శుక్రవారం 04 డిసెంబర్ 2020
Zindagi - Oct 21, 2020 , 00:23:22

యూట్యూబ్‌లో బతుకమ్మ ట్రెండింగ్‌ చందమామ

యూట్యూబ్‌లో బతుకమ్మ ట్రెండింగ్‌ చందమామ

బతుకమ్మ పండుగ సందర్భంగా పల్లెల్లోనే కాదు.. యూట్యూబ్‌ కూడలిలోనూ హుషారైన పాటలు సద్దు చేస్తున్నాయి. తెలంగాణ యాసతో బతుకమ్మకు నీరాజనాలు అర్పిస్తున్నాయీ పాటలు. లక్షల్లో వ్యూస్‌ కొల్లగొడుతూ ట్రెండింగ్‌ జాబితాలోకి చేరిపోయాయి. సంప్రదాయ గీతాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అల్లుకున్న ఈ గీతాలు బతుకమ్మ వైభవాన్ని కండ్లముందు ఉంచుతున్నాయి. గునుగుపూల తోటలు, పచ్చని చేనులు, అలుగు పారుతున్న చెరువుల మధ్య చిత్రీకరణ జరుపుకొని తెలంగాణ పల్లె సౌందర్యాన్ని సాక్షాత్కరిస్తున్నాయి.

జంటగళాల మాయాజాలం


‘కొంగుళ్ల జుట్టుండ్రె కోమాలాంగి గునుగమ్మలంచుండ్రె సుందరాంగి

ఊయల్ల ఊగేటి పూవుల్ల తలనిమిరి తెంపుండ్రె ఆగి ఆగి’

పూల బతుకమ్మకు అచ్చమైన అక్షరార్చన ఈ పాట. అందమైన పాటను వినసొంపుగా ఆలపించారు కనకవ్వ, లక్ష్మి. తెలంగాణ జానపదాలు వారి గొంతుల్లో చేరితే మరింత మనోహరంగా వినిపిస్తాయి. అందుకే కాసర్ల శ్యామ్‌ రాసిన ఈ బతుకమ్మ పాట ఏకంగా 23 లక్షల వ్యూస్‌ సొంతం చేసుకుంది. అందంగా పాడటంతోపాటు అద్భుతంగా అభినయించి ఇద్దరూ మాయాజాలం చేశారంటూ ప్రశంసలు అందుకుంటున్నారు.

మంగ్లి మళ్లీ..


ఏటా విభిన్నమైన బతుకమ్మ పాటతో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండే గాయకురాలు మంగ్లి ఈసారీ అదే జోరును కొనసాగించింది. ఆమె ప్రాణం పెట్టి పాడిన కాసర్ల శ్యామ్‌ రాసిన పాట, బతుకమ్మ ఔన్నత్యాన్ని తెలియజేస్తున్నది. తన గాత్ర మాధుర్యంతో, నటనా వైచిత్రితో మరోసారి యూట్యూబ్‌ ప్రేక్షకులను అలరించింది మంగ్లి.

‘సేను సెలక మురిసేటి వేళ

రామసిలక పలికేటి వేళ ఊరే తెల్లారే!

వాడంత రంగుల రంగుల సింగిడాయె

పల్లెంతా పండుగొస్తె సందడాయె’ అని సాగిపోయే పాట కొమ్మల్లో పూల గుత్తులను పలకరిస్తూ, గాలుల్లో తేలివచ్చే పరిమళాన్ని అద్దుకొని లక్షల వ్యూస్‌ సొంతం చేసుకుంది. దాదాపు 18 లక్షల మంది ఈ పాటను వీక్షించడం విశేషం.

జ్యోతక్క కమాల్‌


సరదా వార్తల్లో ముఖ్యాంశాలు చెప్పే జ్యోతక్క బతుకమ్మ పాటతో మరోసారి యూట్యూబ్‌ స్టార్‌ అయింది. మానుకోట ప్రసాద్‌ రాసిన బతుకమ్మ పాటకు అద్భుతంగా నర్తించి, నటించి 11.45 లక్షల వ్యూస్‌ కొల్లగొట్టింది. రేలారే గంగ, హనుమంతు యాదవ్‌ ఆలపించిన ఈ పాట బతుకమ్మ పండుగ తీరును వివరించింది.

‘ఏ తల్లి కడుపు పంటవే బతుకమ్మ

జగమే కొలిసి మురిసేనమ్మా

ఏ కలతలు ఎదురుపడక దీవించమ్మా

జీవితమంతా కొలిసెదమమ్మా..’ అని వినిపించే పాట తెలంగాణవాసులు బతుకమ్మకు ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తారో తెలియజేస్తున్నది.

యూట్యూబ్‌ పల్లకిలో


బతుకమ్మ సందడంతా పల్లెల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఆ వైభవాన్ని తన పాట ద్వారా ఆవిష్కరించారు రచయిత కందికొండ. అంతే అందంగా పాడి యూట్యూబ్‌ ప్రేక్షకులను అలరిస్తున్నారు గాయకులు వరం, భోలె. పుట్టింటికి అక్కలను రమ్మన్నవి రారమ్మన్నవి అంటూ ఆడబిడ్డల పండుగ ప్రత్యేకతలన్నీ ఇందులో చూపించారు. సెలయేరులా సాగే ఈ పాట కొద్దిరోజుల్లోనే 10 లక్షల వ్యూస్‌ సొంతం చేసుకొని మిలియన్‌ మార్కు చేరుకునే దిశగా సాగిపోతున్నది.పచ్చని పల్లకిలో తీరొక్క పువ్వులతో బతుకమ్మ వచ్చేసిందే అద్దాల వాకిట్లో అందాల ముగ్గులతో హరివిల్లు నవ్వేసిందే.. ఇలా బతుకమ్మ పండుగ జరిగే వైనాన్ని కండ్లకుకట్టి ట్రెండింగ్‌ అవుతున్నది.

తాజావార్తలు