావా మరదళ్లకు కనెక్ట్‌ అయ్యే గీతం ఇది. 

మెచ్చిన పని చేయాలని..  

దివ్య ఇంటర్‌ వరకే చదువుకున్నది. ఆ తర్వాత ప్రేమ. ఇంట్లోవాళ్ల మద్దతు లభించలేదు. పైగా వాళ్లతో మాటలు బంద్‌ అయ్యాయి. నగరంలో పుట్టినా, మెట్టినిల్లు పక్కా పల్లెటూరు కావడంతో అక్కడి పరిస్థితులు వేరుగా అనిపించేవి. ఇవన్నీ దివ్యశ్రీకి కొత్తగా అనిపించాయి. పుట్టినింట్లో ఆమె గావురాల బిడ్డ. కానీ ఇక్కడ అలా కాదు కదా? భర్త విజయ్‌కుమార్‌ కూడా స్టూడెంటే. అప్పుడే, దివ్యశ్రీకి భవిష్యత్‌ గుర్తొచ్చింది. ‘ఇంట్లోవాళ్లను కాదని వచ్చేశా. నచ్చని పనిచేసి దూరమయ్యా. వాళ్లు మెచ్చే పనేదైనా చేసి దగ్గరవ్వాలి. దాంతోపాటు నా టాలెంట్‌ ఏంటో.. నా భర్త ప్రోత్సాహం ఏంటో అందరికీ తెలిసేలా చేయాలి. అందరినీ సంతోషపెట్టాలి’ అనుకున్నది. చిన్నప్పుడు నాన్నతో కలిసి చూసిన షూటింగ్‌లు గుర్తుకొచ్చి నటి కావాలని అనుకున్నది. 

పెండ్లయిన తర్వాత  

దివ్యశ్రీకి విజయం అంత ఈజీగా ఏం రాలేదు. చాలా కష్టపడింది. ప్రతీరోజూ నిద్ర లేవగానే లక్ష్యాన్ని గుర్తుచేసుకునేది. ‘పెండ్లయిన అమ్మాయేంటి? ఇంట్లో వంట చేసుకుంటూ నిమ్మలంగా ఉండక.. ఈ పనికి మాలిన వీడియోలు ఏంటి?’ అని ఎవరు ఎన్ని రకాలుగా అన్నా పట్టించుకోలేదు. టిక్‌టాక్‌ వంటి యాప్స్‌ తన ప్రతిభకు తోడయ్యాయి.  రోజుకు ఐదారు వీడియోలు పోస్ట్‌ చేసేది. ప్రతీ వీడియోలో చీరకట్టులో పల్లెటూరి అమ్మాయి గెటప్‌లో కనిపించేది. నిరుత్సాహపరిచేలా కామెంట్స్‌ వచ్చినా పట్టించుకోలేదు. ఓపికతో ముందుకు వెళుతూ నటనలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందడానికి ప్రయత్నించింది. అవకాశాలు ఉన్నాయని తెలిసిన ప్రతీచోటా సంప్రదించేది. 

భర్త  ప్రోత్సాహం 

అవకాశాలు పెరిగాయి. ఒక్క చాన్స్‌ వస్తే చాలనుకున్న దివ్య, రెండు చేతులా సంపాదించడమూ మొదలుపెట్టింది. ఒకరోజు మంచిర్యాలలో, ఇంకోరోజు నల్లగొండలో.. ఇలా ఎంతదూరమైనా ఇబ్బంది అని భావించకుండా తన నటనా ప్రయాణం కొనసాగిస్తున్నది. ‘యూట్యూబ్‌ చిన్న మాధ్యమం. దీనికోసం అంత రిస్క్‌ అవసరమా?. ఒకట్రెండు పాటల్లో నటించావు కదా. ఆపెయ్‌ ఇక’ అన్నారట దగ్గరివాళ్లు. కానీ ఆమె ఆగిపోలేదు. ‘ఏదో ఒకట్రెండు పాటల్లో నటించి సర్దేసుకొని వెళ్లడానికి ఈ రంగాన్ని ఎంచుకోలేదు. నాకంటూ ఓ లక్ష్యం ఉంది’ అనేది ఆమె.  భర్తను అడిగితే.. ‘నీకు నచ్చిన పని చెయ్యి. నిజాయతీగా చెయ్యి. నేను అడ్డు పడను’ అని చెప్పాడు.   

అమ్మ మనసు గెలిచి.. 

నటన అంటే చాలా సమస్యలు ఉంటాయి. ఇక్కడ అంతా మంచివాళ్లే ఉండరనేది అందరూ అనుకునే మాటే.  దివ్యశ్రీకి కూడా ఆ విషయాలు తెలుసు. కానీ ఆమె మాత్రం, ‘మన పని మనం చేసుకుంటూ వెళితే మన జోలికి ఎవరూ రారు’ అంటున్నది. ఎక్కడైతే తల్లిదండ్రుల మనసు నొప్పించాను అని బాధపడిందో.. అక్కడే వారి మనసును గెలుచుకున్నది. కన్నవాళ్ల ప్రేమను తిరిగి పొందుతున్నది దివ్య. షూటింగ్‌ ఎక్కడ ఉంది? సాంగ్‌ ఎవరిది? రెమ్యునరేషన్‌ ఎంత?.. లాంటి విషయాలన్నీ తల్లితోనే చర్చిస్తుంది. సాంగ్‌ రిలీజ్‌ కాగానే మొదట అమ్మకే పంపిస్తుందట. ‘బాగా చేసినవ్‌. మంచి ఆదరణ వస్తుంది. చాలా అందంగా ఉన్నావ్‌' అని తల్లి మెచ్చుకుంటూ ఉంటే.. ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిదని అంటున్నది దివ్య. 

సినిమాల్లో నటిస్తా 

జానపద గీతాల్లోనే కాకుండా షార్ట్‌ ఫిలిమ్స్‌లోనూ నటిస్తున్నాను. అందరూ నన్ను సహజ నటి అంటుంటారు. ఆ మాట విన్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నా నటనను మెచ్చి ఎవరైనా సినిమాలు, సీరియల్స్‌లో అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాను. నాకు నటన అంటే చాలా ఇష్టం. జానపదాలే నన్ను నిలబెట్టాయి. అందరు ఆడపిల్లల్లా  వంటింట్లోనే ఉండిపోతే ఇంత పేరు, గుర్తింపు సంపాదించేదాన్ని కాదు. కాబట్టి అమ్మాయిల అభిరుచులను గుర్తించాలి, విలువ ఇవ్వాలి. దివ్యశ్రీ 

చీరకట్టే ఇష్టం 

దివ్యశ్రీ కెరీర్‌లో బాగా హిట్‌ అయిన పాటలు - వీఆర్‌టాకీస్‌ ‘ఓసారి రావా బావా’.. ‘పచ్చబొట్టు’.. కేఆర్‌ఆర్‌ మ్యూజిక్‌.. ‘జొన్నశేన్ల నువ్వు నిల్చుంటే’.. ‘గుట్టకింద బాయికాడ’. ఇవన్నీ మిలియన్ల కొద్ది వ్యూస్‌ సంపాదించి వైరల్‌ అయ్యాయి కూడా. ఈ పాటలు లేని మొబైల్‌ ఫోన్స్‌ ఉండవు కూడా. తలపై గంప పెట్టుకొని.. భుజంపై తువాలు వేసుకొని.. ముక్కు పుడక ధరించి.. కొంగు నడుముకు చుట్టి పొలం గట్ల వెంట ఆమె నడుస్తుంటే పల్లెతనం పరిమళించినట్లు అనిపిస్తుంది. ‘ఇక చాలు’ అని తన తల్లి అంటున్నా.. ‘ఇదొక్కటే ఇదొక్కటే’ అనుకుంటూ అందర్నీ ఒప్పిస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తూ పక్కింటి పల్లెటూరి పిల్లలా అలరిస్తున్నది దివ్య. నగరంలో పుట్టినా తనకు పల్లెటూరి సంస్కృతి అంటేనే ఇష్టమని అంటున్నది. చీరకట్టులోనే తాను అందంగా ఉంటానని చెబుతున్నది.