మంగళవారం 01 డిసెంబర్ 2020
Zindagi - Oct 27, 2020 , 00:05:07

శునకానికి నోబెల్‌

శునకానికి నోబెల్‌

నోబెల్‌ శాంతి బహుమతి... ఆ పురస్కారమే ప్రతిష్ఠాత్మకం. అర్హత ఉన్నవారికి రాకపోయినా వివాదమే, ఊహించని వ్యక్తులను వరించినా వివాదమే! కానీ ఈసారి ఈ అవార్డు ఎవరినీ అంతగా ఆశ్చర్యపరచలేదు. కారణం! ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతిని ‘వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌' (WFP) అనే సంస్థ దక్కించుకుంది. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేసే ఈ సంస్థ... పేదరికంతో పోరాటం చేస్తుంటుంది. యుద్ధసమయాలలో, కరువుకాటకాలలో... ఆహారం, వైద్య సదుపాయం, ఆర్థిక సాయాలను అందిస్తుంటుంది.

ఈ మధ్యకాలంలో... బంగ్లాదేశ్‌లోని ‘కోక్స్‌ బజార్‌' అనే ప్రదేశంలో ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఆ సేవే నోబెల్‌ బహుమతికి చేరువ చేసింది. కోక్స్‌ బజార్‌ ప్రపంచంలోనే అతిపెద్ద శరణార్థుల శిబిరం. మయన్మార్‌ నుంచి వలస వచ్చిన లక్షలాది మంది రోహింగ్యాలతో నిండిన ప్రదేశం. ఇక్కడ ‘వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌' అందిస్తున్న సహాయకార్యక్రమాలలో ఓ అనుకోని మిత్రుడు సాయపడుతూ ఉంటాడు. అతనే ఫాక్స్‌ట్రాట్‌... ఓ శునకం. బంగ్లాదేశ్‌ బీచ్‌లో దొరికిన ఈ కుక్కను సంస్థ సిబ్బంది చేరదీశారు. అది క్రమంగా వారి ఉద్యోగిగా మారిపోయింది. WFP సిబ్బందితో పాటు క్షేత్రస్థాయిలో తిరగడం, రక్షణచర్యలలో పాలుపంచుకోవడం, శరణార్థుల పిల్లలకు వినోదం కలిగించడం దీని విధులు. శిబిరంలో ఉండే మూడులక్షల మంది పిల్లలకూ ఈ ఫాక్స్‌ట్రాట్‌ ఓ హీరో! క్రమంగా బంగ్లాదేశ్‌లోని ‘వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌' సంస్థకు ఫాక్స్‌ట్రాట్‌ ఓ మస్కట్‌లా (ప్రతినిధి) మారిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి వేలాదిమంది అనుచరగణం ఉన్నారు. అందుకే WFP కి నోబెల్‌ శాంతి బహుమతి ప్రకటించగానే... అది ఫాక్స్‌ట్రాట్‌ కూడా చెందుతుందని ప్రకటించారు సంస్థ సిబ్బంది.