గురువారం 29 అక్టోబర్ 2020
Zindagi - Oct 10, 2020 , 00:11:57

బాబా దశ తిరిగింది

బాబా దశ తిరిగింది

ఢిల్లీలోని మాల్వియా నగర్‌లో ఉంటుంది ‘బాబా కా దాబా’. పేరు వినగానే ఎంత భారీగా ఉంటుందో అని ఊహించకండి. చిన్న భోజన హోటల్‌ ఇది. ఎనభై ఏండ్ల కంట ప్రసాద్‌ అనే వృద్ధుడు తన భార్యతో కలిసి దీన్ని నిర్వహిస్తున్నాడు. ఎందరి ఆకలినో తీరుస్తూ తన పొట్ట నింపుకొంటున్నాడు. అతి కష్టం మీద వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు ప్రసాద్‌. ఇటీవల ఆ హోటల్‌కు వచ్చిన యువకుడు వృద్ధ దంపతుల ఆతిథ్యానికి ఫిదా అయ్యాడు. వారు వండి వడ్డించిన పదార్థాల రుచికి మైమరచిపోయాడు. బిల్లుతోపాటు వారికి ఇంకేదైనా సాయం చేయాలనుకున్నాడు. ఆ దంపతుల కష్టాన్ని వీడియో తీసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశాడు. ఇరవైనాలుగు గంటలు తిరక్కుండానే ‘బాబా కా దాబా’ పేరు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. జొమాటో దాబా నుంచి ఆర్డర్లు తీసుకుంటామని ప్రకటించింది. ఢిల్లీ యువత పనిగట్టుకొని వచ్చి మరీ బాబా వంటకాలను రుచి చూస్తున్నారు. మొదటి వీడియోలో తన దుస్థితిని వివరిస్తూ కంటతడి పెట్టిన ప్రసాద్‌ ఇప్పుడు ‘దేశమంతా నాతో ఉంది’ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు.