మంగళవారం 27 అక్టోబర్ 2020
Zindagi - Oct 18, 2020 , 23:29:53

రాణి లక్ష్మీబాయ్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌!

రాణి లక్ష్మీబాయ్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌!

దంగల్‌... బాలీవుడ్‌ చరిత్రలో నిలిచిపోయిన సినిమా! తను సాధించలేని ఆశయాలను... కూతుళ్లు సాధించాలనే తపనతో ఓ తండ్రి చేసిన పోరాటం. బిహార్‌కు చెందిన సంజయ్‌ పాఠక్‌ కథ అంతకంటే వైవిధ్యమైంది. తనతో ఏ రక్త సంబంధమూ లేని ఆడపిల్లలను చేరదీసి, క్రీడల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నాడు. మట్టిబిడ్డల మెడలో బంగారు పతకాలు పూయిస్తున్నాడు. వందలాది బాలికలు పాఠక్‌ మార్గదర్శకత్వంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. క్రీడాప్రపంచాన్ని కుదిపేస్తున్నారు.

బిహార్‌ అంటేనే వెనుకబడిన ప్రాంతమనే భావన స్ఫురిస్తుంది. అందులోనూ పశ్చిమ సరిహద్దులో ఉన్న శివన్‌ జిల్లా అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటుంది.  అక్షరాస్యత కూడా అంతంతమాత్రమే! ఆడపిల్లలను చదివించడమే గొప్ప అనుకునే చిన్నచూపు స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి చోట... ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు సంజయ్‌ పాఠక్‌. ఓసారి సంజయ్‌... తార, పుతుల్‌ అనే విద్యార్థినుల గురించి విన్నాడు. ఆ బాలికలిద్దరూ పరుగుపందాలలో మంచి ప్రతిభను సాధిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేకపోయినా, వాళ్లిద్దరూ సాధించిన విజయాలు సంజయ్‌లో ఆలోచన రేకెత్తించింది. సౌకర్యాలను కల్పిస్తే... ఇంకెంతమంది బాలికలు ఇంకెన్ని అద్భుతాలు చేస్తారో కదా అనిపించింది.

సొంతలాభం కొంత మానుకొని..

సంజయ్‌ పాఠక్‌కు లక్ష్మీపూర్‌ గ్రామంలో కొంత పొలం ఉంది. ఆ భూమిలో ధాన్యపు కంకులు విరగపండుతాయి. కానీ బాలికలు క్రీడల్లో రాణించాలనే తన లక్ష్యం కోసం... ఆ పొలాన్ని చదును చేశాడు. 2016లో అక్కడ ‘రాణి లక్ష్మీబాయ్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌' పేరుతో క్రీడా శిక్షణ సంస్థను స్థాపించాడు. నిజానికి సంజయ్‌ భౌగోళిక శాస్త్ర ఉపాధ్యాయుడు. కానీ, తన క్రీడా పరిజ్ఞానాన్ని మరింతగా పెంచుకుని పిల్లలకు ఎలాంటి ఆటలో అయినా శిక్షణ ఇచ్చే స్థాయికి చేరుకున్నాడు. హాకీ, రగ్బీ, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌... గ్రామం చుట్టుపక్కల ఏ ఆడపిల్ల, ఏ ఆట నేర్చుకోవాలన్నా సరే లక్ష్మీబాయ్‌ క్లబ్‌ ఓ వేదికగా నిలిచింది. తొలి పొద్దు నుంచి చీకటి పడేవరకూ, దాదాపు వందమంది ఆడపిల్లలు ప్రాక్టీస్‌ చేస్తూ కనిపిస్తారు. ఎటు వెళ్లాలో తోచని జీవితాలకు దివిటీలా మారింది ఈ క్లబ్‌.

మాణిక్యాలు

‘మొదట్లో పాఠక్‌ తీరు చూసి... పిచ్చివాడనుకున్నాం. కానీ, ఇప్పుడు మా బిడ్డలు సాధిస్తున్న ప్రగతిని చూస్తుంటే చాలా గర్వంగా ఉంటున్నది’ అంటారు ఓ తండ్రి. నిజమే! ఒక్కో ఏడాదీ గడిచేకొద్దీ పాఠక్‌ క్రీడా సంస్థ, తిరుగులేని ఫలితాలు చూపించ సాగింది. దాదాపు 25 మంది ఆడపిల్లలు పలు క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పతకాలు అందుకున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన రాధాకుమారి ‘జాతీయ హ్యాండ్‌బాల్‌ పోటీలు- 2016’లో బంగారు పతకం సాధించింది. అంతిమకుమారి అనే పద్నాలుగేండ్ల బాలిక, వందమీటర్ల పరుగు పందెంలో జాతీయస్థాయిలో బంగారు పతకాన్ని గెలుచుకోవడమే కాదు... ఆసియా క్రీడల్లో కూడా పాలుపంచుకుంది. సల్మా మరో పి.టి.ఉష అనే బిరుదు దక్కించుకుంది. సల్మా తండ్రి స్కూటర్‌  టైర్లకు పంక్చర్లు వేసుకునే సగటు మనిషి.  లక్ష్మీబాయ్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ లేకపోతే, సల్మా జీవితం ఇలా ఉండేది కాదేమో!

కష్టాలూ ఉన్నాయి


ఇప్పుడంటే సంజయ్‌ క్లబ్‌ పేరు రాష్ట్రం అంతా మారుమోగుతున్నది. కానీ, ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. ‘ఆడపిల్లల్ని చూసి ఆకతాయిలంతా గ్రౌండ్‌ చుట్టూ చేరేవాళ్లు. సీసాలు విసురుతూ, బూతు పాటలు పాడుతూ మా బిడ్డల్ని ఏడిపించేవాళ్లు. వాళ్లను అదుపుచేయాల్సింది పోయి, గ్రామపెద్దలు కూడా... ఆడపిల్లలు నిక్కర్లలో ఆడటం ఏమిటంటూ వేధించేవాళ్లు’ అంటారు సంజయ్‌. అంతేకాదు.. బడిలో తోటి ఉపాధ్యాయులు, ఇరుగుపొరుగు వాళ్లు, బంధువులు... అందరూ కూడా ఈ క్లబ్‌ను తీవ్రంగా విమర్శించేవారు. ‘అయినా నేను వెనక్కి తగ్గదల్చుకోలేదు. ఎన్ని సమస్యలు వచ్చినా... వాటిని దాటుకుని మరుసటి రోజు ఉదయానికంతా పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధపడేవాడిని’ అని చెబుతారు సంజయ్‌. అదృష్ట

వశాత్తు ఇప్పుడిప్పుడే... ఆ క్లబ్‌కి ఆర్థికంగా సాయపడేందుకు కొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి.   గ్రామస్తులు కూడా ప్రోత్సాహం అందిస్తున్నారు. అయినా సంజయ్‌లో ఏదో అసంతృప్తి. ‘ఈ పిల్లలకు మరింత మెరుగైన క్రీడా పరికరాలు ఇవ్వాలి. వ్యాయామశాల ఏర్పాటు చేయాలి. అలాంటి సౌలభ్యాలు కల్పించగలిగితే... వాళ్లు కచ్చితంగా ఒలింపిక్‌ పతకాల్ని కూడా సాధించగలరు’ అంటారు. అన్నట్టు ఇప్పుడు సంజయ్‌ పాఠక్‌ మైదానం చుట్టూ ఆకతాయిల స్థానంలో, బాలికల తల్లిదండ్రులు నిలబడుతున్నారు. తమ ‘బంగారు’ తల్లుల శిక్షణను చూస్తూ మురిసిపోతున్నారు.

సారు.. సూపర్‌!


సంజయ్‌ పాఠక్‌ మామూలు ఉపాధ్యాయుడే. అయినా, తనకి వచ్చే జీతంలోంచి నాలుగో వంతును క్లబ్‌ కోసమే వినియోగిస్తుంటారు. ఇసుకలో ఆడే ఆటల కోసం... ఊరికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగానదీ తీరం వరకు పిల్లలను తీసుకువెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించకపోయినా, శిక్షణ కోసం వచ్చే విద్యార్థినులకు అల్పాహారం పెట్టి మరీ ఆడిస్తారు సంజయ్‌. పైగా ‘పాపం... వాళ్లు పడే కష్టానికి నేను పెట్టే తిండి సరిపోతున్నదో లేదో!’ అని బాధపడతాడు. ఓ ఇరవై మంది ఆడపిల్లలు ఉండేందుకు సరిపడా గదిని కూడా ఏర్పాటు చేశాడు. లక్ష్మీబాయ్‌ క్లబ్‌లో కులమతాల పట్టింపు లేదు. పట్టుదలే ప్రవేశార్హత. ఇక్కడ అందరూ కలిసి ఆడాలి, కలిసి భోజనం చేయాలి.


logo