శుక్రవారం 30 అక్టోబర్ 2020
Zindagi - Oct 11, 2020 , 00:11:58

సూపర్‌ స్టార్‌కు..సూపర్‌గా నచ్చింది!

సూపర్‌ స్టార్‌కు..సూపర్‌గా నచ్చింది!

‘చాలా హారర్‌ సినిమాలే చూశాను. ఆ జోనర్‌ అంటే చెవికోసుకుంటాను. కానీ, నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘సోషల్‌ డైలమా’ వాటన్నిటికి జేజమ్మ లాంటిది అనుకోండి. మీ అందరికీ చెబుతున్నా  తప్పక చూడండి’ అన్నంత ఆవేశంగా సూపర్‌స్టార్‌ సిఫార్సు చేస్తున్నారంటేనే, ఆ డాక్యుమెంటరీ డ్రామా ప్రత్యేకతను అర్థం చేసుకోవచ్చు. నిజమే, సోషల్‌ డైలమా అనేది మనందరి సమస్యను చర్చిస్తుంది, రాబోయే సంక్షోభాన్నీ గుర్తుచేస్తుంది. ఆ గంటన్నర పైచిలుకు డాక్యుమెంటరీ సారాంశం ఇదే..“గూగుల్‌.. ఫేస్‌బుక్‌..ట్విటర్‌..

ఫోన్‌లో ఉన్నందుకు మురిసిపోకండి. ఆ మాధ్యమాల్ని పూర్తిగా వాడేసుకుంటున్నామని సంబరపడిపోకండి. వాటిని మీరు వాడుకోవడం కాదు, మిమ్మల్ని అవి వాడేసుకుంటున్నాయి.. పూర్తిగా! ‘మీ డేటాను అమ్మేసుకుంటున్నాయి. మీ కదలికలను క్షణక్షణం గమనిస్తున్నాయి. మీ పర్సు మీదా కన్నేస్తాయి. మీ ఆర్థిక చరిత్రనంతా గుప్పిట్లోకి తీసుకుంటాయి. ఇది తథ్యం’ - సాక్షాత్తు ఆ సంస్థల మాజీ ఉన్నతోద్యోగులే ఈ మాట చెప్పారు. సమాజంలో పెరుగుతున్న టీనేజ్‌ ఆత్మహత్యల్ని ఓసారి పరిశీలించండి. సోషల్‌ మీడియా లేని రోజుల్లో కౌమార బలవన్మరణాలు నామమాత్రం. సామాజిక మాధ్యమాలు బలపడుతున్న కొద్దీ పిల్లల చావు వార్తలూ పెరిగిపోయాయి. ప్రతి మరణం వెనుకా పరోక్షంగానో, ప్రత్యక్షంగానో సామాజిక మాధ్యమాల ప్రభావమే. వాటివల్ల కమ్యూనికేషన్‌ పెరగడం లేదు. అభద్రత అధికం అవుతున్నది.

నువ్వే ఓ సరుకు..

 అది ఫేస్‌బుక్‌ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఏ సరుకు అయినా నీకు ఉచితంగా లభిస్తున్నదీ అంటే, నిన్నో సరుకుగా మార్చుకునే కుట్రలో భాగమే అదంతా! మొత్తానికి ఇదో ‘నిఘా పెట్టుబడిదారీ వ్యవస్థ’. ప్రతి చిన్న విషయానికి తమమీద ఆధారపడేలా, తమ ఉత్పత్తులకు బానిసలుగా మారేలా చేసుకుంటారు. కాబట్టి, సమయాన్ని మింగేసే వృథా యాప్స్‌ను డిలీట్‌ చేయండి. నోటిఫికేషన్స్‌ నోరు మూయించండి. ఏదైనా సమాచారాన్ని షేర్‌ చేసుకునే ముందు వాస్తవాన్ని నిర్ధారించుకోండి. ఫేక్‌న్యూస్‌ను ప్రోత్సహించకండి. ‘ఫలానా సోషల్‌ మీడియా సంస్థలో ఉద్యోగిగా, నా చేతులకు అంటిన కనిపించని రక్తపు తడి నన్నింకా ఇబ్బంది పెడుతూనే ఉంది. తీవ్ర పశ్చాత్తాపంతో ఈ మాటలు అనాల్సి వస్తున్నది’ అంటూ ఒక సందర్భంలో ఓ నిపుణుడు బాధపడిపోతాడు. అలా, గుంజీలు తీసినవారిలో ఫేస్‌బుక్‌లో ‘లైక్‌' బటన్‌ సృష్టికర్త కూడా ఉన్నాడు. ఓ సామాజిక నిపుణుడు అయితే.. పడక గదుల్లో శృంగారం చచ్చిపోతున్నది, డైనింగ్‌ టేబుల్‌ దగ్గర సంభాషణలు ఆగిపోతున్నాయి. ఆత్మీయ ఆతిథ్యాల్లేవు, ప్రేమపూర్వక పలకరింపులు లేవు. ఎవరికివారు సామాజిక మాధ్యమాలకు బందీలు అవుతున్నారు. రోజూ కొంచెం కొంచెంగా విషం ఇవ్వడమే ఇదంతా. వ్యక్తి మీద మొదలైన ఈ దాడి మెల్లగా వ్యవస్థకూ పాకుతున్నది. సోషల్‌ మీడియా దిగ్గజాలు ప్రపంచ రాజకీయాల్ని శాసించబోతున్నారు. ఇప్పటికే అక్కడక్కడా ఆ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి”.. ఇలా సాగుతుంది మహేష్‌బాబుకు నచ్చిన ఈ డాక్యుమెంటరీ.  

పేరు: సోషల్‌ డైలమా

ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్‌

నిడివి: ఎనభై తొమ్మిది నిమిషాలు

జోనర్‌: డాక్యుమెంటరీ డ్రామా

దర్శకుడు: జెఫ్‌ అర్లవ్‌స్కీ