శుక్రవారం 04 డిసెంబర్ 2020
Zindagi - Oct 22, 2020 , 23:29:21

స్కెచ్‌ ఫర్‌ హైదరాబాద్‌!

స్కెచ్‌ ఫర్‌ హైదరాబాద్‌!

హైదరాబాద్‌ మనల్ని అక్కున చేర్చుకుంది. ఉపాధినిచ్చింది. వ్యాపారాన్ని ఇచ్చింది. మన అభివృద్ధికి గొడుగై తోడు నిలిచింది. అలాంటి మహా నగరానికి వరదొస్తే.. ఆ వరదలో మనలాంటి వాళ్లు చిక్కుకుంటే.. చూస్తూ ఊరుకోగలమా? షెర్లీ దేవరపల్లిలా ముందుండి సాయం చేస్తాం.  

తనలాంటి నగరవాసులు వరదలో చిక్కుకుంటే చలించిపోయింది షెర్లీ. డిగ్రీ కూడా పూర్తికాని వయసులో సామాజిక స్పృహతో ఎన్‌జీఓ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. వరదల వల్ల ఇల్లేదో.. రోడ్డేదో తెలియకపోతే ఆ ఇండ్లలో ఉన్నవాళ్ల పరిస్థితేంటి? ప్రభుత్వం చేస్తున్న కృషికి పౌరులుగా మన వంతు బాధ్యత అందించ వద్దా? అని మురికి వాడల్లో ఫుడ్‌ డ్రైవ్‌ చేపట్టింది. 

గుడ్‌విన్‌ ట్రస్ట్‌ : షెర్లీ హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్నది. చిన్నప్పటి నుంచే సామాజిక స్పృహ కలిగిన అమ్మాయి. తమిళనాడు కేంద్రంగా ‘గుడ్‌విన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌' నిర్వహిస్తున్నది. నిత్యం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే ఈ ట్రస్ట్‌కు తెలంగాణ, తమిళనాడు, ఆంద్రప్రదేశ్‌లో వలంటీర్లు ఉన్నారు. హైదరాబాద్‌ను వరద ముంచెత్తింది అని తెలిసిన వెంటనే షెర్లీ రంగంలోకి దిగింది. ముంపునకు గురైన వాడల్లో, బస్తీల్లో ఫుడ్‌ డ్రైవ్స్‌ నిర్వహించింది. 

మురికి వాడల్లో : చాదర్‌ఘాట్‌, మియాపూర్‌, నిజాంపేట, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ స్లమ్‌ ఏరియాలు పూర్తిగా వరదల్లో మునిగిపోయాయి. ఇక్కడికి వెళ్లాలంటే ఎవరూ సాహసించలేదు. ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నది. మన వంతుగా ఏదైనా చేద్దాం అని వలంటీర్లు భానుతేజ, మోనిక బాశెట్టి, దివ్యాంశ్‌, హృతిక్‌, గణేషన్‌ ఈశ్వర్‌, అనిల్‌, హృషిలను వేర్వేరు బృందాలుగా పంపించింది. ప్రజల అవసరాలేంటో తెలుసుకొని వారి ఆకలి తీర్చే ప్రయత్నం చేసింది. తొలిరోజే చాదర్‌ఘాట్‌లో 100 మందికి, నిజాంపేట్‌లో 60 మందికి, లోయర్‌ట్యాంక్‌ బండ్‌లో 200 మందికి ఆహారం పంచారు. 

స్కెచెస్‌తో వచ్చిన ఆదాయం : వరద బాధితులకు సాయం చేసేందుకు షెర్లీ తన కళను వనరుగా ఉపయోగించింది. ‘స్కెచెస్‌ వేయించుకోండి. డబ్బు ఇవ్వండి. ఆ డబ్బుతో వరద బాధితులకు సాయం చేస్తాం’ అంటూ విసిరిన ఛాలెంజ్‌కు మంచి స్పందన వచ్చింది. నందు, మానస అనే హైదరాబాదీలు స్కెచెస్‌ వేయించుకునేందుకు ముందుకొచ్చారు. ఆ తర్వాత ఒక్కొక్కరు తమ స్కెచెస్‌ వేయించుకుంటూ పరోక్షంగా వరద బాధితులు ఆకలి తీరుస్తున్నారు. 

సాధికారతే లక్ష్యం: షెర్లీ దేవరపల్లి మహిళా సాధికారత కోసం పనిచేస్తున్న సామాజిక కార్యకర్త. వెనుకబడిన ప్రాంతాలు, మురికివాడల యువతులకు, మహిళలకు గృహహింస, లైంగిక వేధింపుల విముక్తి, పోలీసు కేసులు, చట్టపరమైన అంశాల గురించి అవగాహన కల్పిస్తుంది. నిరుపేదలు, వృద్ధులు, చిన్నారులకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న షెర్లీకి ఇటీవలే ‘గ్లోరీ ఆఫ్‌ తెలంగాణ’ అవార్డు వచ్చింది. 

వరద బాధితులకు సాయం చేసేందుకు షెర్లీ తన కళను వనరుగా ఉపయోగించింది. 

‘స్కెచెస్‌ వేయించుకోండి. డబ్బు ఇవ్వండి. ఆ డబ్బుతో వరద బాధితులకు సాయం చేస్తాం’ అంటూ విసిరిన ఛాలెంజ్‌కు మంచి స్పందన వచ్చింది.