మంగళవారం 01 డిసెంబర్ 2020
Zindagi - Oct 27, 2020 , 00:05:09

అత్త పంతం.. కోడలి జీవితం!

అత్త పంతం.. కోడలి  జీవితం!

మన దృష్టిలో అత్త అంటే గడుసు గయ్యాలిగంపే! ఇక కోడలేమో అత్త సహనాన్ని పరీక్షించే మీటరు. ఈ సమస్యకు పరిష్కారమే లేదా! ‘అత్తలేని కోడలు ఉత్తమురాలూ...’ అని సంసారాన్ని దంచాల్సిందేనా. అలాంటిదేమీ లేదని భరోసా ఇస్తున్నారు ఎస్‌. అనుకృతి. ఈమె బోస్టన్‌ కాలేజిలో, ఆర్థికశాస్త్రంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆ మధ్య తన మిత్రులతో కలిసి ‘భారతీయ స్త్రీల మీద అత్తగార్ల ప్రభావం’ పేరున ఓ పరిశోధన చేప్టటారు. దీని ఫలితాలను విశ్లేషించినప్పుడు ఆసక్తికరమైన విషయాలెన్నో బయటపడ్డాయి.

గ్రామీణ భారతదేశంలో ఇప్పటికీ అక్షరాస్యత శాతం తక్కువ, కుటుంబ నియంత్రణలాంటి విషయాల మీద అవగాహనా తక్కువే. అత్తాకోడళ్ల బంధాలమీద ఈ పరిస్థితులు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో విశ్లేషించే ప్రయత్నం చేశారు అనుకృతి. ఇందుకోసం ఆమె బృందం ఉత్తర్‌ప్రదేశ్‌లోని జాన్‌పూర్‌ జిల్లాలో 18 నుంచి 30 ఏండ్ల లోపున్న వివాహితుల నుంచి సమాచారాన్ని సేకరించారు. ఆ తర్వాత దాన్ని గణాంకాల రూపంలోకి మార్చారు. ఇవి కుటుంబ బంధాల మీద కొత్త వెలుగులను ప్రసరింపజేస్తున్నాయి. విలువైన సూచనలు అందిస్తున్నాయి.

ఒంటరిగా కుదరదు

అనుకృతి విశ్లేషణ ప్రకారం, వివాహితలలో 14 శాతం మందికి మాత్రమే తమంతట తాముగా వైద్యుడి దగ్గరకు వెళ్లే స్వతంత్రం ఉంది. ఇక గ్రామంలోని చుట్టపక్కాలు లేదా నేస్తాల ఇంటికి ఒంటరిగా వెళ్లే స్వేచ్ఛ 12 శాతం మందికి మాత్రమే ఉంది. పిల్లల్ని కనడం, కుటుంబ నియంత్రణ లాంటి విషయాలలో కోడలి మీద అజమాయిషీ చెలాయించే అత్తలు ఉన్న ఇండ్లల్లో ఇలాంటి నిర్బంధం ఎక్కువగా కనిపించింది. కోడలి ఆలోచనల మీద బయటి వ్యక్తుల ప్రభావం ఉంటుందేమో అన్న భయంతో, అత్తలు ఇలాంటి అజమాయిషీ చెలాయిస్తున్నట్టు తెలుస్తున్నది. 

అజమాయిషీకి కారణాలు

ఇంతకీ కోడలి కుటుంబ నియంత్రణ పట్ల అత్తగారికి ఉన్న అభ్యంతరం ఏంటి? 71 శాతం సందర్భాలలో అత్తగారు తన కోడలు మరింతమంది పిల్లలను కనాలని అనుకుంటుందట. నాలుగో వంతు పరిస్థితుల్లో, కుటుంబ నియంత్రణ కోసం వాడే మందుల వల్ల దుష్ఫ్రభావాలు ఉంటాయేమో అన్న అనుమానం ఆమెను భయపెడుతున్నది. కొడుకు కూడా కుటుంబ నియంత్రణకు వ్యతిరేకంగా ఉంటే, ఇక ఆ కోడలి మీద ఉండే ఆంక్షల సంగతి చెప్పనక్కర్లేదు. ఉద్యోగరీత్యా కొడుకు ఇంటికి దూరంగా ఉన్నా కూడా, కోడలి మీద అత్తగారి అజమాయిషీ తీవ్రంగా ఉంటున్నట్టు తేలింది.

ఇంటింటికో గాథ

అత్తాకోడళ్ల బంధం మీద రకరకాల ప్రభావాలు ఉన్నాయంటున్నారు అనుకృతి. అత్తాకోడళ్లు మొదటి నుంచీ ఒకే ఇంట్లో కలిసి ఉంటే, అత్తగారి మార్గదర్శకాలకి విలువ దక్కుతున్నది. అలా కాకుండా అవసాన దశలో కనుక కొడుకు ఇంటికి చేరితే, కోడలిదే పైచేయిగా ఉంటుంది. ఇక కాన్పు సమయంలో అత్తగారు ఇంట్లోనే ఉంటే, రక్తహీనత లాంటి సమస్యలు రావట. అత్తగారు అనుభవజ్ఞురాలు కదా!

భర్త లేదా అత్త అజమాయిషీ హద్దులు మీరినప్పుడు అది 

శారీరికంగా, మానసికంగా కూడా కోడలి ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు అనుకృతి. మరి, ఈ అత్తాకోడళ్ల ఆరళ్లకి పరిష్కారం ఏమిటి అంటే.. సమస్య ఎక్కడ ఉందో గమనించాలి అని సూచిస్తున్నారు. కుటుంబ నియంత్రణ, గర్భధారణలో సమస్యలు, లింగవివక్ష లాంటి విషయాల మీద దంపతులలో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంటుంది ప్రభుత్వం. మరి అత్తగారి సంగతేమిటి! నిరక్షరాస్యత, మూఢ నమ్మకాలు, వంశోద్ధారకుడి కోసం తపన... పెద్దవారిలోనే ఎక్కువగా ఉంటుంది. అందుకని ముందు వారికే అవగాహన కల్పిస్తే, కోడళ్ల పట్ల సానుకూల దృక్పథంతో మెలిగే అవకాశం ఉంటుందని అంటారు.

స్వతంత్రించే కోడళ్ల కథ

కోడళ్లు తమ కాళ్ల  మీద నిలబడుతూ నాలుగు రాళ్లు వెనకేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు, వాళ్ల మాటలకు మరికాస్త బలం చేకూరుతున్నట్టు తేలింది. కుటుంబపరమైన నిర్ణయాలలో, వాళ్ల అధికారానికి విలువ కనిపించింది. స్వయం సహాయక బృందాలలో ఉంటున్నవాళ్లకు కూడా కాస్త స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. అలాంటి బృందంలో సభ్యురాలిగా బయటికి వెళ్లేందుకు, సమావేశాలలో పాల్గొనేందుకు వీరికి త్వరగానే అనుమతి లభిస్తున్నదట. స్నేహితురాళ్ల ప్రభావం కూడా చాలా స్పష్టంగా కనిపించింది.నేస్తాలు తక్కువగా ఉన్న కోడళ్లు... వైద్య శిబిరాలను సందర్శించడానికి కూడా జంకుతున్నట్టు తేలింది. వీరిలో కుటుంబ నియంత్రణకు సంబంధించిన పరిజ్ఞానం కూడా తక్కువే! బయటికి వెళ్లి ఏ పని చేయాలన్నా, కుటుంబసభ్యుల మీద ఆధారపడాల్సిందే. సామాజిక బంధాలు తక్కువగా ఉండటం వల్ల సహజంగానే వీళ్లకు ఆరోగ్యం, ఉద్యోగావకాశాల మీద అవగాహన చాలా తక్కువగా ఉంటున్నది.