శుక్రవారం 04 డిసెంబర్ 2020
Zindagi - Oct 22, 2020 , 23:29:18

అక్క చెరువు.. అన్న వరం!

అక్క చెరువు.. అన్న వరం!

నారాయణికి ఏ కష్టం వచ్చినా తన అన్న నారాయణుడికి చెప్పుకునేదట. రకరకాల రూపాలు ధరించి చెల్లెలి కష్టాలు తీర్చేవాడట విష్ణుమూర్తి. ఈ పురాణ కథలు అన్నాచెల్లెండ్ల అనుబంధాన్ని, చెల్లెలి పట్ల అన్నకు ఉండాల్సిన బాధ్యతను తెలియజేస్తాయి. మానవ మాత్రుడైన ఓ అన్న తన చెల్లెలి కోసం పడిన కష్టం అపురూపం. సోదరిని ‘కలకాలం చల్లగా బతుకమ్మా’ అని ఆశీర్వదించడంతో ఊరుకోకుండా.. చెల్లెని కాపురానికి పంపిన ఊరు రాతనే మార్చేశాడా అన్న. కరువుతో అల్లాడుతున్న తన తోబుట్టువు అత్తగారింటికి అంతులేని జలరాశిని సారెగా పంపిన వినూత్న గాథ ఇది.

200 ఏండ్ల కిందట ఖమ్మం ఖిల్లా సాక్షిగా జరిగిన యథార్థ గాథ ఇది. కరువు విలయతాండవం చేస్తున్న రోజులవి. పేదలు, పెద్దలు అందరూ బాధితులే! పంటలు పండక రైతులు.. శిస్తుల్లేక జమీందార్లు పస్తులుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పంచభక్ష్యపరమాన్నాలు తినే పెత్తందార్లూ జొన్న గట్క తినే దారుణ పరిస్థితులు. ఈ కరువును బాపడానికి ఒక్కడొచ్చాడు. తన చెల్లి కోసం వచ్చాడు. వస్తూ వస్తూ భగీరథుడు గంగకు దారి చూపినట్టుగా.. జలసిరిని తన వెంటబెట్టుకొచ్చాడు.

..నేటి ఖమ్మం జిల్లా ముత్తగూడెంలో యరసాని వంశానికి చెందిన జమీందారు కొడుక్కు పెండ్లి నిశ్చయమైంది. పెండ్లికూతురు నేటి మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లి ప్రాంతానికి చెందిన రోషం జమీందారు ఒక్కగానొక్క కుమార్తె. ఎండకన్నెరగకుండా పెరిగిన గారాలపట్టి. అల్లారుముద్దుగా పెంచుకున్న తండ్రి. మురిపెంగా చూసుకునే అన్న. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి అంగరంగ వైభవంగా పెండ్లి జరిపించారు. చెల్లిని అత్తారింటికి సాగనంపుతూ ఊరి పొలిమేర దాకా కదిలారంతా. చెమర్చిన కండ్లను తుడుచుకుంటూ తిరిగి ఇండ్లకు చేరుకున్నారు.

కరువు సీమలో కుడికాలు పెట్టి..

కొత్తజంట ప్రయాణం పచ్చని పొలాల మధ్య మొదలైంది. పల్లకీలో పెండ్లి కూతురు సిగ్గుల మొగ్గయిపోయింది. అబ్బాయి ముఖంలో ఏదో దిగులు. మేనా అత్తారింటి పొలిమేరలకు చేరుకుంది. ఊరి సౌందర్యం చూద్దామని నవ వధువు తెర చాటు తొలగించింది. భర్త కలతకు కారణం చెబుతూ... కనుచూపు మేరలో బీడువారిన నేలలు దర్శనమిచ్చాయి. డొక్కకు అతుక్కుపోయిన కడుపులు దీనంగా ఆకలి అరుపులు అరుస్తూ కొత్త కోడలికి స్వాగతం పలికాయి. కళతప్పిన వీధుల మీదుగా బారాత్‌ భారంగా సాగింది. పసిపిల్లల రోదనలే మంగళవాద్యాలయ్యాయి. కరువు సీమలో కుడికాలు పెట్టిందా కోడలు. ఊరునూ, వాడనూ చుట్టేసిన కరువు తన ఇంట్లోనూ తిష్టవేసిందని చూడగానే ఆమెకు అర్థమైంది. మనసున్న భర్త దొరికినందుకు సంతోషించాలో.. ఇంట్లో పరిస్థితికి బాధపడాలో అర్థం కాలేదు. వరి అన్నానికే వంకలు పెట్టే దొరసానమ్మ.. జొన్న అన్నాన్నే అమృతంగా భావించి తిననారంభించింది. అది ఒంటికి సహించక కడుపు మాడ్చుకొని పస్తులుంది. జబ్బు చేసి బక్కచిక్కిపోయింది. రోజులు గడిచాయి. కుమార్తె యోగక్షేమాలు కనుక్కుందామని ముత్తగూడెం వచ్చాడు ఆమె తండ్రి. చీపురుపుల్లలా తయారైన కూతురును చూసి నిశ్చేష్టుడయ్యాడు. విషయం ఆరా తీస్తే.. నోట మాట రాలేదు. ‘తింటే జొన్నన్నం తిను.. లేదంటే వాకిట్లో వరి పండించుకో’ అన్న అత్తగారి మాటలు ఈ తండ్రి చెవిన పడ్డాయి. ‘కష్టమో నిష్టూరమో.. నీ పెనిమిటి చెయ్యి విడవకు బిడ్డా!’ అని చెప్పి కండ్లొత్తుకుంటూ అక్కడ్నుంచి వెనుదిరిగాడు.

అన్న రాకతో..

కూతురు పడుతున్న కష్టాలను కొడుకుతో చెప్పుకొని బాధపడ్డాడు జమీందారు. చెల్లెలు కాలులో ముల్లు గుచ్చుకుంటూనే విలవిల్లాడిపోయే ఆ అన్న.. తన సోదరి ఇంత పెద్ద ఆపదలో ఉందని తెలిసి తట్టుకోలేకపోయాడు. హుటాహుటిన గుర్రం ఎక్కి ముత్తగూడెం చేరుకున్నాడు. చెల్లెలి పరిస్థితి చూసి కలత చెందాడు. ‘నన్ను నమ్ము తల్ల్లీ! నీ కష్టాలు తప్పకుండా తీరుస్తాను’ అని అక్కడ్నుంచి బయల్దేరాడు. ఎలాగైనా చెల్లెలి ముఖంలో ఆనందం చూడాలి. అందుకు ఏం చేయాలి? ఇలా ఆలోచిస్తూనే ఉల్లేపల్లి పరిసరాలకు చేరుకున్నాడు. కండ్ల ఎదురుగా ఆకేరు వాగు నిండుగా ప్రవహించడాన్ని చూశాడు. తరుణోపాయం తట్టింది. ఈ యేటి నీటికి తన చెల్లెలి అత్తారింటికి దారి చూపాలనుకున్నాడు. సమృద్ధిగా పారే ఆకేరు జలరాశిని ముత్తగూడేనికి మళ్లించాలని కంకణం కట్టుకున్నాడు.

భగీరథ ప్రయత్నం

ఖర్చు గురించి వెనుకాడలేదు. ఆయన సంకల్పం ఒక్కటే.. చెల్లి కండ్లల్లో నీళ్లు కనిపించొద్దు. అందుకు ఉన్న ఒకే ఒక్క మార్గం ముత్తగూడెం జలకళ సంతరించుకోవాలి. ఉల్లేపల్లి దగ్గర ఆనకట్ట కట్టించి, తిరుమలాయపాలెం మండలం హైదర్‌సాహెబ్‌ పేట నుంచి ఇప్పుడున్న ఎం.వెంకటాయపాలెం మీదుగా ముత్తగూడేనికి నీటిని చేర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆకేరుపై ఆనకట్ట నిర్మించి కాల్వల ద్వారా నీటిని ముత్తగూడెం సెలయేటికి చేర్చాడు. ఈ ప్రయత్నంలో ఎన్నో అవాంతరాలు. సమీప గ్రామాల ప్రజలు నీటి తరలింపును అడ్డుకున్నారు. వారిని సముదాయించాడు. కొందరికి పరిహారం చెల్లించాడు. రేయింబవళ్లు కష్టపడ్డాడు. భగీరథ ప్రయత్నంతో అనుకున్న పనిని పూర్తి చేశాడు. ముత్తగూడెం చెరువు నిండింది. చెరువు కిందున్న మాగాణం మురిసింది. ఊరంతా పచ్చగా మారింది. నేలంతా ఈనేలా ధాన్యరాసి పండింది. చెల్లెలు ఇంటికి బస్తాలకు బస్తాలు ధాన్యం చేరింది. ఆమె కండ్లల్లో నీటి చెమ్మ ఆవిరైంది. ఆ కోడలమ్మను గ్రామస్థులంతా ‘మా ఊరు మహాలక్ష్మీ’ అని మెచ్చుకున్నారు. ఆ అన్నకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకొన్నారు.

నేటికీ ఆనవాళ్లు

ఆకేరు నీటిని మళ్లించేందుకు ఆ అన్న పడిన శ్రమకు ప్రతీకగా కొన్ని ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. ఉల్లేపల్లి ఆకేరుపై రాతి సున్నంతో కట్టిన కట్ట శిథిలాలు  దర్శనమిస్తున్నాయి. హైదర్‌సాహెబ్‌ పేటలో నిర్మించిన పంట కాలువ గుర్తులూ కనిపిస్తుంటాయి. నాడు ఆ సోదరుడు జలదేవతను ప్రసన్నం చేసుకునేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగా ప్రతిష్ఠించిన గంగమ్మ విగ్రహాలను సైతం అక్కడ చూడొచ్చు. 250 ఎకరాల విస్తీర్ణం కలిగిన ముత్తగూడెం చెరువు చుట్టు పక్కల ఐదారు గ్రామాలను ఆనుకుని ఉండటం విశేషం. దీనిని ‘అక్క చెరువు’ అని పిలుస్తారు. ఈ చెరువు నుంచి కిందికి పారిన జలాలు ఓ ప్రదేశంలో కుంటగా ఏర్పడ్డాయి. దీనిని  ‘చెల్లె చెరువు’గా పిలుస్తుంటారు. చరిత్ర పుటల్లో చోటు దక్కని ఈ అన్నాచెల్లెళ్ల గురించి గ్రామస్థులంతా కథలు కథలుగా చెబుతుంటారు. వారి అనుబంధమే తమ పాలిట శ్రీరామరక్షగా మారిందంటారు.

రాత్రికి రాత్రే కాలువ

ఉల్లేపల్లి జమీందారు కొడుకు కాలువ తవ్వించిన విషయాన్ని చిన్నప్పుడు మా తాతలు కథలు కథలుగా చెప్పేటోళ్లు. ఊరి మధ్యలో నుంచి కాలువ తవ్వుతుంటే చాలామంది అడ్డుకున్నరట. ఆ రాత్రి ఊళ్లో చెలికత్తెలతో నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశాడట జమీందారు. ఊరంతా వాటిని చూస్తూ మురిసిపోతుంటే.. రాత్రికి రాత్రే కాలువ తవ్వించాడట. ఆ కాలువ ఆనవాళ్లు ఇప్పటికీ చూడొచ్చు.

- చింతోజు వెంకటాచారి, హైదర్‌సాహెబ్‌పేట


 తీగల నాగరాజు