గురువారం 28 జనవరి 2021
Zindagi - Oct 29, 2020 , 00:07:29

ఓ ప్రౌఢ..ప్రేమయాత్ర!

ఓ ప్రౌఢ..ప్రేమయాత్ర!

నెట్‌ఫ్లిక్స్‌లో ఈమధ్యే విడుదలైన వెబ్‌సిరీస్‌ ‘సూటబుల్‌ బాయ్‌'. విక్రమ్‌సేథ్‌ నవలను దర్శకురాలు మీరా నాయర్‌ నాటకీయంగా మలిచారు. ఇందులోని వందలకొద్దీ పాత్రల మధ్య.. సయీదా బాయిగా ప్రేక్షకుల గుండెల్ని సుతిమెత్తగా మెలి తిప్పుతారు టబూ.  భారత్‌.. పాకిస్థాన్‌..

ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన పచ్చి బాలింతరాలిని తలపించే దేశం. విభజన గాయాలు ఇంకా మానని వాతావరణం.తమదికాని దేశంలో ఉంటున్నామేమో అన్న అభద్రతలో ముస్లింలు. లౌకిక రాజ్యంగా ప్రకటించడం ద్వారా తమ మతానికి ఇబ్బందులు సృష్టించారేమో అన్న అసహనంలో హిందువులు. ఇదీ.. విక్రమ్‌సేథ్‌ ‘సూటబుల్‌ బాయ్‌' వెబ్‌సిరీస్‌కు నేపథ్యం. హిందూ ముస్లిం ఘర్షణలు, ఇంగ్లిష్‌ మీద మమకారం, సంపన్నుల క్లబ్‌లలో చిందులు, అప్పుడప్పుడే కలుషితం అవుతున్న రాజకీయాలు.. ఈ పరిణామాలన్నీ ఓవైపు చకచకా జరిగిపోతుంటాయి. ఆమధ్యలోనే తళుక్కున మెరుస్తుంది సయీదాబాయ్‌ పాత్రలో టబూ! తనో గాయని, ఖరీదైన వేశ్య. అసలే పూలచెండు లాంటి మెత్తని భాష.. ఉర్దూ! ఆమె గజల్స్‌ పాడుతుంటే, ఆ పూలగుత్తిని తేనెలో ముంచి పెదాలకు అద్దినట్టు ఉంటుంది. ఆ అందానికితోడు నడివయసు ప్రౌఢత్వం. అందుకేనేమో, ఆ ఇంటి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి నవాబులూ, రాజాబాబులూ పోటీపడుతుంటారు. ఆ జాబితాలోనే మాన్‌ కపూర్‌ అనే కుర్రాడూ చేరిపోతాడు. అతను ఓ మంత్రిగారి అబ్బాయి. తొలిచూపుకే, తొలి పాటకే ఆమె ప్రేమలో పడిపోతాడు. తననో అందమైన అంగడి బొమ్మలా భావించే మనుషుల మధ్య ఆ యువకుడి ప్రేమ ఆమెను వివశురాల్ని చేస్తుంది. దర్శకురాలు మీరానాయర్‌ టబూ పాత్ర విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ నిలువెత్తు సౌందర్య దేవతలా దర్శనమిస్తుంది సయీదా. ఈ శృంగార అధ్యాయం.. ప్రధాన కథకు అనుబంధం. తన కూతురికి తగిన వరుడి కోసం (సూటబుల్‌ బాయ్‌) ఓ తల్లి వెతుకులాటే నవల ఇతివృత్తం.  అలనాటి సమాజాన్ని అర్థం చేసుకోడానికి ఉపకరించే వెబ్‌ సిరీస్‌ ఇది. 


logo