శనివారం 05 డిసెంబర్ 2020
Zindagi - Oct 28, 2020 , 00:24:40

మహిళా ప్రేక్షకులే లక్ష్యంగా..

మహిళా ప్రేక్షకులే లక్ష్యంగా..

క్రికెట్‌ ట్రెండ్‌నే మార్చేసిన ఐపీఎల్‌.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టోర్నీల్లో ఒకటిగా నిలిచింది. 13 ఏండ్లుగా కోట్లాది మంది ప్రేక్షకులను అలరిస్తున్న ఈ మెగా టోర్నీ, ప్రస్తుత సీజన్‌లో మహిళా ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్నది. ఈసారి స్త్రీలకు సంబంధించిన ప్రకటనలే 57శాతం ఉన్నట్లు టెలివిజన్‌ రేటింగ్‌ ఏజెన్సీ (టీఏఎం) వెల్లడించింది. 

క్రికెట్‌ అంటే క్రీడాకారులకు, ప్రేక్షకులకే కాదు.. కార్పొరేట్‌ సంస్థలకు కూడా పండుగే. మ్యాచ్‌ల సందర్భంగా తమ ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలు కనిపించాలని పెద్దపెద్ద కంపెనీలు కోరుకుంటాయి. అందుకోసం మ్యాచ్‌లను బ్రాడ్‌కాస్ట్‌ చేసే సంస్థల వద్ద క్యూ కడుతాయి. ఇక క్రికెట్‌ను ఓ మతంలా భావించే భారత్‌లో.. అదీ ఐపీఎల్‌లో ప్రకటనల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, అన్నిటికన్నా భిన్నంగా ప్రస్తుత ఐపీఎల్‌లో మహిళా వినియోగదారులే లక్ష్యంగా రూపొందించిన ప్రకటనలు అధికంగా వస్తున్నాయి. ఆడవాళ్లను ఆకర్షించేలా బ్రాండెడ్‌ ఆభరణాలు, గృహోపకరణాలు, ఇంటిని శుభ్రపరిచే ఉత్పత్తులు, డిటర్జెంట్లు, వాషింగ్‌ పౌడర్లకు సంబంధించిన ప్రకటనలే 57శాతం ఉంటున్నట్టు టెలివిజన్‌ రేటింగ్‌ ఏజెన్సీ (టీఏఎం) వెల్లడించింది. ప్రస్తుతం కొవిడ్‌ నేపథ్యంలో అందరూ ఇండ్లకే పరిమితం కాగా, ఐపీఎల్‌ను వీక్షించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందులో మహిళా ప్రేక్షకుల వాటా 47శాతం ఉన్నది. అయితే, గతంలో ఐపీఎల్‌ టోర్నీ మే-జూన్‌ మధ్యలో జరిగేది. ఆ సమయంలో వేసవి ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలే వచ్చేవి. కానీ, కరోనావల్ల టోర్నీని ‘దసరా-దీపావళి’లాంటి పండుగల సీజన్‌లో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మహిళా ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకొని, ఆభరణాలు, గృహ వినియోగ వస్తువులకు సంబంధించిన ప్రకటనలను ఎక్కువగా ఇస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.