ఆదివారం 25 అక్టోబర్ 2020
Zindagi - Oct 18, 2020 , 23:30:30

నక్క మోసం... కాకి గానం

నక్క మోసం... కాకి గానం

అనగనగా ఒక అడవిలో ఓ కాకి ఉండేది. ఎప్పుడూ తనకు ఇష్టమైన ఆహారం కోసం వెతుకుతూ ఉండేది. ఒక రోజు అడవిలో తిరుగుతూ ఉండగా.. దానికి  ఒక రొట్టె ముక్క దొరికింది. కాకి చాలా సంతోషించింది. ఆ రొట్టె ముక్కను నోట్లో పెట్టుకుని ఎగురుకుంటూ వెళ్లి చెట్టు మీద కూర్చుంది. ఆ కాకిని ఒక నక్క చూసింది. వెంటనే ఆ రొట్టె ముక్కను చేజిక్కించుకోవాలనుకుంది. కానీ ఎలా? కాకేమో  చెట్టు మీద ఉంది. నక్కకు చెట్టు ఎక్కడ సాధ్యం కాదు.  నక్కకు ఒక ఉపాయం తోచింది. ఆ చెట్టు కింద నిల్చొని కాకితో మాట కలిపింది. ‘ఓహో కాకీ! ఎంత బాగున్నావు?’ అన్నది నక్క. పొగడ్త వినగానే కాకి పొంగిపోయింది. ఈ విషయం నక్క గమనించింది. పొగడ్తను ఇంకా కొనసాగించింది.

ఆ మిల మిల మెరిసిపోతున్న కండ్లు, సూటిగా ఉన్న ముక్కు, బ్రహ్మాండమైన రెక్కలు, అసలు ఎంత సేపైనా రెప్ప వాల్చకుండా చూడవచ్చు. నీ శరీరం ఇంత అందంగా ఉంటే.. నీ గొంతు ఇంకెంత తియ్యగా ఉంటుందో’ అంటూ ప్రశంసలు కొనసాగించింది. ‘అసలు ఒక్క సారి నువ్వు పాడితే వినాలని ఉంది. ఒక్క పాట పాడవా?’ అన్నది నక్క. పొగడ్తలతో ఉబ్బిపోయిన కాకి వెంటనే ‘కావు! కావు!’ అని నోరు తెరిచి పాట మొదలెట్టింది. నోట్లోని రొట్టె ముక్క జారి కింద పడిపోయింది. వెంటనే నక్క రొట్టె ముక్కను నోట్లోవేసుకుని తిరిగి వెనక్కి చూడకుండా వెళ్ళిపోయింది. రొట్టె ముక్క కోసమే తనను నక్క పొగిడిందన్న విషయం గ్రహించిన కాకి బాధ పడింది. ఇంకెప్పుడూ పొగిడే వాళ్ళను నమ్మకూడదని తీర్మానించుకుంది. 


logo