ఆదివారం 29 నవంబర్ 2020
Zindagi - Oct 25, 2020 , 00:57:11

కల్పతరువు జమ్మి

కల్పతరువు జమ్మి

శరన్నవరాత్రులు వైదిక పూజలకు వేదిక అయితే.. విజయ దశమి లౌకికమైన వేడుక. సరదాగా జరుపుకొనే పండుగ. దసరా దశను మార్చేస్తుందని భావిస్తారు. ఈ రోజు ఏదైనా కార్యం తలపెడితే నిర్విఘ్నంగా కొనసాగుతుందని విశ్వసిస్తారు. పది రోజుల దసరా వేడుకకు ప్రకృతి ఆరాధనతో ఘనమైన ముగింపు పలుకుతారు. జమ్మిచెట్టును పూజించి, పాలపిట్టను దర్శించి దశమి సంబురంలో అందరూ ఆనందంగా పాలుపంచుకుంటారు.

దసరా రోజు శమీ పూజకు చాలా ప్రాధాన్యం ఉంది. పండుగ పూట  జమ్మిచెట్టును పూజించి, శమీ పత్రాలను బంగారంగా భావించి, పెద్దలకు ఇచ్చి ఆశీస్సులు అందుకుంటారు. చెట్లని దైవంగా భావించడం హైందవ సంస్కృతిలో భాగం! వేదకాలం నుంచి జమ్మి ప్రస్తావన కనిపిస్తుంది. యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తున్నప్పుడు అగ్ని పుట్టించడానికి ‘అరణి’ని జమ్మికొమ్మతోనే రూపొందించేవారు.

ఔషధాల నిధి

నీటి లభ్యత తక్కువగా ఉన్నా జమ్మి మహావృక్షమవుతుంది. కష్టనష్టాలు ఎన్ని ఎదురైనా తట్టుకొని నిలబడాలని చెబుతుంది శమీ వృక్షం. పట్నవాసులకు అంతగా పరిచయం లేకపోవచ్చు గానీ, గ్రామీణులకు జమ్మి సుపరిచితమే. దీని వేళ్లు భూసారాన్ని పట్టి ఉంచుతాయి. ఈ చెట్టులోని ప్రతిభాగంలోనూ ఔషధ గుణాలున్నాయి. ఈ చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చినా ఆరోగ్యం సమకూరుతుందని పెద్దల నమ్మకం.

గెలుపు వృక్షం

అజ్ఞాత వాసానికి బయల్దేరే సమయంలో పాండవులు విజయదశమి రోజునే తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద దాచి వెళ్లారట. తిరిగి అదే విజయదశమి నాడు వారు జమ్మిచెట్టు రూపంలో ఉన్న అపరాజితా దేవిని పూజించి, తమ ఆయుధాలను తీసుకున్నారు. అలా అపరాజితాదేవి ఆశీస్సులు పొందిన పాండవులు కురుక్షేత్ర సంగ్రామంలో విజేతలుగా నిలిచారని నమ్ముతారు. రామునికి సైతం జమ్మిచెట్టు ప్రీతికరమైందని చెబుతారు (రామస్య ప్రియదర్శనీ). జమ్మిచెట్టుని శక్తి స్వరూపంగానూ భావిస్తారు. ఆమె అనుగ్రహంతో రాముడు.. రావణుడిని సంహరించాడని చెబుతారు. పురాణాల్లో ఇంతటి ప్రాధాన్యం ఉండటంతో జమ్మిచెట్టును ప్రత్యేక వృక్షంగా భావిస్తారు. దసరా రోజు శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తూ.. 

శమీ శమయతే పాపం 

శమీ శత్రు వినాశనీ,

అర్జునస్య ధనుర్ధారీ 

రామస్య ప్రియదర్శనీ

అనే శ్లోకాన్ని చదువుతారు.

పూజ పూర్తయిన తర్వాత జమ్మి ఆకులను బంగారంలా భావించి భద్రంగా ఇళ్లకు తీసుకువెళ్తారు. వాటిని పెద్దల చేతిలో ఉంచి ఆశీర్వాదాన్ని పొందుతారు. జమ్మి ఆకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యం రీత్యా వాటిని బంగారంతో సమానంగా భావిస్తారు. దీని వెనుక ఓ పురాణ కథ కూడా ప్రాచుర్యంలో ఉన్నది. కుబేరుడు ఒకనాడు రఘుమహారాజుకి భయపడి జమ్మిచెట్లున్న ప్రాంతంలోనే బంగారాన్ని కురిపించాడట! అలా జమ్మి ఆకులను బంగారంగా పిలుచుకుంటారు. 

పాలపిట్ట దర్శనం

శమీ పూజ తర్వాత దసరా నాటి మరో ముఖ్య ఘట్టం పాలపిట్ట దర్శనం. పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద నుంచి తీసుకుని తిరిగి తమ రాజ్యానికి చేరుకుంటుండగా, వారికి పాలపిట్ట కనిపించిందనీ... అప్పటి నుంచీ వారికి సకల విజయాలూ సిద్ధించాయని ఒక నమ్మకం. అందుకనే విజయానికి శుభసూచకంగా పాలపిట్టను దర్శించడం ఆనవాయితీగా వస్తున్నది. పంజరాల్లో బంధించి తెచ్చిన పాలపిట్టను దర్శించే పరిస్థితులు నెలకొనడం బాధాకరం. అలాంటి చర్యలను సమర్థించకుండా స్వేచ్ఛగా విహరిస్తున్న పాలపిట్టను దర్శించుకుందాం. సకల శుభాలనూ పొందుదాం.

జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలనూ సాధించాలని కోరుకోవడమే. పిల్లల మనసులోని ఈ విజయకాంక్షను గ్రహించిన పెద్దలు, వారి మనోకామన నెరవేరాలని దీవిస్తారు.