శుక్రవారం 04 డిసెంబర్ 2020
Zindagi - Oct 21, 2020 , 00:23:11

బుట్టబొమ్మకు..బుట్టపూసల హారం!

బుట్టబొమ్మకు..బుట్టపూసల హారం!

బుట్టపూసల హారానికి బంగారంతో మెరుపు వస్తుంది, పూసలతో సంప్రదాయ సౌరభం అబ్బుతుంది. ఆ ధగధగలతో మగువ మెడ శంఖాన్ని తలపిస్తుంది. నలుగురిలోనో, నలభైమందిలోనో ఆమె ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆ హారాన్ని దసరా కానుకగానో, దీపావళి బహుమతిగానో ఇచ్చిన పతిదేవుడి మీద  ప్రేమ పదింతలు పెరుగుతుంది.

  • సంప్రదాయ నెక్లెస్‌లలో బుట్టపూసల హారం ఒకటి. ఆభరణ ప్రపంచానికి ఇది దక్షిణాది కానుక. కోరమాండల్‌ తీరంలో ఈ డిజైన్‌ ప్రాణం పోసుకున్నదని చెబుతారు. అలంకార ప్రియులైన తెలుగు మహిళల మనసులనూ దోచుకున్నదీ నగ. బుట్ట పూసలు అంటే.. బుట్టెడు పూసలనీ, పూసల సమూహమనీ అర్థం! వీటినే గుట్ట పూసలని కూడా అంటారు.
  • బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ తన పెండ్లికి బుట్టపూసల హారాల్నే ఎంచుకున్నది. ఆ ఆభరణంలో కొత్తపెండ్లి కూతురి వైభోగాన్ని చూడాల్సిందే. ఆ ఫొటోల్నీ వీడియోల్నీ చూసి, కాబోయే వధువులు పట్టుబట్టి మరీ బుట్టపూసల డిజైన్లకే ఓటేస్తున్నారు. 
  • మగ్గం వర్క్‌లో బుట్టపూసలతో కుట్టిన ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌లు సంప్రదాయ ఫ్యాషన్‌ ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి. గ్రాండ్‌గా ఉండే చీర మీదికి భారీగానూ, సింపుల్‌గా కనిపించే చీరమీదికి కొద్దిగానూ ముత్యాలను వాడతారు. 
  • బుట్టపూసల హారాలంటే ఖరీదైన వ్యవహారమే. ఆ భారాన్ని తగ్గించేందుకు డిజైనర్లు బంగారు తీగల స్థానంలో రాగిని, వెండిని కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ఆభరణాలు లంగా ఓణీలూ, పరికిణీలూ, పట్టుచీరల పైన అతికినట్టు సరిపోతాయి.
  • తీరొక్క ముత్యాలతో అల్లిన హారమిది. వీటిని నెక్లెస్‌లా చేయించుకుంటారు. చౌకర్‌లా ఇష్టపడతారు. పొడవుగా నాభి వరకూ కూడా వేసుకుంటారు. కాసులపేరులో భాగం చేసుకునేవారూ ఉన్నారు. అతివలవి భిన్న రుచులు. ఎవరి అభిరుచికి తగినట్టు వారు డిజైన్‌ చేయించుకోవచ్చు. 
  • బుట్టపూసల హారాలు యాంటిక్‌ జువెలరీని తలపిస్తాయి. దీంతో నిన్నలేని అందమేదో నేడు సాక్షాత్కరిస్తుంది. అందమేనా? ఇదీ అని చెప్పలేని ఆధ్యాత్మిక తేజస్సుతో కళకళలాడతారు. కాబట్టే, గృహ ప్రవేశాలు, వ్రతాలు తదితర ప్రత్యేక సందర్భాలకు మగువల ఓటు బుట్ట పూసల హారాలకే. 
  • ఖరీదైన వ్యవహారమే అయినా, అన్‌కట్‌ డైమండ్‌తో పూసల హారానికి కొత్త మెరుపు తోడవుతుంది. ముత్యాలూ, రత్నాలూ, పగడాలూ కూడా మంచి కాంబినేషనే. బంగారంతో పూసలు చేయించుకోవడానికి ఇష్టపడేవారూ చాలామందే ఉన్నారు. 
  • కోటిలింగాల తవ్వకాలలో బంగారు పూసలతో చేసిన హారం బయటపడింది. ఆ ప్రకారంగా, వేల సంవత్సరాల నుంచీ పూసల హారాలు తెలంగాణ మగువల మనసులను దోచుకుంటున్నట్టు అర్థం 

అవుతున్నది.  

రితీషా సతీష్‌రెడ్డి 

ఈశా డిజైనర్‌ హౌస్‌

ఫోన్‌: 7013639335, 8500028855, 

facebook.com/eshadesignerworks