గురువారం 29 అక్టోబర్ 2020
Zindagi - Oct 08, 2020 , 23:54:37

అడవిలో పూసిన వెన్నెల!

అడవిలో పూసిన వెన్నెల!

అయితే ఇంజనీరింగ్‌ లేదా మెడిసిన్‌.. ఇవీ కాకపోతే బయోటెక్నాలజీ లాంటి కోర్సులు! నేటి పిల్లల లక్ష్యాలివి. అవి సాధించకపోతే ఇక ఎందుకూ పనికిరామనుకుంటారు. వెన్నెల కూడా డాక్టర్‌ కావాలనుకుంది. కానీ కొద్దిలో అవకాశం కోల్పోయింది. అంతమాత్రానికి  డీలాపడిపోలేదు. అరుదైన కోర్సును ఎంచుకోవడమే కాకుండా, దానిలో ఉన్నత లక్ష్యాన్ని కూడా ఏర్పరుచుకుంది. ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ ప్రవేశ పరీక్షలో ఆల్‌ఇండియా స్థాయిలో 9వ ర్యాంకు సాధించింది. 

సిద్దిపేట జిల్లా బక్రీ చెప్యాల గ్రామానికి చెందిన వెన్నెల తండ్రి కొండల్‌ రెడ్డి ఊళ్లో పేరున్న పశు వైద్యుడు. ఆయన్ని స్ఫూర్తిగా పొంది, ఎంబీబీఎస్‌ చదవాలనుకుంది. ఎమ్‌సెట్‌లో ర్యాంకు కొద్దిలో తప్పిపోయింది. అప్పుడే ములుగులో ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. అదృష్టవశాత్తు అందులో ఫస్ట్‌ బ్యాచ్‌లో సీటు వచ్చింది వెన్నెలకు. అనుకోకుండా బీఎస్సీ ఫారెస్ట్రీలో చేరింది. అక్కడ చదివినవాళ్లు సివిల్స్‌ కోసమో, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కోసమో ప్రయత్నం చేయాలనుకుంటారు. కానీ, తన స్టడీ టూర్లలో భాగంగా అడవులకు వెళ్లిన వెన్నెలకు వాటిపై మమకారం పెరిగింది. ఫారెస్ట్రీ గురించి మరింత అధ్యయనం చేయాలనుకుంది. అందుకే ఎమ్మెస్సీ కోసం ఎంట్రన్సు రాసింది. దేశంలోనే 9వ ర్యాంకు సాధించి, ప్రతిష్ఠాత్మకమైన బెనారస్‌ యూనివర్సిటీలో అగ్రోఫారెస్ట్రీలో సీటు సాధించింది. 

రైతులకు సాయంగా..

ఫారెస్ట్రీలో సిల్వికల్చర్‌, సాయిల్‌ సైన్స్‌, జెనెటిక్స్‌లో సీడ్‌ బ్రీడింగ్‌ లాంటి కోర్సులెన్నో ఉన్నా, తనకు అగ్రోఫారెస్ట్రీపై ఆసక్తి. ఎందుకంటే ఇది రైతులకు లాభదాయకమైనది. వ్యవసాయ భూముల్లో ఆహార పంటలతో పాటుగా వన్య వృక్షాలను కూడా పెంచితే అదనపు ఆదాయానికి ఆస్కారం ఎక్కువ అని చెప్తుంది వెన్నెల. ఉదాహరణకు వరి పండించే రైతు, తన పొలం చుట్టూ యూకలిప్టస్‌ చెట్లను పెంచవచ్చు. పండ్ల చెట్లను పెంచవచ్చు. వీటిని వ్యాపారంగా అభివృద్ధి చేయవచ్చు. అంటే ఒకే భూమిలో రెండు రకాల లాభాలుంటాయి. కేవలం వ్యవసాయ పంటలతో వచ్చే ఆదాయం కన్నా ఇలా అగ్రోఫారెస్ట్రీ ద్వారా చెట్లు కూడా పెంచితే అదనపు ఆదాయం లభిస్తుంది. అయితే ఏయే చెట్లను, ఏ రకంగా పెంచితే, ఏ పంటలకు  లాభదాయకంగా ఉంటుందో మోడల్స్‌ తయారుచేయడం అగ్రోఫారెస్ట్రీ నిపుణుల పని. ఆ నైపుణ్యాన్ని రైతులకు పంచాలన్నది వెన్నెల ఆలోచన. అంతేకాదు, ‘మా పదెకరాల పొలంలో ఇప్పుడు వరి మాత్రమే పండిస్తున్నాం. దీనిలో అగ్రోఫారెస్ట్రీ అభివృద్ధి చేయాలనుకుంటున్నా. నేను నేర్చుకుంటే దాన్ని ప్రాక్టికల్‌గా మా పొలానికి ఐప్లె చేయవచ్చు కదా’ అంటుంది వెన్నెల. 

టీచింగ్‌ మొదటి ప్రాధాన్యం

‘నాన్న నన్ను డాక్టర్‌గా చూడాలనుకున్నారు. కానీ బలవంతపెట్టలేదు. అమ్మ మాత్రం ఏది చదివినా ఆడపిల్లలు బాగా చదువుకోవాలని చెప్పేది. ఊళ్లో నాన్నకు ఉన్న పేరును నిలబెట్టాలనీ, ఏదో ఒకటి సాధించాలనుకునేదాన్ని. మా కాలేజిలో మాదే మొదటి బ్యాచ్‌. మన తెలంగాణలో కోర్‌ ఫారెస్ట్రీ సబ్జెక్టులను బోధించేవాళ్లు ఎవరూ లేరు. అందుకే నేను మా కాలేజ్‌లోనే టీచింగ్‌ ఫ్యాకల్టీ కావాలని కోరుకుంటున్నా. పీజీ అయిన తరువాత పరిశోధన వైపు వెళ్లాలా? టీచింగ్‌ వైపా అన్నది నిర్ణయించుకుంటా’ అంటున్నది వెన్నెల.


logo