గురువారం 26 నవంబర్ 2020
Zindagi - Oct 22, 2020 , 01:25:48

అర్హత

అర్హత

అక్బర్‌ చక్రవర్తికి ఒక బావమరిది  ఉండేవాడు. పేరు దిలావర్‌. ఎలాగైనా మంత్రి పదవిని దక్కించుకోవాలని అతని కోరిక. బీర్బల్‌ను తప్పించి తనకు అవకాశం ఇవ్వాలని అక్బర్‌ను చాలాసార్లు కోరాడు. కానీ అపారమైన తెలివితేటలు ఉన్న బీర్బల్‌ను  తొలగించడం చక్రవర్తికి ఇష్టం లేదు. కానీ దిలావర్‌ పదేపదే  విసిగిస్తూ ఉంటే అక్బర్‌ చివరికి.. ‘చూడు దిలావర్‌! మంత్రి కావాలనుకున్న వాడికి ఎంతో పదునైన ఆలోచనా శక్తి, హాస్య చతురత, సమయస్ఫూర్తి ఉండాలి! మరి అవన్నీ నీకు ఉన్నాయా?’ అని అడిగాడు. ‘ఓ! ఉన్నాయ్‌' అన్నాడు ఆనందంగా దిలావర్‌. 

‘ఉన్నాయంటే సరిపోదు. రేపు సభలో నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను. దానికి సమాధానం చెప్పగలిగితే నీకు మంత్రి పదవి ఇస్తాను!’ అన్నాడు అక్బర్‌. దిలావర్‌ సరేనన్నాడు. మర్నాడు సభలో ‘దిలావర్‌!  ఇక్కడ ఉన్నవారంతా మనసులో నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పు!’ అని ప్రశ్నించాడు అక్బర్‌.  దానికి దిలావర్‌ ‘ఏంటీ ? ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలా? నేనే కాదు.   ఎవరూ కూడా చెప్పలేరు!’ అన్నాడు. అక్బర్‌ చిరునవ్వు నవ్వి బీర్బల్‌ వైపు తిరిగి ‘పోనీ నువ్వు చెప్తావా?’ అని అడిగాడు. 

‘ఇంత మామూలు ప్రశ్నకి సమాధానం చెప్పలేనా ప్రభూ!’ అన్నాడు బీర్బల్‌. అది వినగానే దిలావర్‌కు చాలా కోపం వచ్చింది. ‘ఏంటీ? అక్బర్‌ పాదుషా అడిగింది అతి మామూలు ప్రశ్నా? అంటే పాదుషా వారి తెలివితేటల్ని తమరు తక్కువగా అంచనా వేస్తున్నారా? అయితే,   ఇక్కడున్నవారు ప్రస్తుతం అక్బర్‌ పాదుషా గురించి ఏమనుకుంటున్నారో చెప్పండి మరి!’ అన్నాడు రోషంగా.  ‘చెప్పు బీర్బల్‌!’  రెట్టించాడు అక్బర్‌. ‘ప్రభూ! ఇక్కడ ఉన్నవారంతా మీ పరిపాలనలో ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారని అనుకుంటున్నారు. అంతేకాదు పాదుషా వారు ఎల్లప్పుడూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ అల్లాను వేడుకుంటున్నారు’ అని సమాధానం ఇచ్చాడు. అక్బర్‌ చిరునవ్వుతో సభలోని వారందర్నీ చూశాడు. అంతా ‘అవును, మేం అలానే అనుకుంటున్నాం’ అని ముక్తకంఠంతో జవాబిచ్చారు. అప్పుడు అక్బర్‌ ‘చూశావా బీర్బల్‌ గొప్పదనం’ అని అర్థం వచ్చేలా దిలావర్‌ వైపు చూశాడు. దిలావర్‌ సిగ్గుతో తల దించుకున్నాడు. అక్బర్‌ బీర్బల్‌ను ఘనంగా సత్కరించాడు. అలా ఆలోచించలేదని చెప్పగలిగే ధైర్యం సభలో ఎవరికి మాత్రం ఉంటుంది?