సోమవారం 30 నవంబర్ 2020
Zindagi - Oct 22, 2020 , 01:25:48

బరువు తగ్గించే.. జంతు వ్యాయామం!

బరువు తగ్గించే.. జంతు వ్యాయామం!

జంతు వ్యాయామం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? 

అవును. ఇది జంతు వ్యాయామమే. 

కానీ మనుషులు చేసేది. ఇదిప్పుడు , ప్రపంచ

వ్యాప్తంగా  క్రేజ్‌ ఉన్న ఫిట్‌నెస్‌ మంత్ర. 

హైదరాబాద్‌లో ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న ‘యానిమల్‌ ఫ్లో’ ఫిట్‌నెస్‌ ట్రెండ్‌ గురించి... 

ఒకప్పుడు గ్రామాల్లో కోతి కొమ్మచ్చి, కప్పగంతులు, ఎగురుడు దుంకుడు వంటి వ్యాయామ క్రీడలు ఉండేవి.  తర్వాత ఏమైంది? ఆధునికత అడ్డొచ్చింది. రకరకాల వ్యాయామాలు వచ్చాయి. అది కూడా కుదిరితేనే. ప్రతి 10 మందిలో  ఆరుగురికి అధిక బరువు పెద్ద సమస్యగా మారిపోయింది. జిమ్‌లు.. జుంబాలు ఎన్ని ఉన్నా బరువు అంత ఈజీగా తగ్గలేని పరిస్థితి. అందుకే ఇప్పుడు, పాత పద్ధతులను పాటించి శరీర బరువును సులువుగా వదిలించుకుందామని అంటున్నారు ఫిట్‌నెస్‌ ట్రైనర్లు. అలాంటి ప్రోగ్రామే ‘యానిమల్‌ ఫ్లో’, అదే జంతు వ్యాయామం. 

హైదరాబాద్‌లో: బెంగళూరుకు చెందిన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ దేవ్‌రాత్‌ విజయ్‌ ‘యానిమల్‌ ఫ్లో’ ప్రోగ్రామ్‌ను హైదరాబాద్‌లో పరిచయం చేశారు. దీనిపట్ల మంచి క్రేజ్‌ ఏర్పడింది. ప్రత్యేక ఫిట్‌నెస్‌ సెంటర్లు కూడా వెలిశాయి. నగరంలో ఉన్న చాలా కొద్దిమంది యానిమల్‌ ఫ్లో ప్రోగ్రామ్‌ ట్రైనర్స్‌లో  శిఖర బద్దం ఒకరు. యానిమల్‌ ఫ్లో ఎక్సర్‌సైజ్‌  ప్రయోజనాల  గురించి తను ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

ప్రయోజనం ఏంటి?: యానిమల్‌ ఫ్లో ప్రధాన ఉద్దేశం శరీర బరువును తగ్గించడం. దాంతో పాటు కండరాలు దృఢపడతాయి. పక్కటెముకలు బలపడతాయి. ఈ ఎక్సర్‌సైజ్‌ చేసేవాళ్లు శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఫిట్‌గా ఉంటారని చెప్తున్నారు శిఖర. పైగా ఇక్కడ నేర్చుకోవాల్సింది కొత్తగా ఏమీ ఉండదు. మనం రోజూ జంతువులను చూస్తూనే ఉంటాం. వాటి కదలికలను అనుకరించడమే.  కోతిలా నడవడం.. పీతలా పాకడం.. పులిలా దూకడం వంటి విన్యాసాలూ ఉంటాయి. సరదాగానూ.. ఆహ్లాదకరంగానూ ఉండే ఈ భంగిమలు చక్కని శరీరాకృతినీ ఇస్తాయి. 

ఎంత తగ్గొచ్చు?: చాలామంది ఉత్సాహంతో ఆన్‌లైన్‌ ఫిట్‌నెస్‌ తరగతుల్లో చేరుతారు. కానీ ఏమవుతుంది? నెల రోజులు గడవకముందే ‘అబ్బా మనవల్ల కావడం లేదు. ఇక చాల్లే’ అనుకుంటారు. ఒకరకంగా బోర్‌ ఫీలవుతుంటారు. కానీ యానిమల్‌ ఫ్లో అలా కాదు. ఇది రోజు రోజుకూ మనలో ఆసక్తిని పెంచుతుంది. దానికి కారణం ఆ భంగిమలే. సరదాగా ఆటలాడినట్లు ఉంటుంది తప్పా, కష్టపడి భారీ వ్యాయామాలు చేసినట్లు అనిపించదు. దీనివల్ల, నిర్ణీతకాలంలో సుమారుగా 10-12 కిలోల బరువు తగ్గొచ్చు అని చెబుతున్నారు నిపుణులు. అయితే, దీనికి జీవనశైలి మార్పులూ తోడుకావాలి.