శుక్రవారం 04 డిసెంబర్ 2020
Zindagi - Oct 24, 2020 , 00:46:55

జయదుర్గ..విజయ మార్గ..

జయదుర్గ..విజయ మార్గ..

కారం దైత్య నాశకం.

కారం విఘ్న నాశకం.

కారం రోగ నాశకం.

కారం పాప నాశకం.

కారం కార్యసిద్ధి కారకం.

దుర్గ..  భక్తులకు రక్షణనిచ్చే దుర్భేద్య దుర్గం! ప్రతి స్త్రీలోనూ అమ్మవారి అంశ ఉంటుంది. ప్రతి బాలికా బాలా త్రిపుర సుందరే, ప్రతి విద్యార్థినీ విద్యాధిదేవతే, ప్రతి గృహిణీ లక్ష్మీ స్వరూపమే.. గృహలక్ష్మీ గృహే గృహే! మొత్తంగా అమ్మ రూపం ప్రతీకాత్మకం, అమ్మ ఆయుధాలూ ప్రతీకాత్మకమే!

శంఖం

అమ్మవారి చేతిలోని శంఖం ఆనందానికి ప్రతీక. ఉత్తేజానికి చిహ్నం. స్త్రీ స్వతహాగా ఆనంద స్వరూపిణి. ఆమె కుడికాలు మోపగానే పాత కొంపకైనా లక్ష్మీకళ వచ్చేస్తుంది. ‘ఆహ్లాదకారిణీ దేవీ చంద్రఘంటా ప్రకీర్తితా..’ అని కీర్తిస్తారు సాధకులు. ఆనందలక్ష్మి అయిన స్త్రీని మాటలతోనో, చేతలతోనో బాధ పెడితే మాత్రం.. రాక్షస సంతతికి పట్టిన గతే పడుతుంది. 

సింహం

అమ్మ సింహవాహిని. సింహం భయానక బీభత్సాలకు ప్రతీక.  సింహానికి ఎంత దూకుడు ఉంటుందో, అంత ఆలోచనా ఉంటుంది. ప్రతి అడుగూ ఆలోచించి వేస్తుంది. ‘సింహావలోకనం’ అన్న మాట అలా పుట్టిందే! సింహాన్ని అధిరోహించడం ద్వారా ఉద్వేగాల్ని అదుపులో ఉంచుకోమంటూ హితవు చెబుతున్నది ఆ తల్లి. 

ఖడ్గం

అజ్ఞానం మీదా, అహంకారం మీదా దూసిన కత్తి. ఆ ఖడ్గం పదునైన ఆలోచనా శక్తికీ ప్రతీకే. సాధారణమైన కత్తితో రక్తబీజుడిని చంపడం అసాధ్యం. వాడికేవో వరాలు ఉన్నాయి. అప్పుడు, 

అమ్మవారు ఆలోచనా ఖడ్గాన్ని బయటికి తీశారు. కాళికగా మారారు. అసురుడి నెత్తురు నేలరాలకుండా రుధిరపానం చేశారు. గద లక్ష్యమూ అలాంటిదే.

చక్రం..

చక్రం.. లక్ష్యానికి సంకేతం. కర్తవ్యపరాయణతకు ప్రతీక. మానవజాతి వికాసానికి కారణమైన పారిశ్రామిక విప్లవం కూడా యాంత్రిక చక్రం ఆవిష్కరణతోనే మొదలైంది. లక్ష్యాన్ని చేరుకోవడానికి జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం విద్యతో వస్తుంది.  ముగురమ్మల మూలపుటమ్మ చదువుల తల్లి కూడా! గురుమండల రూపిణీ, దక్షిణామూర్తి రూపిణీ.. అని కొలుస్తారు విజ్ఞులు. 

విల్లంబులు

విల్లంబులలో ఒకటి నీ దారి, మరొకటి నీ గమ్యం. దారి స్పష్టంగా ఉంటేనే, గమ్యాన్ని చేరుకుంటావు. గమ్యం ఎంత ముఖ్యమో, దాన్ని చేరుకోడానికి నువ్వు ఎంచుకునే దారీ అంతే ప్రధానం. సర్వకాల సర్వావస్థల్లోనూ ధర్మమార్గాన్నే ఎంచుకోవాలి. పొరపాటునో, ఏమరపాటునో మనం దారితప్పినప్పుడు, ఓ తల్లిలా చెంపదెబ్బ కొట్టో, గుంజీలు తీయించో సత్యం వైపు నడిపిస్తుంది.

సర్పం

ఆధునిక మనో విజ్ఞాన శాస్త్రం ప్రకారం చూసినా.. సర్పం కోరికలకు చిహ్నం. అర్థంలేని కోరికలు మనిషిని పక్కదారి పట్టిస్తాయి. పాతాళానికి తొక్కేస్తాయి.కాబట్టి, జాగృతః జాగృతః 

అని హెచ్చరిస్తున్నారు అమ్మవారు. అంతులేని కోరికలే దుఃఖానికి హేతువులు.‘దుఃఖాత్‌ గమయతీతి దుర్గా’ కోరికల్ని నశింపజేసి దుఃఖాన్ని పరిహరించే తల్లి.. దుర్గ!

త్రిశూలం

త్రిశూలంలోని మూడు శూలాలూ భూత, భవిష్యత్‌, వర్తమానాలకు ప్రతీకలు. గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. వర్తమానాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భవిష్యత్తు పట్ల అంచనా ఉండాలి. ఈ మూడు గుణాలూ కలిగినవారినే నాయకులని అంటారు. ఆ అగ్రేసరులను అమ్మవారు రాజశ్యామలాదేవి రూపంలో కటాక్షిస్తారు.