మంగళవారం 27 అక్టోబర్ 2020
Zindagi - Oct 18, 2020 , 23:29:53

త్వరలోనే కోలుకుంటాం

త్వరలోనే కోలుకుంటాం

కరోనాతో యావత్‌ ప్రపంచానికీ కోలుకోలేని దెబ్బ తగిలింది. ముఖ్యంగా వ్యాపార రంగం పూర్తిగా కుదేలైపోయింది. అయితే, ఈ కష్టకాలంలోనూ పురుషులతో పోలిస్తే మహిళా వ్యాపారులే ఎంతో సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నట్లు బెయిన్‌ అండ్‌ కో, అచీవింగ్‌ ఉమెన్‌ ఎంటర్‌ప్రైజె సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది. 

కొవిడ్‌-19, లాక్‌డౌన్‌ నేపథ్యంలో పలు వ్యాపార రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో అంకుర సంస్థలను నిర్వహిస్తున్న మహిళా వ్యాపారుల స్థితిగతులపైనా, వారి  లాభనష్టాలపైనా బెయిన్‌ అండ్‌ కో, అచీవింగ్‌ ఉమెన్‌ ఎంటర్‌ప్రైజ్‌ సంస్థలు ఓ సర్వే చేపట్టాయి. ఈ సందర్భంగా పలు ఆసక్తికర అంశాలను వెల్లడించాయి. దేశవ్యాప్తంగా 73శాతం మంది మహిళా వ్యాపారులు ఈ సంక్షోభంతో నష్టాలను చవి చూశారు. దాదాపు 20 శాతం మంది తమ ఆదాయాన్ని పూర్తిగా కోల్పోయినట్లు సర్వేలో తేలింది. అయినప్పటికీ, వీరిలో 90 శాతం మంది పూర్తి సానుకూల దృక్పథంతోనే ఉన్నారని సర్వే బృందానికి నేతృత్వం వహించిన మేఘా చావ్లా తెలిపారు. కరోనా నష్టాలను త్వరలోనే అధిగమించి, మళ్లీ లాభాల బాటలో పయనిస్తామని మెజారిటీ మహిళలు ఆశాభావం వ్యక్తం చేసినట్లు ఆమె చెప్పారు. నష్టపోయిన వారిలో 53శాతం మంది ఇప్పటికే తమ వ్యాపార ప్రణాళికను మార్చుకోగా, మరో 24శాతం మంది సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. ‘కరోనా మహమ్మారి మహిళల వ్యాపారాలను మాత్రమే నష్టపరిచింది. వారిలోని ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఏమీ చేయలేకపోయింది’ అని సర్వే సంస్థ ప్రతినిధులు అంటున్నారు. 


logo