గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Oct 18, 2020 , 00:23:13

ఐపీఎస్‌ అక్క

ఐపీఎస్‌ అక్క

దేశంలో ఎంతోమంది యువకులు మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. తమ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని కొందరు అసహ్యించుకుంటుంటే.. మరికొందరు జాలి చూపుతుంటారు. అయితే, నాగాలాండ్‌కు చెందిన ఓ మహిళా ఐపీఎస్‌ అధికారి మాత్రం, వారిలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నది. 

డాక్టర్‌ ప్రీత్‌ఫల్‌ కౌర్‌ బాత్రా, 2016 బ్యాచ్‌కు చెందిన మహిళా ఐపీఎస్‌ ఆఫీసర్‌. నాగాలాండ్‌లోని టెన్సంగ్‌ జిల్లా సబ్‌ డివిజనల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా తన మొదటి పోస్టింగ్‌. ఈ ప్రాంతంలో ఎక్కువమంది నాగా తెగలకు చెందినవారే నివసిస్తుంటారు. భారత్‌-మయన్మార్‌ సరిహద్దులో ఉండే ఈ జిల్లాలో అధిక సంఖ్యలో యువత మత్తు పదార్థాలకు బానిసలైనట్లు ప్రీత్‌ఫల్‌ కౌర్‌ గుర్తించింది. డిగ్రీలు పూర్తి చేసినప్పటికీ సరైన మార్గదర్శకత్వం లేక, వారంతా పెడదారి పడుతున్నారని తెలుసుకున్నది. దారి తప్పిన తమ్ముడిని మార్గంలో పెట్టే అక్కలా బాధ్యత తీసుకుంది ప్రీత్‌ఫల్‌. మత్తు పదార్థాలకు బానిసైన వారిని గుర్తించి స్వయంగా కౌన్సెలింగ్‌ ఇవ్వడం మొదలుపెట్టింది. వారందరినీ దురలవాట్లకు దూరం చేయడంతోపాటు ఉద్యోగాలు సాధించేలా  యూపీఎస్‌సీ పరీక్షలకు కోచింగ్‌ ఇప్పిస్తున్నది. ఉచిత తరగతులు నిర్వహించడంతోపాటు సొంత ఖర్చులతో పుస్తకాలు అందించింది. వీరిలో ఇప్పటికే 53 మంది విద్యార్థులు ముఖ్యమంత్రి స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారనీ, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పలు పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారనీ ప్రీత్‌ఫల్‌ చెబుతున్నది. ప్రస్తుతం నోక్లక్‌ జిల్లా ఎస్పీగా పని చేస్తోన్న ప్రీత్‌ఫల్‌ కౌర్‌, ఇక్కడ కూడా మత్తు పదార్థాలకు బానిసలైన యువకులను సరైన మార్గంలో నడిపించేలా చర్యలు తీసుకుంటున్నది.


logo