శుక్రవారం 04 డిసెంబర్ 2020
Zindagi - Oct 22, 2020 , 01:25:56

ఇల్లొకటైతే బాగుండు!

ఇల్లొకటైతే బాగుండు!

మిల్కూరి గంగవ్వ.. ఒకప్పుడు.. కొడవండ్లు చేతబట్టి.. కొంగు నడుముకు చుట్టి  కలుపు నాట్లే లోకంగా బతికేది. కానీ.. ఇప్పుడు.. ఆమె ఒక సెలబ్రిటీ. లంబాడిపల్లి నుంచి లండన్‌ దాకా వినిపించే ఓ పిలుపు. మల్యాల మట్టి వాసననూ.. జగిత్యాల జయకేతనాన్ని ప్రపంచానికి చాటిన పల్లె ఆణిముత్యం. పేరు పెద్దదే.. అయినా ఆమె ఇల్లు అంత విశాలమైంది కాదు. గట్టిగ పది చినుకులు పడితే కురుస్తుంది. మంచి ఇల్లొకటైతే బాగుండు అనేది గంగవ్వ కల. ఆ కల సాకారం ఎలా కాబోతుంది? గంగవ్వకు ఎలాంటి ఇల్లంటే ఇష్టం? ఇంటి చుట్టూ అల్లుకున్న గంగవ్వ జీవిత చిత్రమేంటి.? 

మంచి ఇల్లు కట్టుకోవాలని అందరికీ ఉంటుంది. గంగవ్వకూ ఉంది. జీవితంలో ఎన్ని కష్టాలను జయించిందో? ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నదో? ఆమె చాలా సందర్భాల్లో వివరించింది. ఇప్పుడు, తన మనసంతా విశాలమైన ఇంటి గురించే ఆలోచనలు. అరవైయేండ్ల వయసులో ప్రభుత్వం ఇచ్చే పింఛనేదో తీసుకుంటూ టెన్షన్‌ లేకుండా బతకాల్సిన గంగవ్వ.. తనంతట తానుగా తన కలను నిజం చేసుకునేందుకు నిత్యం పోరాడుతూనే ఉన్నది. 

గంగవ్వ మనసు చాలా విశాలమైంది. గల్లీ చిన్నదీ.. గరీబోల్ల కథ పెద్దది అన్నట్లు ఒక్కరికి కూడా సరిపోనంత ఇల్లు వాళ్లది. ‘నేను ఇప్పుడు ఉండేది పాతకాలం ఇల్లు. మూడు గజాలల్ల నా చిన్నతనంల కట్టిండ్రు. అదే ఇంట్ల పిల్లల్ని పెద్దజేసి పెండ్లిళ్లు చేసిన. అప్పోసప్పోజేసి వారికి ఏ లోటూ లేకుంట చూసుకున్న. కానీ ఓ సుట్టమొచ్చినా.. ఇంకెవలన్న వచ్చినా ఇబ్బందే. నాకు పదిహేడు మంది యారాండ్లు. ఏదైనా సందర్భమొస్తే సరిపోతదా అనే రంది పట్టుకుంది. నా భర్త ఎనిమిదేండ్ల కిందట కాలంజేసిండు. అప్పటి సంది నేనొక్కదాన్నే ఈ ఇంట్ల ఉంటున్న’ అని చెప్పింది గంగవ్వ. 

బిగ్‌బాస్‌ వేదికపై..  


‘మై విలేజ్‌ షో’ గంగవ్వను సెలబ్రిటీని చేసింది. బిగ్‌బాస్‌  దాకా తీసుకెళ్లింది. గంగవ్వకు ఇదంతా ఓ కొత్త ప్రపంచమే. చాలా ఓపిక ఆమెకు. అరవైలో తన జీవితమిలా తిరుగుతుందనిగానీ.. ఇంతమంది అభిమానం పొందుతాననిగానీ ఎప్పుడూ ఆలోచించలేదు కావచ్చు. శ్రీకాంత్‌ శ్రీరామ్‌ తన లైఫ్‌ను మార్చేశాడు. కానీ గంగవ్వకు ఇల్లు ధ్యాస అలాగే ఉంది. బిగ్‌బాస్‌ వేదిక మీద కూడా ఇల్లు గురించే ప్రస్తావించింది. ‘మా అత్తమామల నుంచి వారసత్వంగా వచ్చిన పొలం అమ్మి ముగ్గురు బిడ్డల పెండ్లిళ్లు చేసిన. మై విలేజ్‌ షో ద్వారా వచ్చిన డబ్బుతో ఆరు లక్షల అప్పు తీర్చిన. ఇక ఇల్లు ఒకటి మిగిలి ఉంది’ అని గంగవ్వ అంటున్నది.

ఇల్లు ఇలా ఉంటే.? 


గంగవ్వ మట్టితో మమేకమయ్యే మనిషి. మట్టిలో మాణిక్యం. బిగ్‌బాస్‌ వంటి అద్దాల మేడల్లో ఐదారు వారాలు ఉన్నా అవేవీ ఆమె మనసును మార్చలేదు. కాకపోతే అందులో ఉన్నంత వరకు బిగ్‌బాస్‌ ఇంటిని అలా చూస్తూ ఉండిపోయిందట. బిగ్‌బాస్‌ ఇంటి గురించి ప్రస్తావిస్తూ.. ‘అమ్మో ఎంత పెద్ద ఇల్లది? సిత్రమనిపించేది. పెద్ద పెద్దోళ్లయి ఇండ్లు చాలనే చూసినగనీ.. బిగ్‌బాస్‌ అసొంటి ఇల్లు మాత్రం ఎప్పుడూ సూడలే. ఎంత తిరిగినా ఒడవది. వంట రూమ్‌ను చూస్తే ముచ్చటేసేది. కానీ గంత ఇల్లు మనకెందుకు? ఏదో ఉన్నకాడికి నాలుగు అర్రలుంటే చాలు. ఒక అర్రల నేనుంటా. మిగిలిన వాట్లో కొడుకు.. పిల్లలు ఉంటే సరిపోతుంది. కూసొని మాట్లాడుకునేందుకు ఒక పెద్ద హాలు.. వంట చేసుకోవడానికి ఒక కిచెన్‌ ఉండాలె. ఒక కాంపోండ్‌ వాల్‌ల మొక్కలు నాటి వాటిని పెంచుతూ జీవితం అనుభవించాలనేది నా కోరిక. ఎంత పెద్ద ఇల్లు అయినా కోళ్లను పెంచడం మరిచిపోను సూడుర్రీ’ అని వివరించింది. 

ఏసీలూ గీసీలొద్దు

గంగవ్వ మట్టిబిడ్డ. బిగ్‌బాస్‌ ఇంట్లో తను తనలాగే సహజంగా ఉన్నది. అందుకే ఆమెకు ఏ నామినేషన్లు.. ఎలిమినేషన్లు వర్తించలేదు. రోజూ సహవాసం చేసే చెట్లు.. కోళ్లు.. మట్టి అక్కడ దొరక్క ఆమె ఇబ్బంది పడింది. ముఖ్యంగా ఏసీ. అది పడకపోవడం కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ‘చాలా తక్కువమందికి అవకాశమొస్తది గంగవ్వా.. బిగ్‌బాస్‌లకు పోవాలె అని శ్రీకాంత్‌ చెప్పితే సరే అన్నాను. క్వారంటెన్‌లనే ఇరవై రోజులు ఉంచిండ్రు. తర్వాత బిగ్‌బాస్‌ల ఐదు వారాలు. ఇన్ని రోజులూ ఏసీలనే ఉన్న. నాకు ఏసీ పడలేదు. ఇండ్లల్ల ఈ ఏసీలూ గీసీలూ మనకెందుకు.. కాయకష్టం చేసుకునేటోల్లం కదా?’ అని చెప్పుకొచ్చింది. 

బీపీ లేదు.. షుగర్‌ లేదు! 

గంగవ్వ కల నెరవేరాలి. ఆమె పడ్డ కష్టానికి ఫలితం దక్కాలి. దుబాయి వెళ్లి డబ్బులు తెస్తానన్న భర్త ఖాళీ చేతులతో వచ్చినప్పుడు ఆమె బెదరలేదు. మూడు లక్షల అప్పు ఆరు లక్షలు అయినప్పుడు కూడా అదరలేదు. ఎవరి సహకారం లేకుండానే ముగ్గురు బిడ్డల పెండ్లిళ్లు చేసింది. అవన్నీ అయిపోయాకే విజయం వరించింది. తన కష్టం గురించి గంగవ్వ ఏమంటుందంటే.. ‘మా తల్లిగారిది జగిత్యాల దగ్గర పొలాస. ఐదేండ్లప్పుడు పెండ్లయింది. మా నాయిన నా చిన్నతనంలోనే కాలంజేసిండు. తర్వాత అమ్మ. నాకు ఇద్దరు తమ్ముండ్లు. నా పెండ్లి ఐదేండ్లకే అయితే పాలోల్లు ఎవలూ తమ్ముండ్లను సాకలేదు. ఒకరిని యాదవులు పెంచుకుండ్రు.. ఇంకో తమ్మున్ని సుట్టాలోల్లు తీస్కపోయిండ్రు. ముగ్గురం మూడు దిక్కులా అయిపోయినం. పుట్టినింటికాడ చిన్న పిట్టగూడసొంటి ఇల్లే. మెట్టినింటికాడ చిన్న గుడారమసొంటి ఇల్లే. ఇంత మంచి పేరు సంపాదించిన. ఇంతమంది గుండెలల్ల గూడు కట్టుకున్న నేను ఉండెనీకె ఓ ఇల్లు కట్టుకోలేదనే మాటెందుకనీ ఏ బీపీ షుగర్లను దగ్గెరికి రానీయకుంట తిప్పలు పడుతున్నా. నా కల నెరవేర్తదనే అనుకుంటున్న’ అని ముగించింది గంగవ్వ. 

ఇల్లు అంటేనే నిమ్మళం 

గంగవ్వ చాలాసార్లు చెప్పింది.. తన ఏకైక లక్ష్యం ఇల్లే అని. ‘అరవైయేండ్ల వయసులోనూ ఇల్లు కట్టాలనే తాపత్రయం ఎందుకు  గంగవ్వా?’ అని అడిగితే.. ‘నాది మామూలు కష్టమా? పొద్దుననంగ పోతే రాత్రి ఏడెనిమిది అయ్యేది ఇంటికొచ్చే సరికి. ఆ పనీ ఈ పనీ చేసుకొని ఇంత తిని కునుకు తీద్దాం అనుకునే సరికి ఏ వానో వచ్చి ఇల్లంతా కురిసేది. అప్పుడు బాధనిపించేది. పానం అస్సలు నిమ్మళం ఉండకపోయేది. కాయకష్టంజేసి ఇంట్లకొస్తే కనీసం నిద్ర అయినా సక్కంగ పట్టకపోతే ఎట్లా? అందుకే ఇల్లంటే ఇష్టమేర్పడింది’ అని తెలిపింది. 

నాగార్జున సారు అన్నలాంటోడు

సినిమా వాళ్లు బయటకు కనిపించడం వేరు.. లోపల వేరు అని చాలామంది అనుకుంటారు. కానీ గంగవ్వ అట్లా ఉండరు కావచ్చు అంటున్నది. ‘గంత పెద్ద ప్రోగ్రాం. పదహారు మందిలో నేనొకదాన్ని. నన్నెవరు పట్టించుకుంటరు.. ఈ సీన్మలోల్లు మనల్ని చూస్తరా అనుకున్న. కానీ బిగ్‌బాస్‌లకు అడుగుపెట్టిన కాన్నుంచి నాగార్జున సారు నన్ను బాగా చూసుకుండ్రు. గంగవ్వా అనుకుంట కడుపునిండా మాట్లాడేటోడు. నా సమస్యలు విన్నడు. నన్ను ఎంకరేజ్‌ చేసిండు. ఇల్లు.. కష్టం గురించి ఆయనకు కూడా చెప్పిన. ‘నేను లేనా గంగవ్వా’ అని ధైర్యమిచ్చిండు. ఆయన నాకు ఓ అన్నలాంటోడు. బైట కూడా అనుకుంటుండ్రు కదా.. గంగవ్వకు నాగార్జున సార్‌ మాటిచ్చిండు అని.. సూద్దాం. బిగ్‌బాస్‌ల నిజంగా పొలం పని చేసే టాస్క్‌ పెట్టేదుండె. అందరూ ఎలిమినేట్‌ అయ్యి నేనొక్కదాన్నే ఉండిపోదు’ అని నవ్వుకుంటూ చెప్పింది.