సోమవారం 30 నవంబర్ 2020
Zindagi - Oct 27, 2020 , 00:05:04

అమ్మాయే కావాలి!

అమ్మాయే కావాలి!

దాపరికం లేదు! ఇప్పటికీ మన సమాజంలో మగపిల్లవాడి కోసమే ఆరాటం ఎక్కువ. వధూవరులు కనిపించగానే ‘సుపుత్ర ప్రాప్తిరస్తు’ అన్న దీవెనే వినిపిస్తుంటుంది. ఒకరి తర్వాత ఒకరుగా ఆడబిడ్డలు నట్టింట తిరుగుతున్నా... ‘ఒక్క మగ నలుసు ఉంటేనా...’ అనే అసంతృప్తి ధ్వనిస్తుంది. కానీ క్రమంగా ఆ ధోరణి మారుతున్నదని అంటున్నారు విశ్లేషకులు. 

అక్షరాస్యత పెరగడమో, ఆర్థిక కోణమో... కారణం ఏదైతేనేం ‘ఒకరు లేదా ఇద్దరు పిల్లలు’ ఎవరైనా ఫర్వాలేదనే సర్దుబాటు పెరుగుతున్నదట. దీనికోసం ‘నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే’కు సంబంధించిన డేటాను పరిశీలించి ఓ నివేదికను రూపొందించారు.

ఈ నివేదిక ప్రకారం

  • 1992-93 కాలంతో పోలిస్తే... 2015-16 నాటికి, ఇద్దరూ ఆడపిల్లలే పుట్టినా కుటుంబ నియంత్రణ చేయించుకున్న దంపతుల సంఖ్య రెట్టింపయ్యింది. ముగ్గురూ ఆడపిల్లలే జన్మించిన కుటుంబాలు కూడా మరో సంతానం వద్దనుకున్న సందర్భాలు పెరిగాయి.
  • పంజాబ్‌, హరియాణ, మహారాష్ట్ర... సాధారణంగా ఈ మూడు రాష్ర్టాలలోనూ మగపిల్లల కోసం తాపత్రయం ఎక్కువని ఓ విశ్లేషణ. అయితే ఈ మూడు రాష్ర్టాలలోనూ గణనీయమైన మార్పు కనిపిస్తున్నదని నివేదిక ద్వారా తెలుస్తున్నది.
  • ఇంట్లో ఒక్కతే ఆడబిడ్డ ఉన్నా కూడా కుటుంబ నియంత్రణ చేయించుకున్న జంటల సంఖ్య పెరుగుతున్నది. ఇది పంజాబ్‌లో 0.7 శాతం నుంచి ఏకంగా 5.1 శాతానికి చేరింది. హరియాణ, మహారాష్ట్రలో కూడా గణనీయమైన మార్పు కనిపించింది.