మంగళవారం 01 డిసెంబర్ 2020
Zindagi - Oct 25, 2020 , 00:57:11

మీ ఇంటిమహాశక్తి మీరే!

మీ ఇంటిమహాశక్తి మీరే!

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి! నవరాత్రులూ పోరాటం చేసి దుష్టులను దునుమాడిన పరాశక్తి అపరాజితగా పూజలు అందుకుంది.ప్రతి తల్లీ జగన్మాతగా పోరాడాల్సిన సమయమిది.కోరలు చాచిన కరోనా నుంచి కుటుంబాన్ని కాపాడుకోవాలి.గాడి తప్పిన బతుకు బండిని పట్టాలెక్కించాలి.ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి నిలబడాలి.ఆ ఆదిశక్తినే ఆదర్శంగా తీసుకొని యుద్ధానికి సన్నద్ధం అవ్వండి. ఇందుకు విజయదశమి కన్నా మంచి ముహూర్తం ఏముంటుంది. నడుం బిగించండి, మీలోని శక్తియుక్తులను కూడదీసుకోండి. ఇంటిల్లిపాదికీ రక్షణ కల్పించండి.

మహాలక్ష్మిగా..

కరోనా కారణంగా ప్రభావితం అయిన అంశాల్లో ఆర్థిక వ్యవస్థ ఒకటి. ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. జీతాల్లో కోతలు, ఉద్యోగాల్లో అభద్రత.. దినదిన గండంగా మారింది. ఈ తరుణంలో తరుణి మరింత బాధ్యతతో మెలగాలి. భర్తకు ధైర్యాన్నివ్వాలి. పొదుపు మంత్రం నిరంతరం పఠించాల్సిందే. మహాలక్ష్మిని మరింత భద్రపరుచుకోవాలి! పొదుపు పాఠాలు స్త్రీలు కొత్తగా నేర్చుకోవాల్సిన పనిలేదు. జన్మతః వారికి అలవడే సద్గుణాల్లో ఇదీ ఒకటి. ఆ గుణాన్ని ద్విగుణీకృతం చేయాలంతే! వృథా ఖర్చులు నియంత్రిస్తే సగం సఫలం అయినట్టే. వస్తు వినియోగంలో కాస్త జాగ్రత్తలు పాటిస్తే ఆర్థికంగా ఎదురయ్యే ఆటుపోట్లనూ అధిగమించడం పెద్ద కష్టమేం కాదు.‘

సృష్టి, స్థితి, లయకారకులను సైతం తన కనుసన్నలతో శాసించే దేవత ఆమె! అపజయం ఎరుగని మహాశక్తికి ఆటుపోట్లకేం కొదువలేదు. అన్నిటినీ సమర్థంగా ఎదుర్కొని అపరాజితగా నిలిచింది. ఓ ఇల్లాలుగా ఆమె అందరికీ ఆదర్శం. ప్రతి స్త్రీమూర్తీ ముగ్గురమ్మల మూలపుటమ్మే! సందర్భాన్ని బట్టి ఆమెలోని కోణం వెలుగు చూస్తుంది. ఆలోచనల్లో సరస్వతి, ఆర్థికాంశాల్లో మహాలక్ష్మి, కుటుంబాన్ని తీర్చిదిద్దడంలో మహాగౌరిగా విభిన్న పాత్రలను సమర్థంగా పోషిస్తున్నది నేటి మహిళ!

కరోనాపై కాళిగా..

అన్‌లాక్‌ తెరలేచేసరికి కరోనా ముప్పు తొలగిపోయిందనే భావన చాలామందిలో కలుగుతున్నది. జనజీవం సజావుగా సాగడానికి ప్రభుత్వాలు అన్‌లాక్‌ వెసులుబాటును కల్పించాయి. సమసిపోయిందని కాదు! ఈ పరిస్థితుల్లో కుటుంబసభ్యుల కట్టడి బాధ్యత అంతా హోమ్‌ మినస్టర్‌గా మీదే! వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం సూత్రాలను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ, వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాల్సిందే. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేవరకూ షరతులు వర్తింపజేయాలి. ఒక్కరి నిర్లక్ష్యం మీ కుటుంబాన్నే ప్రమాదంలోకి నెట్టేయొచ్చు. కాబట్టి, ఇంకొంత కాలం స్వీయ నియంత్రణే తారకమంత్రమని ఉద్బోధించండి. గీతదాటితే కాళిలా కన్నెర్ర చేయండి. కరోనా గండం నుంచి పూర్తిగా గట్టెక్కేవరకూ పోరాటం కొనసాగాలి. కరోనాసురుని సంహారం తర్వాతే సాధారణ జీవనానికి పచ్చజెండా ఊపండి.


అమ్మ చెప్పిన పాఠం

ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో అమ్మచరితే ఉపదేశిస్తుంది. ఆమె గిరిరాజ తనయ. అల్లారుముద్దుగా పెరిగింది. శివయ్యను కోరి వరించింది. పెనిమిటితో అత్తారింటికి వెళ్తే మంచు దిబ్బలు తప్ప ఏం కనిపించలేదక్కడ. అయినా నిరుత్సాహపడలేదామె. చల్లని మనిషి దొరికాడని సంబురపడింది. పైపై మెరుగుల కన్నా.. లోపలి సుగుణం మిన్నగా భావించాలి. అప్పుడే సంసారం ఆనందంగా సాగుతుంది. యుగయుగాల వారి కాపురంలో గిల్లికజ్జాలు ఎన్నున్నా పొరబాటున కూడా ఎడబాటుకు తావివ్వలేదు. సకల జగత్తుకు మాతాపితరులయ్యారు. ఈ ఆదిదంపతుల సంసార సూత్రాన్ని సదా గుర్తుంచుకుంటే అన్యోన్యతలు మీ ఇంటిని లతలై అల్లుకుంటాయి.

శక్తియుక్తులతో..

పులిమీద పుట్రలా ప్రకృతి వైపరీత్యాలు సగటు మనిషిని మరింత సమస్యల్లోకి నెట్టేస్తున్నాయి. అపాయాన్ని దాటడానికి ఉపాయం కావాలి. కానీ, అది తట్టాలంటే మానసికంగా ధైర్యంగా ఉండాలి. ఈ సందర్భానికీ ఆదిపరాశక్తి ఓ పరిష్కార మార్గం చూపింది. క్షీరసాగర మథనంలో పుట్టిన హాలాహలం లోకాలకు ముప్పుగా పరిణమించింది. దానిని ఆపగలిగే శక్తిమంతుడు శివుడొక్కడే. పార్వతి కంగారు పడలేదు. దుస్సాహసానికి పూనుకోవద్దని భర్తను వారించలేదు. అండగా నిలిచింది. ఆయనలోని శక్తి తానేనని ఆమెకు తెలుసు. ఆ సంగతి ఆయనకూ ఎరుకే! అందుకే గరళాన్ని గుటుక్కున మింగేశాడు. ఎంతటి విపత్కర పరిస్థితుల్లో అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకూడదని చెబుతున్నది ఈ ఉదంతం. మనోబలంతో ఎలాంటి వైపరీత్యాన్నైనా ఎదుర్కోవచ్చు. ఇలాంటి స్థితప్రజ్ఞత మగవారిలో కన్నా ఆడవారిలోనే ఎక్కువ! ఆపత్కాలంలో హైరానా పడకుండా.. మీ శక్తియుక్తులతో దానిని అధిగమించే ప్రయత్నం చేస్తే విజయం మీదే! ఈ చెడులన్నిటినీ ఎదుర్కొని విజేతగా నిలవండి. అపరాజితగా వర్ధిల్లండి. విజయదశమి వనితాలోకానికి ఇస్తున్న సందేశమిదే!!