ఆదివారం 29 నవంబర్ 2020
Zindagi - Oct 27, 2020 , 00:05:07

క‘న్నీటి’ సమస్య తీర్చింది!

క‘న్నీటి’ సమస్య తీర్చింది!

అది మధ్యప్రదేశ్‌లోని ఘట్‌గరా అనే చిన్న ఊరు. ఇరవై ఏండ్ల క్రితం, ఆ ఊరి కోడలుగా అడుగుపెట్టింది మాయా మౌసరియా. వచ్చిన రోజే అక్కడి పరిస్థితులను చూసి ఆశ్చర్యపోయింది. గ్రామ మహిళలు, బిందెలు పట్టుకుని చాలా దూరం నడిచి వెళ్లాలి. రోజూ ఇంటికి సరిపడా నీళ్లు తెచ్చుకునేసరికే, సగం రోజు గడిచిపోయేది. ఇండోర్‌కు సమీపంలోని గ్రామం నుంచి వచ్చిన మౌసరియాకి ఇది చాలా మూర్ఖంగా అనిపించింది. గ్రామ సర్పంచిగా ఎవరు వచ్చినా, ఆ సమస్యని పరిష్కరించకపోవడం చూసి గుండె చెమ్మగిల్లింది.  గత సర్పంచులంతా మగవాళ్లు కావడమే ఆ నిర్లక్ష్యానికి కారణం అనుకుంది. తల మీద బిందెలు పెట్టుకుని, కిలోమీటర్ల కొద్దీ నడిస్తే కలిగే వైరాగ్యం... మోసేవాళ్లకే కదా తెలిసేది! అందుకే తనే స్వయంగా పరిస్థితులను చక్కదిద్దాలనుకుంది. 2014లో జరిగిన పంచాయతీ ఎన్నికలలో, సర్పంచిగా పోటీలో నిలబడింది. మహిళలంతా మౌసరియాకే ఓటు వేశారు. ఊరి చరిత్రలో తొలి మహిళా సర్పంచిగా ఆమెకు పట్టం కట్టారు.

కష్టం మటుమాయం!

పదవిలోకి రాగానే మౌసరియా చేసిన మొట్టమొదటి పని, ఊళ్లో రెండు బావులు తవ్వించి ఓ వాటర్‌ ట్యాంక్‌ను నిర్మించడం. ఆ కాస్త పనికే చాలామంది సంబరపడిపోయారు... కానీ మౌసరియా మాత్రం తృప్తిపడలేదు. ‘ఇంటింటికీ నల్లా కోసం ప్రభుత్వం చాలా పథకాలే ప్రారంభించింది కదా... మరి ఆడవాళ్లు బావుల చుట్టూ మూగడం ఎందుకు?’ అనుకుంది. కానీ ఆమె ఊళ్లో అలాంటి పథకాలు ‘పారలేదు’. మంచినీటి పథకం అమలు కోసం పదేపదే తహసిల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరిగింది. ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీసుకి నడిచి వెళ్లేది. భర్తేమో చనిపోయాడు. తన కొడుకు తప్ప, గ్రామం నుంచి మరో వ్యక్తి ఆమెకు సాయంగా వచ్చేవారే కాదు. పైగా ఆమె శ్రమకు వంకలు పెట్టేవాళ్లూ.. పని చెడగొట్టేవాళ్లే ఎక్కువ. అయినా సరే, అనుకున్నది సాధించింది. ఇంటింటికీ నల్లా కనెక్షన్లను మంజూరు చేయించింది. మంచినీళ్లు మాత్రమే కాదు... గ్రామంలో అవసరం అయిన ప్రతి చోటా రోడ్లు వేయించింది, ఊళ్లో బడులను బాగుచేయించింది. మౌసరియా స్ఫూర్తిగా గ్రామంలోని మిగతా మహిళలు కూడా ఇప్పుడు తమ సమస్యలను ధైర్యంగా చెప్పుకోవడం మొదలుపెడుతున్నారు. గ్రామసభకు ఆమడదూరంలో ఉండేవాళ్లు... ఇప్పుడు ముందువరుసలో కూర్చుంటున్నారు. 

ఘట్‌గరా గ్రామం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ ప్రజల జీవితాలు సాఫీగా గడిచిపోతున్నాయి. అలాగని మౌసరియా తన బాధ్యత పూర్తయిందనుకోలేదు. ‘పొరుగూరిలో ఉన్న హైస్కూల్‌కి వెళ్లాలంటే, ఆడపిల్లలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. త్వరలోనే వాళ్ల కోసం ఓ ప్రభుత్వ బస్సును ఏర్పాటు చేయించే పనిలో ఉన్నాను’ అంటున్నారు మౌసరియా. అలాగని తను అక్కడితో ఆగిపోతుందా!

మన దేశంలో వేల గ్రామాల ప్రజలకు తాగునీరు ఓ తీవ్ర సమస్య! 

బిందెలు మోసుకుని మైళ్లకు మైళ్లు నడవాల్సిందే. ఆ కష్టానికి విధాతను తల్చుకుని ఉపయోగం లేదు. మనవంతు ప్రయత్నం చేయాలి. 

అలా ఓ మహిళ సాధించిన ఘన విజయం.. ఆ ఊరి గొంతును తడిపింది.