శుక్రవారం 04 డిసెంబర్ 2020
Zindagi - Oct 28, 2020 , 00:25:44

చిరునవ్వుల వరమిస్తూ..

చిరునవ్వుల వరమిస్తూ..

కోటికిపైగా జనాభా ఉన్న భాగ్యనగరంలో.. కూటికి లేని అభాగ్యులెందరో! నిలువ నీడ లేకుండా.. ఫుట్‌పాత్‌లు, పబ్లిక్‌ పార్కుల్లో వానకు తడుస్తూ, చలికి వణుకుతూ ముడుచుకొని పడుకునే నిర్భాగ్యులెందరో! అలాంటివారిని చూసి కొందరు జాలి పడుతారు. మరికొందరు చూసీచూడనట్లు ‘మనకెందుకులే’ అని పక్కకు తప్పుకుంటారు. ఇంకొందరు  రూపాయో రొట్టె ముక్కో దానం చేసి తృప్తిపడుతారు. కానీ, అర్చన మాత్రం అలా కాదు. అనామకులుగా కనిపించిన వారిని అక్కున చేర్చుకుంటున్నారు. ‘బ్రింగ్‌ ఎ స్మైల్‌' ట్రస్టు ద్వారా ఆ మోములపై చిరునవ్వులు పూయిస్తున్నారు. 

‘ఇవ్వడంలో ఉన్న తృప్తి వేరే ఎందులోనూ దొరకదు’ అని నమ్మే అర్చన, 2012లో ‘బ్రింగ్‌ ఎ స్మైల్‌' ఫౌండేషన్‌ను స్థాపించారు. ఆ సమయంలో తాను కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ ప్రొఫెషనల్‌ మాత్రమే కాదు.. ఓ ఏడాది వయసున్న పాపకు తల్లి కూడా. ఓవైపు ఉద్యోగ బాధ్యతలు, మరోవైపు కూతురి ఆలనాపాలన. అలాంటి సందర్భంలో ఓరోజు వాళ్ల అమ్మ ఫోన్‌ చేసి.. “మన బీరువాలో ఇబ్బడిముబ్బడిగా బట్టలున్నాయి. ఉపయోగించని వస్తువులూ ఉన్నాయి. వీటిని ఏమీ లేనివారికి ఇవ్వొచ్చు కదా” అని సలహా ఇచ్చారు. “ నగరంలో ఎంతోమంది దగ్గర ఎన్నో రకాల వస్తువులు నిరుపయోగంగా ఉంటున్నాయి. అదే సమయంలో అనేకమంది కట్టుకోవడానికి సరైన బట్టలు లేకుండా, తినడానికి సరైన తిండి లేక బతుకులీడుస్తున్నారు. ఈ రెండు వర్గాల 

మధ్య నువ్వు వారధిగా నిలుస్తావా? అక్కడ అనవసరంగా ఉన్నవాటిని, ఇక్కడ అవసరం ఉన్నవారికి అందిస్తావా?” అని అడిగారు. అయితే, ఆఫీస్‌ పనులతో తీరిక లేకుండా ఉన్న అర్చన, ఆ సలహాను సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, తల్లి మాటలు.. ఆమె మనసులో ఒక బీజాన్ని వేశాయి. ఈ క్రమంలో పాప కోసం లాంగ్‌లీవ్‌ పెట్టిన అర్చనకు ఖాళీ సమయం దొరికింది. దీంతో సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టి, ‘బ్రింగ్‌ ఎ స్మైల్‌' ఫౌండేషన్‌కు శ్రీకారం చుట్టారు. మొదటగా తాము ఉండే గేటెడ్‌ కమ్యూనిటీలోని పలు కుటుంబాలవారికి ‘మీకు అవసరం లేని దుస్తులు, వస్తువులు ఇవ్వండి. వాటిని నగరంలోని అభాగ్యులకు అందిద్దాం’ అని మెసేజ్‌ పెట్టారు. దీనికి మంచి స్పందన వచ్చింది. 50 మంది దా కా ముందుకొచ్చి, జంటనగరాల్లోని బీదాబిక్కీకి సాయం చేశారు. 

తల్లి మరణంలోంచే..

అర్చన పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. తండ్రి మలయాళీ, తల్లి సింధీ. సికింద్రాబాద్‌లోని సెయింట్‌ ఆన్స్‌ హైస్కూల్‌లో ప్రాథమిక విద్య, సెయింట్‌ ఫ్రాన్సిస్‌ డిగ్రీ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్‌ చేశారు. హెచ్‌ఎస్‌బీసీ, యాహూ, మైక్రోసాఫ్ట్‌, సీఏ టెక్నాలజీస్‌ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలోనే తల్లి సూచన మేరకు ‘బ్రింగ్‌ ఎ స్మైల్‌' ఫౌండేషన్‌ను స్థాపించి, సేవా కార్యక్రమాలు చేపట్టారు. అయితే, 2013లో అర్చన వాళ్ల అమ్మ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బారినపడటంతో చికిత్స కోసం ఎన్నో ఆసుపత్రులు తిరిగారు. అప్పుడే నిలువ నీడ లేక రోడ్లపైన, ట్రాఫిక్‌ ఐలాండ్ల మధ్య బతుకులీడుస్తున్న ఎందరో అభాగ్యులను దగ్గర నుంచి చూశారు. 2014లో క్యాన్సర్‌తో తల్లి మృతి చెందారు. తాను ఎంతగానో ప్రేమించే తల్లిని కోల్పోవడంతో, అర్చన ఒక్కసారిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. అదే తన జీవితంలో అత్యంత కఠినమైన సమయం. అప్పుడే ‘ఏమీ లేని నిర్భాగ్యులకు అండగా నిలవాలి’ అన్న తల్లి మాటలను గుర్తు చేసుకున్నారు. తన నిర్ణయాన్ని భర్త అశోక్‌ కూడా ప్రోత్సహించారు. అలా ఓవైపు ఉద్యోగం చేస్తూనే, సామాజిక సేవకు అంకితం అయ్యారు.  

విస్తృతమైన ‘సేవ’లు

ఫుట్‌పాత్‌లపై తలదాచుకునేవారికి దుప్పట్లు, బట్టలు పంచడంతో మొదలైన ‘బ్రింగ్‌ ఎ స్మైల్‌' కార్యక్రమాలను క్రమంగా విస్తరించారు. ఈ ప్రయాణంలో అర్చనకు తోడుగా మరికొంత మంది వలంటీర్లు చేయి కలిపారు. మురికివాడల్లోని పిల్లలకు పుస్తకాలు, బ్యాగులు, పెన్నులు పోగేసి ఇవ్వడం మొదలు

పెట్టారు. ‘బ్రింగ్‌ ఎ స్మైల్‌' పేరుతో వాట్సాప్‌ గ్రూప్‌ను, ఫేస్‌బుక్‌ పేజీని క్రియేట్‌ చేశారు అర్చన. సేవా దృక్పథం ఉన్నవారితోపాటు ‘బ్రింగ్‌ ఎ స్మైల్‌ ఫౌండేషన్‌' సభ్యులను ఇందులో చేర్చారు. ఎవరికి ఏ అవసరం ఉన్నా చిన్న మెసేజ్‌ పెడితే చాలు గ్రూప్‌ సభ్యులు తక్షణమే స్పందిస్తారు. వ్యక్తులకైనా, అనాథాశ్రమాలవంటి సంస్థలకైనా.. ఎవరికి ఏం కావాలన్నా ‘బ్రింగ్‌ ఎ స్మైల్‌' సేకరించి ఇస్తుంది. అలా 2012 నుంచి 2020 వరకూ 50 టన్నులకు పైగా దుస్తులు, ఆటబొమ్మలు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వీటి విలువ రూ.75 లక్షలకు పైనే. 

ఒక్కరితో మొదలై..

ఏక వ్యక్తి సైన్యంలా మొదలైన ‘బ్రింగ్‌ ఎ స్మైల్‌' ఫౌండేషన్‌లో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 400కుపైగా యాక్టివ్‌ సభ్యులున్నారు. వీరే తమ ట్రస్ట్‌కు వెన్నెముక అని అర్చన చెబుతున్నారు. వారి సాయం లేకుంటే తాను ఇంతపెద్ద బాధ్యతను నెరవేర్చేదాన్ని కాదేమోనంటారు. 2017లో ‘బింగ్‌ ఎ స్మైల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌'గా రిజిస్ట్రేషన్‌ చేయించారు. 2019లో సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ సాయంతో ఐదు ఐటీ టెక్‌ పార్క్స్‌, 10 షాపింగ్‌ మాల్స్‌లో మొత్తం 15 స్మైల్‌ బాక్సులు ఏర్పాటు చేశారు. ఇందులో విరాళాలతోపాటు దుస్తులు, దుప్పట్లు, పాత వస్తువులను వేయాల్సిందిగా నగరవాసులను కోరుతున్నారు. 

మూడు విభాగాల్లో..

సంపన్నులు మొదలుకొని సామాన్యుల దాకా ఎక్కువ ఖర్చు చేసేది విద్య, వైద్యంపైనే. దీంతోపాటు సరైన మౌలిక వసతులులేక అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. అందుకోసమే విద్య, వైద్య, మౌలిక వసతుల విభాగంలో ‘బ్రింగ్‌ ఎ స్మైల్‌' విస్తృత సేవలు అందిస్తున్నది. 


‘బ్రింగ్‌ ఎ స్మైల్‌' సేవలు..

  • చలికాలంలో ఫుట్‌పాత్‌లపై కాలం వెళ్లదీసే 7వేల మందికిపైగా దుప్పట్లును పంపిణీ చేశారు. 
  • ఇప్పటిదాకా 250+ చిన్నారుల స్కూల్‌ ఫీజు చెల్లించారు. 
  • కూకట్‌పల్లిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మూడు తరగతి గదులను నిర్మించి ఇచ్చారు. 
  • కూకట్‌పల్లిలోని మైత్రీ అనాథాశ్రమంలో రూ.40 వేలతో వసతులు కల్పించారు. 
  • చదువుకునే పిల్లలకు ‘రియల్‌ పే’ సంస్థ సాయంతో 75 ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు అందించారు. 
  • మార్చి నుంచి జూన్‌ మధ్యలో రూ.12 లక్షలకు పైగా విలువైన నిత్యావసర సరుకుల కిట్లు, హైజీన్‌ కిట్లను అందించారు. 
  • నారాయణపేట జిల్లాలో చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు సంకల్పించారు. ఈ క్రమంలో 550 చేనేత బ్యాగుల తయారీకి ఆర్డర్‌ ఇచ్చారు. వీటిని ఆశ కార్యకర్తలకు అందించారు. 
  • మియాపూర్‌లోని ఓ అనాథాశ్రమంలో 40 మంది అమ్మాయిల కోసం ‘హెగ్రో కెమికల్స్‌' సాయంతో స్కూల్‌ బస్సును అందించారు. ఇప్పుడు పిల్లలంతా రోజూ ఈ బస్సులోనే బడికి వెళ్తున్నారు. 

చిరునవ్వు చూడాలి.. 

మంచి చేయడానికీ, చేయమని చెప్పడానికి దేవుడే అవసరం లేదు. ఏది మంచో, ఏది చెడో తెలుసుకోగలిగే విచక్షణ, జ్ఞానం ఉంటే చాలు. మనదేశంలో సాయం కోసం ఎదురు చూసేవారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ల కోసం ఏదో ఒకటి చేయాలి. వాళ్ల ముఖంలో చిరునవ్వు చూడాలి. చేసేది చిన్న సాయమే కావొచ్చు, అందులో మాటలకు అందని సంతృప్తి కనిపిస్తుంది. అయితే, వారిని ఆదుకోవడమే కాదు.. వారి కాళ్లపై వారు నిలబడేలా చేయడం కూడా బాధ్యతే. ఎందుకంటే ఆకలితో ఉన్నవాడికి ఒక చేపను ఇస్తే, ఆ పూటకే కడుపు నిండుతుంది. కానీ, చేపలు పట్టడం కూడా నేర్పితే జీవితాంతం ఆకలి అనేది లేకుండా పోతుంది. అందుకే పలువురు దివ్యాంగులకు ఆర్థిక సాయం అందించి, సొంతంగా కర్రీ పాయింట్లు, కిరాణా దుకాణాలు పెట్టుకునేలా ప్రోత్సహించాం. 

- అర్చన సురేశ్‌, బ్రింగ్‌ ఎ స్మైల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఫౌండర్‌