శనివారం 31 అక్టోబర్ 2020
Zindagi - Oct 06, 2020 , 01:54:37

సేవకు చెక్కని ‘శిల్ప’o

సేవకు చెక్కని ‘శిల్ప’o

హిమాలయాల్లో వెకేషన్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. అదే మంచుకొండల్లో ఆరు నెలల క్యాంప్‌ అంటే కాస్త అయిష్టంగా బయల్దేరుతారు. ఏడాది పొడవునా ఉద్యోగం అక్కడే చేయాలంటే ససేమిరా అంటారు. డాక్టర్‌ శిల్ప అలా అనలేదు. తనకు తానుగా హిమసీమల్లోకి కొలువు చేయడానికి ముందుకొచ్చిందామె. తనకు తాను ఏ వసతీ లేని మారుమూల పల్లెను ఎంచుకుంది. ఏడాదిగా అక్కడే ఉంటున్నది. కరోనా వేళ.. అన్నెం పున్నెం ఎరుగని గిరిబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతున్నది.

డాక్టర్‌ పట్టా చేతికి రాగానే.. అవకాశాల కోసం కార్పొరేట్‌ దవాఖానల చుట్టూ తిరుగుతారు. సర్కార్‌ డాక్టర్‌గా అవకాశం వచ్చినా మారుమూల పల్లెల్లో పోస్టింగ్‌ వస్తే కాదనుకునేవాళ్లు బోలెడంత మంది ఉంటారు. ఉద్యోగం గ్రామాల్లో అయినా సమీప పట్టణాల్లో మకాం వేస్తుంటారు. శిల్ప మాత్రం దేశ రాజధాని నుంచి మారుమూల పల్లెకు బయల్దేరింది. మహోన్నత సంకల్పంతో అడుగేసింది.

స్వామికార్యం.. స్వకార్యం..

హిమాచల్‌ప్రదేశ్‌ కిన్నౌర్‌ జిల్లాలో మారుమూల పల్లె రాక్చమ్‌. కాస్తోకూస్తో మౌలిక సదుపాయాలున్న సాంగ్లాకు 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ గ్రామం. చుట్టూ మంచుకొండల మధ్య కడిగిన మరకతంలా పచ్చగా మెరిసిపోతూ కనిపిస్తుంటుంది. ఎనిమిది వందలు దాటని జనాభా! పేరుకు ఊళ్లో ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. అక్కడ సిబ్బంది లేరు. గత అక్టోబర్‌లో ఆ ఊరికి శిల్ప వచ్చింది. ఎక్కడ్నుంచి వచ్చిందీ తెలుసుకొని ఊళ్లో వారంతా ముక్కున వేలేసుకున్నారు. వచ్చింది తమ గురించే అని తెలుసుకొని ఆనందించారు. డాక్టర్‌ శిల్పది ఛత్తీస్‌గఢ్‌. ఆమె తండ్రి సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో పనిచేసేవాడు. ఫలితంగా మూడు నాలుగేండ్లకు ఒకసారి బదిలీలు జరిగేవి. అలా ఎంబీబీఎస్‌ పూర్తయ్యేనాటికి ముంబయి, బెంగళూరు తదితర నగరాలన్నీ తిరిగేసిందామె. చివరగా ఢిల్లీలో ఎల్‌ఎన్‌జీపీ ఆస్పత్రిలో డాక్టర్‌గా చేరింది. వారాంతాల్లో విహారానికి వెళ్తూ ఉండేది. కొండల్లో, కోనల్లో ట్రెక్కింగ్‌ చేయడం అంటే ఆమెకు సరదా! ఎప్పటికైనా ఆ కొండల్లో ‘కొలువు’దీరాలి అనుకునేది. గత అక్టోబర్‌లో పీహెచ్‌సీల్లో డాక్టర్‌ పోస్టుల భర్తీ కోసం సిమ్లా అడ్మినిస్ట్రేషన్‌ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఆ విషయం తెలిసి ఇంటర్వ్యూకు వెళ్లిపోయింది శిల్ప. రాక్చమ్‌లో పోస్టింగ్‌ ఇవ్వాల్సిందిగా అభ్యర్థించింది. అధికారులూ సరేనన్నారు.

అసాధారణ ఆదరణ..

గ్రామానికి వచ్చిన రోజు నుంచే పీహెచ్‌సీలో డాక్టర్‌గా విధులు మొదలుపెట్టింది శిల్ప. అప్పటి వరకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సాంగ్లాకు వెళ్తుండేవాళ్లు. ఈ డాక్టరమ్మ వచ్చిన తర్వాత ఊహించని మార్పు వచ్చింది. ఏ జబ్బు అయినా చిటికెలో నయం చేసేది. ఆమె హస్తవాసికి, మాట్లాడేతీరుకు రాక్చమ్‌వాసులంతా ఫిదా అయిపోయారు. వారంలో ఆరు రోజులు గ్రామస్థులకు వైద్యసేవలు అందిస్తూ ఉండేది శిల్ప. ఆదివారాలు వారి సాయంతోనే ట్రెక్కింగ్‌కు వెళ్లిపోయేది. కొద్దిరోజుల్లోనే శిల్ప గ్రామస్థులకు తల్లోనాలుక అయింది. మధ్యాహ్నం పూట మహిళలు పీహెచ్‌సీకి వచ్చి ఆమెతో కబుర్లు చెప్పేవారు. ఇంట్లో ఏదైనా ప్రత్యేక వంటకం చేసుకుంటే వేడివేడిగా తెచ్చి పెట్టేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే శిల్పను దేవతలా చూసుకున్నారు. అయినా, కరోనా కాలంలో తమకు జాగ్రత్తలు చెప్పిన తల్లిని ప్రేమగా ఎందుకు చూసుకోరు. ఏ అర్ధరాత్రి ఏం అవసరం వచ్చినా వెంటనే స్పందించే అమ్మను ఎందుకు నెత్తిన పెట్టుకోరు.

“వారు చూపే ఆదరణకు ఒక్కోసారి నా కండ్లు చెమర్చేవి. పెద్దవాళ్లు నన్నో బిడ్డలా చూసుకుంటున్నారు. పిల్లలు అక్కలా ఆదరిస్తున్నారు. సమ వయస్కులు నన్ను స్నేహితురాలిగా భావిస్తున్నారు”                       - డా॥శిల్ప