సోమవారం 26 అక్టోబర్ 2020
Zindagi - Oct 07, 2020 , 02:42:19

గోరుచుట్టూ వాపు.. ఎందుకిలా?

గోరుచుట్టూ వాపు.. ఎందుకిలా?

నాకు 36 ఏండ్లు. చిన్నప్పుడు ఒకట్రెండుసార్లు చేతి బొటనవేలు ఉబ్బిపోయింది. ఇన్‌ఫెక్షన్‌ అయింది. అప్పుడెలా తగ్గిందో గుర్తులేదు. మళ్లీ ఇప్పుడు పదే పదే వస్తున్నది. ఐదేండ్ల  క్రితం బాగా ఉబ్బిపోతే సర్జరీ చేశారు. మళ్లీ ఇంకో వేలికి వచ్చింది. మందులు వాడితే తగ్గింది. ఇప్పుడు మళ్లీ అదే సమస్య. నీళ్లలో ఎక్కువగా పని చేయవద్దన్నారు. కానీ.. ఇంట్లో పని ఉంటుంది కదా. నాకు ఏడేండ్లుగా థైరాయిడ్‌ ఉంది. దీనివల్ల కూడా ఇలా అవుతుందంటున్నారు. నిజమేనా? ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి  శాశ్వత పరిష్కారం ఉందా? 

- హాసిని, చెన్నై

బొటనవేలిలో వాపు వస్తూ, తగ్గుతూ ఉన్నదంటే మీకు ఉన్న ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌కు సరైన చికిత్స తీసుకున్నారా లేదా అనేది ఆలోచించాలి. ముఖ్యంగా రెండు రకాల ఫంగల్‌ ఇన్‌ ఫెక్షన్లు ఉంటాయి. అక్యూట్‌ పారనైకియా, క్రానిక్‌ పారనైకియా. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల గోటి మీద కాకుండా దాని చుట్టూ ఉండే చర్మంలో వాపు ఉండటం, దానిలోనుంచి చీము రావడం జరుగుతుంది. అక్యూట్‌ దశలో వాపు తట్టుకోలేకుండా, చాలా నొప్పి ఉంటుంది. క్రానిక్‌ పారనైకియా ఉంటే పదేపదే గోరుచుట్టు రావడం, తగ్గడం ఉంటుంది. డిటర్జంట్‌లతో, ఇంట్లో పనిచేసినప్పుడు సమస్య ఎక్కువ కావడం సహజమే. మీరు ఉపయోగించే డిటర్జెంట్ల వల్ల తీవ్రం అవుతున్నదా, లేదా డిటర్జెంట్‌ మార్చినప్పుడు సమస్య ఎక్కువ అవుతున్నదా అన్నది పరిశీలించుకోవాలి. ఎలాంటివి వాడినా ఇబ్బందిగా ఉంటే.. హౌజ్‌వైవ్స్‌ గ్లోవ్స్‌ అని దొరుకుతాయి. కొంచెం పొడవుగా ఉండేవి చూసి తీసుకోవాలి. చిన్న గ్లోవ్స్‌ అయితే.. వాటి గుండా నీరు లోపలికి వెళ్లి సమస్య ఎక్కువ అవుతుంది. పని అయిపోయిన తరువాత ఏదైనా మాయిశ్చరైజ్‌ సబ్బుతో చేతులు కడుక్కొని, వెంటనే మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఫలితంగా, డిటర్జెంట్‌ వల్ల పొడిబారే చర్మం మృదువుగా అవుతుంది. క్రానిక్‌ పారనైకియా ఉన్నవాళ్లకు గోరు చుట్టూ ఒక సన్నని చర్మపు పొర డ్యామేజి అవుతుంది. ఈ జాగ్రత్తల వల్ల ఇది బాగవుతుంది. మరో ముఖ్యమైన విషయం.. ఇలా పదేపదే సమస్య వస్తున్నదంటే షుగర్‌ ఉందేమో చెక్‌ చేసుకోవడం చాలా అవసరం. 

మీ గోరు రంగు మారితే, ఎగుడుదిగుడుగా కనిపిస్తే ఆ భాగం నుంచి గోరు తీసుకుని పరీక్ష చేసి, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉందా లేదా అన్నది నిర్ధారించుకోవచ్చు. దీన్ని బట్టి ఓరల్‌ యాంటి ఫంగల్స్‌ వాడుతారు. రెండు నెలల పాటు ఇవి వాడాలి. అయినా తగ్గకపోతే నెయిల్‌ డర్మోస్కోపీ చేస్తారు. నెయిల్‌ సొరియాసిస్‌ లాంటి ఇంకేదైనా సమస్య ఉందేమో చెక్‌ చేస్తారు. కొందరు గోళ్లను చాలా లోపలి వరకు కట్‌ చేస్తుంటారు. వీళ్లలో కూడా ఇలాంటి సమస్య కనిపించవచ్చు. గోరు బయటికి కాకుండా లోపలికి పెరిగితే కూడా ఈ సమస్య ఉంటుంది. థైరాయిడ్‌కీ నెయిల్‌ ప్రాబ్లంకీ ఎలాంటి సంబంధం ఉండదు. కాబట్టి కంగారుపడక్కర్లేదు.


logo