మంగళవారం 20 అక్టోబర్ 2020
Zindagi - Oct 08, 2020 , 23:54:47

అమ్మ కోసం దాచిన చిల్లర

అమ్మ కోసం దాచిన చిల్లర

ఒక మధ్యతరగతి కుటుంబంలో చిట్టి అనే అమ్మాయి ఉండేది. వాళ్ల నాన్న చిరుద్యోగి. చిట్టి ఒక రోజు ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో,  ఒక రూపాయి బిళ్ల కనిపించింది. దానిని తీసుకొని అమ్మ దగ్గరికి వెళ్లింది. ‘అమ్మా.. ఇదిగో రూపాయి’ అని చూపించింది. అమ్మ బదులుగా నవ్వి..‘నువ్వే ఉంచుకో.. ఏదైనా కొనుక్కో’ అని చెప్పింది. అప్పుడు చిట్టి ఆ రూపాయి బిళ్లను తన దగ్గర ఉన్న  పెట్టెలో దాచుకుంది. ఒకరోజు చిట్టికి వాళ్ల అమ్మ డబ్బులు ఇచ్చి పాల ప్యాకెట్‌ కొనుక్కురమ్మని చెప్పింది. చిట్టి వెంటనే, బయల్దేరింది. మిగిలిన చిల్లరను తెచ్చి ఇవ్వబోయింది. ‘నువ్వే ఉంచుకో’ అని చెప్పింది తల్లి. దీంతో చిట్టి  ఆ పైసలను కూడా తన పెట్టెలో వేసుకుంది. అలా చాలాసార్లు నాన్న కూడా చిల్లర ఇచ్చేవాడు. క్రమంగా చిల్లర బిళ్లలను పెట్ట్టెలో వేయడం అలవాటైంది. కొద్ది రోజుల తర్వాత చిట్టి వాళ్ల అమ్మకు జ్వరం వచ్చింది. ఆ సమయంలో నాన్న కూడా ఇంట్లో లేడు. అప్పడు చిట్టి ధైర్యంగా వెళ్లి  డాక్టర్‌ అంకుల్‌ని తీసుకొచ్చి వైద్యం చేయించింది. సాయంత్రానికి నాన్న ఇంటికి చేరుకున్నాడు. అమ్మ ఆరోగ్యం గురించి తండ్రికి చెప్పింది చిట్టి. అప్పుడు వాళ్ల నాన్న అయ్యో అంటూ డాక్టర్‌కు కబురు పెట్టబోయాడు. అంతలోనే చిట్టి.. ‘నేను డాక్టర్‌కి చెప్పాను నాన్నా! వచ్చి మందులు ఇచ్చాడు. నేనే డబ్బులు ఇచ్చాను’ అని చెప్పింది.  ఆశ్చర్యపోయి ‘నీ దగ్గర అన్ని డబ్బులు ఎక్కడివి?’ అని అడిగాడు నాన్న. తను పోగు చేసిన చిల్లర  సంగతి చెప్పింది. ‘ఆ చిల్లర తోనే అమ్మకు కావాల్సిన మందులు తెచ్చాను.. ఇవిగో’ అంటూ ఔషధాలను అందించింది. నాన్న ఎంతో సంతోషించాడు. ‘ఒక్కో రూపాయి.. పోగు చేస్తే ఎంతో లాభం ఉంటుంది కదా’ అని మనసులోనే అనుకొన్నాడు. చిట్టి ఆలోచనకు మెచ్చుకున్నాడు. లక్ష రూపాయలైనా ఒక రూపాయితోనే మొదలవుతుంది.

- పూజా గాయత్రి, కడకంచి గ్రామం, సంగారెడ్డి జిల్లా 


logo