శుక్రవారం 04 డిసెంబర్ 2020
Zindagi - Oct 24, 2020 , 00:37:13

చల్లని తల్లికి సద్దుల పల్లకి

చల్లని తల్లికి సద్దుల పల్లకి

బతుకమ్మ మహోత్సవం చివరి అంకానికి చేరుకుంది. రోజురోజుకూ పోటాపోటీగా పెరుగుతూ వచ్చిన బతుకమ్మ ఈ రోజు మరింత భారీగా ముస్తాబవుతుంది. దుర్గమ్మగా పూజలు అందుకుంటుంది. మళ్లీ ఏడాది వస్తానంటూ తరలి వెళ్తుంది. పెండ్లినాడు ఆడకూతురును సాగనంపినట్టు.. తొమ్మిదిరోజుల పాటు అల్లారుముద్దుగా పూజించుకున్న బతుకమ్మకూ అంతే ఘనంగా వీడ్కోలు పలుకుతారు భక్తులు. రకరకాల సద్దులు చేసి సారెగా అమ్మకు నివేదిస్తారు. సద్దులంటే బతుకమ్మకు అంత ఇష్టం. ఎందుకాలస్యం? భక్తితో సద్దులు చేసి, ఆప్యాయంగా అమ్మకు నివేదించండి.

దధ్యోదనం (పెరుగన్నం)

బియ్యంతో మెత్తగా అన్నం ఉడికించుకోవాలి.  కాస్త చల్లారిన తర్వాత బాగా మెదుముకోవాలి. అందులో శొంఠి పొడి, మిరియాల పొడి, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు, పెరుగు వేసుకొని బాగా కలపాలి. స్టౌ మీద గిన్నె పెట్టి నెయ్యి వెయ్యాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత.. జీలకర్ర, ఆవాలు, కాజు వేసి బాగా వేగనివ్వాలి. ఈ తాలింపును అన్నంలో వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీరతో అలంకరించుకోవాలి.

పులుసు చద్ది

ముందుగా చింతపండు నానబెట్టి, బాగా పిసికి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేసుకోవాలి. అందులో చింతపండు రసం వేసి బాగా ఉడికించాలి. పులుసు మసులుతున్నప్పుడు మెంతులు, జీలకర్ర, మిరియాల పొడి వేయాలి. ఎండుమిర్చి బాగా దంచుకొని అందులో వేయాలి. తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యంతో అన్నం వండుకోవాలి. కడాయిలో నూనె వేసుకోవాలి. వేడి అయిన తర్వాత పల్లీలు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కాటు పెట్టిన పచ్చి మిరపకాయలు వేయాలి. ఇంగువ వేసి చేసుకున్న పోపును పులుసులో కలపాలి. పచ్చిమిరపకాయలకు పులుపు పట్టిన తర్వాత ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి.. తగినంత పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. కరివేపాకుతో అలంకరించుకుంటే రుచికరమైన పులిహోర సిద్ధం.

బెల్లం అన్నం

బియ్యంతో అన్నం వండి పక్కన ఉంచాలి. మరో గిన్నెలో బెల్లం వేసి తగిన మోతాదులో నీళ్లు పోసి పల్చటి పాకం పట్టుకోవాలి. పాకం బాగా వచ్చాక ఇలాచీ పొడి వేసి కలపాలి. తర్వాత అన్నం అందులో వేసి బాగా కలుపుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే పైనుంచి నెయ్యి వేసుకోవాలి. చివరగా నెయ్యిలో వేయించిన కాజుతో అలంకరించుకోవాలి. తియ్యని బెల్లం అన్నం సిద్ధం.

నువ్వుల చద్ది

ముందుగా బియ్యంతో అన్నం వండుకోవాలి. వెడల్పాటి బేసిన్‌లో వేసి కాస్త చల్లారనివ్వాలి. తర్వాత అన్నంలో నువ్వులపొడి, జీలకర్ర, మెంతుల పొడి, పసుపు, ఉప్పు వేయాలి. మరో గిన్నె స్టౌ మీద పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పల్లీలు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కాటు పెట్టిన పచ్చి మిరపకాయలు, కరివేపాకు వేయాలి. ఇంగువ వేసి పోపు తీసి ఇందాక నువ్వుల పొడి వేసుకున్న అన్నంలో వేసి బాగా కలిపితే నువ్వుల చద్ది పూర్తవుతుంది.

కొబ్బరి చద్ది

ముందుగా బియ్యంతో అన్నం వండుకోవాలి. అన్నం కాస్త చల్లారిన తర్వాత అందులో కొబ్బరిపొడి, జీలకర్ర, మెంతులు, ఆవాలు, మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. కడాయిలో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత పల్లీలు వేసి వేగనివ్వాలి. తర్వాత శనగపప్పు, మినప్పప్పు వేయాలి. పప్పు దినుసులు కాస్త రంగు మారిన తర్వాత జీలకర్ర, పచ్చి మిరపకాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. ఇంగువ వేసి పోపు తీసి అన్నంలో కలిపితే కొబ్బరి చద్ది తయారైనట్టే.