మంగళవారం 27 అక్టోబర్ 2020
Zindagi - Oct 18, 2020 , 23:29:53

నానే బియ్యం బతుకమ్మ

నానే బియ్యం బతుకమ్మ

పండుగ పూట సమర్పించే ప్రతి నివేదనలో ఒక పరమార్థం ఉన్నది. బతుకమ్మ ఆట తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచుతారు. పాయసాన్నప్రియా, దధ్యాన్నాసక్త హృదయా, ముద్గౌదనాసక్త చిత్తా, హరిద్రాన్నైక రసికా, గుడాన్న ప్రీతి మానసా అంటూ అమ్మకు ఏదో ఒక రూపంలో అన్నాన్ని నివేదిస్తారు.

 ‘అన్నదా వసుధా వృద్ధా, బ్రహ్మాత్మైక స్వరూపిణీ’ శరీరం నిలవాలంటే అన్నం కావాలి. అలసట తీరాలంటే ఆహారం తీసుకోవాలి. బతుకమ్మ ఆడి పాడి అలసిన మహిళలకు.. అమ్మకు నివేదించిన ప్రసాదం పెడతారు. ప్రసాదం అంటే పది మందితో కలిసి పంచుకునేది. అది బలవర్ధకమైనదై ఉండాలి. రుచిగా ఉంటే మరీమరీ అడిగి తింటారు. ఎదుగుతున్న ఆడపిల్లలకు ఇది అవసరం కూడా! రాక్షస సంహారం కోసం తొమ్మిది రోజుల పాటు పోరాడిన జగన్మాత ఆకలితో అలసిపోయి ఉంటుందనే భావనతో నాలుగో రోజు నానిన బియ్యంతో చేసిన నైవేద్యాలు సమర్పిస్తారు. బియ్యాన్ని కడిగి, నానబెట్టి, ఆ తర్వాత ఆరబెట్టి.. మెత్తని పిండిగా చేస్తారు. అందులో పాలు, చక్కెర, నెయ్యి వేసి పాలకాయల వలె చిన్న ఉండలుగా చేస్తారు. వీటిని పచ్చిపిండి ముద్దలని పిలుస్తారు. శరదృతువులో వచ్చే అనేక పండుగల్లో పచ్చిపిండి ముద్దలు ప్రత్యేక నివేదనగా సమర్పిస్తారు. కొత్తగా వడ్లు వచ్చే కాలం కాబట్టి బియ్యానికి కొదువ ఉండదు. పైగా ఇవంటే అమ్మకు ఎంతో ప్రీతి. అందుకే నానిన బియ్యంతో చేసిన పదార్థాలు ఇవాళ నైవేద్యం పెడతారు.

- డా॥ ఆర్‌.కమల


logo