శుక్రవారం 04 డిసెంబర్ 2020
Zindagi - Oct 21, 2020 , 00:23:19

రుజువు లేని ఫిర్యాదు

రుజువు లేని ఫిర్యాదు

ఒకసారి  రామయ్య, సోమయ్య అనే ఇద్దరు వ్యక్తులు మర్యాద రామన్న న్యాయస్థానానికి వచ్చారు. సోమయ్య  ఒక సంచిలోంచి చచ్చిన పామును బయటికి తీశాడు. ఆ పాము తల బాగా చితికిపోయి ఉంది. ‘అయ్యా!  రామన్నగారూ, చూడండి నా పామును ఇతడెలా భయంకరంగా చంపేశాడో. ఇది ఇతనికి ఏ హానీ చేయలేదు. కారణం లేకుండానే నా పామును చంపాడు’ అంటూ కోపంగా చెప్పాడు సోమయ్య.  అపుడు రామయ్య.. ‘అతను చెప్పింది నిజమే ప్రభూ! అదొక విషప్రాణి.. సోమయ్య దాన్ని స్వేచ్ఛగా వదిలేశాడు.  ఎవరినైనా అది కాటేయక మానదు. అందుకే  చంపేశాను.  ఈ పని నేరమైతే నన్ను శిక్షించండి’ అని  చెప్పాడు. ఈ విషయాన్ని అంగీకరిస్తూ మర్యాద రామన్న సోమయ్యకి సర్దిచెప్పబోయాడు.  అప్పుడు సోమయ్య.. ‘కంటికి కన్ను,  పంటికి పన్నే సరైన న్యాయమని నేను నమ్ముతాను. నా పాము ప్రాణాలకు బదులు ఇతని ప్రాణాలు తీయాల్సిందే, నేరస్థులను మీరు శిక్షించకపోతే రాజ్యంలో ఘోరాలు పెరుగుతాయి. నేను ఇతణ్ణి వదలను. నా పామును ఏ విధంగా చంపాడో ఇతన్ని కూడా అదే విధంగా చంపుతాను’ అన్నాడు అవేశంగా సోమయ్య. వెంటనే మర్యాద రామన్న కలగజేసుకొని.. ‘నీ పామును రామ య్య ఎలా చంపాడు?’ అని ప్రశ్నించాడు. దానికి సోమయ్య..‘నేను చూడలేదు.. కానీ పాము  తోక పట్టుకుని గిరగిరా గాల్లో తిప్పి నేలకేసి  కొట్టినట్టు అనిపిస్తున్నది’ అని బదులిచ్చాడు. ‘సరే, నువ్వు కూడా అతన్ని అలాగే చంపు. అతని తోక పట్టుకుని గాల్లోకి లేపి గిర గిరా నేలకేసి కొట్టు’ అని తీర్పు చెప్పాడు మర్యాద రామన్న. సోమయ్య అయోమయంలో పడ్డాడు. ‘మనిషికి తోక ఉంటుందా? ఆ తోక పట్టుకుని గాల్లో తిప్పి చంపడం సాధ్యమేనా? ఇదసలు కుదిరే పని కాదు’ అన్నాడు. అప్పుడు మర్యాద రామన్న 

‘ఇతరులకు ఇబ్బంది కలిగించేలా పామును పెంచుకోవడమే కాకుండా, దానిని వదిలేయడం ఇంకా పెద్ద తప్పు. ఇంకా ఇక్కడే ఉంటే ఆ శిక్ష నీకు వేయాల్సి వస్తుంది’ అని గద్దించాడు. తిరిగి తిరిగి తప్పు తనదయ్యేలా ఉందని గ్రహించిన సోమయ్య మారు మాట్లాడకుండా ఇంటి ముఖం పట్టాడు.