శనివారం 31 అక్టోబర్ 2020
Zindagi - Oct 10, 2020 , 00:11:57

ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలనుకొని..

ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలనుకొని..

నటన ఆమె రక్తంలో ఉంది. కానీ ఎప్పుడూ నటి కావాలనుకోలేదు. అనుకోకుండా యాక్టర్‌ అయినప్పటి నుంచి..  తన సత్తా చాటుతూనే ఉంది. కన్నడ సీమలో తొలిపరిచయమై, మలయాళ ప్రేక్షకులను పలకరించి, తమిళుల మనసు గెలుచుకొని, ఇప్పుడు తెలుగువారి అభిమాన నటిగా ఎదిగింది. పన్నెండేండ్లుగా నటిగా కొనసాగుతూ ప్రేక్షకులను మెప్పించింది.. అర్చన అనంత్‌.  ఇప్పుడు ‘కేరాఫ్‌ అనసూయ’ సీరియల్‌తో మరోమారు బుల్లితెర ప్రేక్షకుల ముందుకొస్తున్న అర్చన నట జీవిత విశేషాలు మీ కోసం..

అర్చన తండ్రి కన్నడ చిత్రసీమలో పేరున్న క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌.. అనంత వేలు. ఇంట్లో సినిమా వాతావరణమే ఉండేది. అవన్నీ చూస్తూ పెరిగింది అర్చన. అయినా ఎప్పుడూ తెరమీద కనిపించాలని అనుకోలేదు. ఓసారి స్నేహితురాలికి తోడుగా ఆడిషన్‌కు వెళ్లింది. ఎలాగూ వచ్చాను కదా అని ఆడిషన్‌లో పాల్గొంది. అక్కడి వారందరికీ తెగ నచ్చేసింది. నటిగా ఎంపిక చేసుకోవడం, సీరియల్‌లో అవకాశం ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. అలా అనుకోకుండా ఓ కన్నడ సీరియల్‌లో కనిపించిన అర్చన ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఎప్పుడూ సిఫారసు చేయలేదు

స్కూల్‌ చదువు పూర్తయ్యాక ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలనుకుంది అర్చన. బెంగళూరులో ఫ్యాషన్‌ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌లో డిప్లొమా చేయాలనుకుంది. కానీ, స్నేహితురాలికి తోడుగా వెళ్లి నటి అయ్యింది. మొదటి సీరియల్‌లోనే ప్రతినాయకి పాత్ర పోషించి భళా అనిపించుకుంది. ‘ఈ సీరియల్‌ కన్నా ముందే ఓ షార్ట్‌ ఫిల్మ్‌లో నటించా. చెప్తే నమ్మరు కానీ, ఓ శవంగా యాక్ట్‌ చేశా. మా నాన్న స్నేహితుడు ఓ షార్ట్‌ ఫిల్మ్‌ తీశారు. అందులో ఓ అమ్మాయి మృతదేహం సీను ఉందట. నేను చెయ్యను మొర్రో అంటున్నా వినకుండా మృతదేహం పాత్రకు ఒప్పించారు. గమ్మత్తయిన అనుభవం అది’ అంటుంది అర్చన. తండ్రి నుంచి చాలా నేర్చుకున్నానని వివరించింది. ఆయన పరపతి ఎక్కడా ఉపయోగించుకోలేదని, నాన్న కూడా ఎన్నడూ సిఫారసు చేయలేదని చెబుతున్నది. ‘నాన్న చాలా డిసిప్లిన్డ్‌.  ప్రొఫెషనల్‌గా ఉంటారు. గారాబం విషయంలో మాత్రం ఏం తక్కువ చేసేవారు కాదు. ఎందుకంటే మా అమ్మానాన్నలకు నేనొక్కదాన్నే. నేను ఆడిందే ఆట, పాడిందే పాట. నాన్న నాకు మంచి స్నేహితుడు. ఆయనతో అన్ని విషయాలూ  షేర్‌ చేసుకుంటాను’ అని చెప్పుకొచ్చింది అర్చన.

తెలుగులో కాస్త ఆలస్యంగా

కన్నడ బుల్లితెర తర్వాత తమిళ, మలయాళ ప్రేక్షకులకూ చేరువైంది అర్చన. తెలుగులోకి మాత్రం కాస్త ఆలస్యంగా వచ్చింది. మొత్తానికి దక్షిణాదిన అన్ని భాషల్లోనూ నటించి పేరు సంపాదించుకుంది. స్టార్‌ మాలో ప్రసారం అవుతూ ప్రజాదరణ పొందిన కార్తీక దీపం సీరియల్‌లో అవకాశం దక్కించుకుంది. ఆ సీరియల్‌తో తెలుగువారికి దగ్గరైంది అర్చన. ‘కళాకారులకు భాషా పరిమితులు ఉండకూడదు. నేను పుట్టింది తమిళ కుటుంబంలో. పెరిగింది కన్నడ సీమలో. నటిగా గుర్తింపు తెచ్చుకున్నది తెలుగు రాష్ర్టాల్లో. తెలుగు ప్రేక్షకుల మనసు చాలా విశాలం. తొందరగా తమలో ఒకరిగా భావిస్తారు. ఇదే ఆదరణ భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ఆశిస్తున్నా’అంటూ వినమ్రంగా ముగించింది అర్చన.


టీనేజ్‌ కూతుళ్లకు తల్లిగా

కార్తీక దీపంలో సౌందర్యగా ప్రేక్షకులను అలరించిన అర్చన.. ‘కేరాఫ్‌ అనసూయ’ సీరియల్‌లో ఇద్దరు టీనేజి ఆడపిల్లల తల్లిగా నటిస్తున్నది. తాను పడిన కష్టాలు పిల్లలు పడకూడదని చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరించే తల్లిపాత్ర తనకు దొరికిందని చెప్పుకొచ్చింది అర్చన. కొన్ని సినిమా అవకాశాలూ ఆమెను పలకరించాయి. కొన్ని షూటింగ్‌ దశలో ఉన్నాయి. లాక్‌డౌన్‌కు ముందు పూర్తయిన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని వివరించింది అర్చన.