ఆదివారం 25 అక్టోబర్ 2020
Zindagi - Oct 07, 2020 , 02:42:20

ప్రేమతో భోజనం

ప్రేమతో భోజనం

అనసూయ వయసు 65 ఏండ్లు.  ఆమెకు ఒంట్లో బాగోలేదు. వండుకునే ఓపికా లేదు. ఆమె భర్త మూర్తికి ముందు నుంచే ఆరోగ్య సమస్యలు.  ఇక ఆ దంపతుల తిండీతిప్పలూ చూసే దిక్కేలేదు. శ్రీలతకు తీవ్ర జ్వరం. భర్త క్యాంపునకు వెళ్లాడు. వారం తర్వాత కానీ రాడు. తన సంగతి సరే, ఏడాది పాపకు భోజనం ఎవరు పెడతారు? ఇలాంటి  సమస్యలకు సమాధానంగా నిలుస్తున్నది.. ‘లవ్‌ ఫర్‌ ఫుడ్‌'. ఈ సంస్థ వెనుక ఇద్దరు మహిళలు ఉన్నారు.

అప్పటి వరకూ టీచర్‌గా పనిచేసిన శశికళకు అటు కుటుంబం, ఇటు ఉద్యోగం.. సమర్థంగా బ్యాలెన్స్‌ చేయలేక  పోతున్నానని అనిపించింది. ఉద్యోగం మానేశారు. కేవలం గృహిణిగా ఉండటం కూడా ఆమెకు నచ్చ లేదు. అప్పుడే పొడులు, పచ్చళ్లు చేసి అమ్ముదామని అనుకున్నారు. అనుకున్నదే తడువు వంటింట్లోని సరుకులతో పని మొదలు పెట్టేశారు. అవి నచ్చిన ఒక ప్రవాస భారతీయుడు తమ అత్తామామలకు రోజూ భోజనం అందించమని రిక్వెస్ట్‌ చేశారు. పెద్దవారికి సహాయంగా ఉంటుందన్న భావనతో అందుకు ఒప్పుకున్నారు. ఆతర్వాత కొద్ది రోజుల్లోనే చాలా మంది వయోధిక దంపతులకు భోజనం అందించాల్సి వచ్చింది. అలా, రోజురోజుకి  కస్టమర్ల సంఖ్య పెరగసాగింది. పెద్ద వంటశాల అవసరం ఏర్పడింది. ఆ సమయంలోనే, పాత నేస్తం శైలజతో కాస్త పెద్ద కిచెన్‌ గురించి ప్రస్తావించారు శశికళ. శైలజ కూడా అప్పటికే ‘శైలూ చాకోస్‌' పేరుతో చాక్లెట్లు తయారు చేస్తున్నారు. ఇద్దరూ కలిసి ఒక పెద్ద కిచెన్‌ ఏర్పాటు చేసుకొని ‘లవ్‌ ఫర్‌ ఫుడ్‌'ను స్థాపించారు.  

సమతులాహారమే

‘లవ్‌ ఫర్‌ ఫుడ్‌' అందించే ప్రతి వంటకం పోషక విలువలతో కూడినదేనని అంటారు శశికళ. ‘పెద్దవారనే కాదు, ఆరోగ్యం సరిగ్గా లేని వారు, నలతగా ఉండి వంట చేసుకునే ఓపిక లేని ఎవరైనా.. మాకు ఒక్క ఫోన్‌ చేస్తే చాలు. మా భోజనం వాళ్ల గడపలో ఉంటుంది. ‘అసలే అనారోగ్యం, బయటి భోజనం ఎలా తింటాం’ అనుకునే వారికి మేం అందించేది ఇంటి భోజనమే’ అని బల్లగుద్ది చెప్పారు శైలజ. వీరి కిచెన్‌ కూడా అత్యాధునికమైనది. 


logo