శుక్రవారం 23 అక్టోబర్ 2020
Zindagi - Oct 06, 2020 , 01:54:42

రొమ్ము క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చు!

రొమ్ము క్యాన్సర్‌కు  చెక్‌ పెట్టొచ్చు!

పసిపాపల ఆకలి తీర్చే అక్షయ పాత్రలు...

చాలా సందర్భాల్లో మాతృత్వానికి ముందే క్యాన్సర్‌ కాటుకు గురవుతున్నాయి. 

అప్రమత్తం కాకపోతే, ఆ అమృత భాండాన్ని శాశ్వతంగా కోల్పోతారు మహిళలు. 

రొమ్ము క్యాన్సర్‌ వల్ల జీవన్మరణ సమస్యనూ ఎదుర్కొంటారు. పెండ్లి కాని అమ్మాయిలకు 

ఈ వ్యాధి తీవ్ర శాపమవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 4 లక్షల 58 వేల మంది 

రొమ్ము క్యాన్సర్‌ వల్ల మరణిస్తున్నారు. పదిహేను లక్షల మంది కొత్తగా దీని బారిన 

పడుతున్నారు. అవగాహన పెంచుకుని, అప్రమత్తం అయితే 

రొమ్ము క్యాన్సర్‌ నుంచి పూర్తిగా బయటపడవచ్చు. 

రొమ్ము క్యాన్సర్‌ పెద్ద సమస్యేమీ కాదు. అధిగమించడానికి అవసరమైందల్లా అవగాహన.. 

అప్రమత్తత.. ముందు జాగ్రత్త. తొలిదశలోనే గుర్తిస్తే 

ప్రాణాపాయాన్ని తప్పించుకోవడమే కాదు.. బిడ్డకు అమృతభాండమైన రొమ్మునూ కాపాడుకోవచ్చు. 

వంశపారంపర్యమా?

రొమ్ము, అండాశయ క్యాన్సర్ల వంటి గైనిక్‌ సమస్యలకు కొంతవరకు జన్యుపరమైన కారణాలూ ఉన్నాయి. అయి తే ఇది, 5 నుంచి 10 శాతం మాత్రమే. వీటికీ బ్రాకా (బిఆర్‌సిఎ) జన్యువుకూ మధ్య సంబంధం ఉందని చెప్పే అధ్యయనాలున్నాయి. బ్రాకా జన్యువులో మ్యుటేషన్‌ (మార్పు) ఉన్నవాళ్లలో ఈ క్యాన్సర్లు రావడానికి 90 శాతం ఆస్కారం ఉంది. అయితే, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ బ్రాకా జన్యువు ఉండనక్కర్లేదు. సాధారణంగా చిన్న వయసులోనే రొమ్ము క్యాన్సర్‌ వచ్చేవాళ్లలో బ్రాకా జన్యువులో మార్పు కనిపిస్తున్నది. బ్రాకా జీన్‌ మ్యుటేషన్‌ తరువాతి తరానికి బదిలీ అయ్యే ప్రమాదం 75 శాతం వరకూ ఉంటుంది. కాబట్టి, తల్లిలో ఈ జన్యువు ఉంటే పిల్లలు కూడా చెక్‌ చేసుకోవాలి. ఒకే కుటుంబంలో ఎక్కువ మందికి ఉంటే, రిస్కు కూడా ఎక్కువే. ఇలాంటప్పుడు జెనెటిక్‌ మ్యాపింగ్‌ చేస్తారు. మగపిల్లలు కూడా ఈ గండానికి మినహాయింపు కాదు. బ్రాకా జన్యువు ఉన్న మగవాళ్లలో సాధారణంగా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువ. 

హెచ్చరికలివే..

రొమ్ము, దాని చుట్టూ ఏ మార్పులు కనిపించినా అశ్రద్ధ పనికిరాదు. 

రొమ్ములో గడ్డ : రొమ్ములో గట్టిగా గడ్డలా ఉన్నట్టు అనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. అయితే అన్ని గడ్డలూ క్యాన్సర్‌ కణతులు కావు. సాధారణంగా చిన్న వయసులో కనిపించే గడ్డలు హానికరంకాని బినైన్‌ కణతులే అయివుంటాయి. కానీ క్యాన్సర్‌ ప్రాణాంతకం కాబట్టి.. ఆ గడ్డ మాలిగ్నెంట్‌ కాదని నిర్ధారించుకోవడం అవసరం. మామోగ్రామ్‌ తీస్తే అది మాలిగ్నెంటా? బినైనా? అనేది తెలుస్తుంది. 

రొమ్ము మీది చర్మం : రొమ్ము పైన సొట్ట పడినట్టుండటం, లోపలికి నొక్కుకుపోయినట్టు ఉండటం, చర్మం ఆరెంజ్‌ పండు తొనలాగా మారడం, (ఆరెంజ్‌ పీల్‌ అప్పియరెన్స్‌). 

నిపుల్‌లో మార్పులు : నిపుల్‌ నుంచి ఏవైనా స్రావాలు రావడం, రక్తం రావడం, నిపుల్‌ లోపలికి ముడుచుకుపోవడం

చంకలు : భుజం కింద చంకల్లో వాపు రావడం. లింఫ్‌ గ్రంథులు వాచిపోవడం వల్ల ఇలా కనిపిస్తుంది.

నొప్పి : క్యాన్సర్‌ గడ్డ అయితే సాధారణంగా నొప్పి ఉండదు. కానీ తరువాత పుండు లాంటిది ఏర్పడితే నొప్పి వస్తుంది. తొలిదశలో నొప్పి ఉండదు. అయితే నొప్పి లేని అన్ని గడ్డలూ మాలిగ్నెంట్‌ అనుకోవడానికీ లేదు. బినైన్‌ గడ్డ అయినప్పటికీ నొప్పి లేకుండా మొదలవ్వచ్చు. కానీ నొప్పి ఉన్నా, లేకపోయినా గడ్డ ఉన్నదంటే మాత్రం అశ్రద్ధ చేయవద్దు. 

 పూర్తిగా తగ్గే అవకాశం

రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది. స్టేజ్‌ 1లో ఉన్నప్పుడు గుర్తిస్తే నయం చేసే అవకాశం 97 శాతం ఉంటుంది. స్టేజ్‌ 2లో అయితే పూర్తిగా తగ్గించే అవకాశం 80 నుంచి 85 శాతం ఉంటుంది. అదే స్టేజ్‌ 3కి వచ్చేసరికి 60 శాతమే ఉంటుంది. అంటే క్యాన్సర్‌ ముదిరి, స్టేజ్‌ పెరిగే కొద్దీ రుగ్మతను తగ్గించే అవకాశం తక్కువ అవుతుంది. కాబట్టి ఎంత త్వరగా గుర్తిస్తే నయమయ్యే అవకాశం అంత ఎక్కువ. రొమ్ములో మార్పులు వచ్చి, నొప్పి కూడా మొదలైందంటే అడ్వాన్స్‌ స్టేజికి వెళ్లిందని అనుమానించాలి. తొందరగా గుర్తించగలిగితే రొమ్మును మొత్తం తీసేయాల్సిన అవసరం రాదు. రొమ్మును కోల్పోకుండా క్యాన్సర్‌ను మాత్రమే తీసేయవచ్చు. అవసరమైతే రొమ్మును పునర్నిర్మించవచ్చు (రీకన్‌స్ట్రక్షన్‌ సర్జరీ). మొదటి రెండు దశల్లో బ్రెస్ట్‌ను ప్రిజర్వ్‌ చేయవచ్చు. మూడో దశకు చేరేసరికి ఈ అవకాశాలు తగ్గుతాయి. ఇలాంటప్పుడు కూడా రీకన్‌స్ట్రక్టివ్‌ సర్జరీ ద్వారా రొమ్ము మొత్తాన్నీ తీసేసి, వేరేచోట ఉన్న కణజాలాన్ని తెచ్చి అమరుస్తారు. ఇలాంటప్పుడు అది సహజమైన రొమ్ములా ఉండదు. తొందరగా గుర్తించి, చికిత్స మొదలుపెడితే సహజమైన రొమ్ము కణజాలాన్ని కోల్పోకుండా కాపాడుకోవటం సాధ్యమవుతుంది. ఇప్పటికీ చాలామంది మహిళల్లో  ఈ రుగ్మత పట్ల అవగాహన లేదు. 

పురుషుల్లోనూ.. ప్రమాద ఘంటికలు

రొమ్ము క్యాన్సర్‌ ఆడవాళ్ల సమస్య అనీ, మగవాళ్లకు రాదనీ భావిస్తుంటారు. కానీ పురుషుల్లో కూడా రొమ్ము క్యాన్సర్‌ రావచ్చు. సాధారణంగా వీళ్లలో బ్రాకా జన్యువులోని మార్పులే రొమ్ము క్యాన్సర్‌కు దోహదం చేస్తాయి. 90 శాతం వరకు వంశపారంపర్య కారణాలే ఉంటాయి. అంతేగాక, లావుగా ఉండే మగవాళ్లకు రిస్కు ఎక్కువ. వీళ్లలో కొవ్వు వల్ల ఈస్ట్రోజన్‌ పెరుగుతుంది. సాధారణంగా టెస్టోస్టిరాన్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉండి, ఈస్ట్రోజన్‌ లెవల్స్‌ను అణచిపెడతాయి. కానీ శరీరంలో కొవ్వు ఎక్కువయ్యే కొద్దీ వాళ్లలో కూడా ఈస్ట్రోజన్‌ స్థాయి పెరుగుతుంది. లావుగా ఉండేవాళ్లలో రక్తనాళాల (సిరలు) పక్కన కొవ్వు చేరి, ఈస్ట్రోజన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. అందుకే, 

ఆరోగ్యవంతుల కన్నా స్థూలకాయులైన మగవాళ్లలోనే ఈస్ట్రోజన్‌ లెవల్స్‌ ఎక్కువ. తద్వారా రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదమూ ఎక్కువే. అయితే బ్రాకా జన్యువు మ్యుటేషన్‌ ఉన్న మగవాళ్లలో రొమ్ము క్యాన్సర్‌ కన్నా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ రిస్కు మరీ ఎక్కువ. అంతేకాదు, పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌ కూడా రావచ్చు. రొమ్ము క్యాన్సర్‌ కేసుల్లో దాదాపు 1 శాతం మగవాళ్లకు సంబంధించినవే.

మహిళ ల్లోనే ఎందుకు?

స్త్రీలకు ప్రత్యేకం ఈస్ట్రోజన్‌ హార్మోన్‌. గుండెపోటు రాకుండా రక్షించే కవచం ఈ హార్మోన్‌. కానీ ఇదే లైంగిక హార్మోన్‌ రొమ్ము క్యాన్సర్‌ రిస్క్‌ను పెంచుతుంది. అంతేగాక, పెరిగే వయసు కూడా రొమ్ము క్యాన్సర్‌కు దగ్గర చేస్తుంది. ఈస్ట్రోజన్‌కు ఎంత ఎక్కువగా ప్రభావితం అయితే, ప్రమాదం అంత పెరుగుతుంది. నెలసరి మొదలైనప్పటి నుంచి మెనోపాజ్‌ దాకా ఈస్ట్రోజన్‌ హార్మోన్‌కు ప్రభావితం అవుతారు. గర్భం దాల్చినప్పుడు ఈస్ట్రోజన్స్‌ తగ్గి, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ లెవల్స్‌ పెరుగుతాయి. అందువల్ల ఈ సమయంలో ఈస్ట్రోజన్‌ ప్రభావం ఉండదు. కాబట్టి ఆలస్యంగా గర్భం దాల్చేవాళ్లు, పిల్లలు పుట్టనివాళ్లు, నెలసరి తొందరగా మొదలైనవాళ్లు, మెనోపాజ్‌ ఆలస్యంగా వచ్చినవాళ్లు, గర్భనిరోధక మాత్రలు వాడినవాళ్లలో.. రొమ్ము క్యాన్సర్‌ రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. 

అదేవిధంగా, శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుంటే ఈస్ట్రోజన్‌ ఉత్పత్తి అధికంగా ఉంటుంది. అందుకే, మరీ లావు  ఉండేవాళ్లు రొమ్ము క్యాన్సర్‌ బారినపడే అవకాశం ఎక్కువ. కాబట్టి శారీరక శ్రమ లేకపోవడం కూడా ఓ కారకమే. ఈస్ట్రోజన్‌ వల్ల రొమ్ము క్యాన్సర్‌ మాత్రమే కాదు, ఇతర గైనిక్‌ సమస్యలైన.. అండాశయ క్యాన్సర్‌, గర్భసంచి క్యాన్సర్లకు కూడా ఆస్కారం ఉన్నట్టే. అయితే ఈస్ట్రోజన్‌ ఇలా గైనిక్‌ క్యాన్సర్లకు ఎందుకు కారణం అవుతుందో చెప్పడానికి సరైన ఆధారాలు మాత్రం లేవు. ఈ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. 

ఏం చేయాలి?

20 ఏండ్ల వయసు నుంచీ సొంతంగా రొమ్ములను పరీక్షించుకోవడం అవసరం. సెల్ఫ్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా చాలావరకు వ్యాధి లక్షణాల్ని గుర్తించడం సాధ్యమవుతుంది. కుటుంబ చరిత్ర ఉన్నవాళ్లు ఆలస్యం చేయకుండా సరైన వయసులో పెండ్లి చేసుకుంటే మంచిది. ప్రెగ్నెన్సీని వాయిదా వేయడానికి గర్భ నిరోధక మాత్రలు వాడకపోవడం మేలు. బరువు పెరగకుండా క్రమం తప్పక వ్యాయామం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. 40 ఏండ్లు దాటిన వాళ్లు సొంతంగా పరీక్షించుకున్నప్పుడు ఏ అనుమానమూ లేకపోయినా, ఏడాదికోసారి మామోగ్రామ్‌ చేయించుకోవాలి. ఎందుకంటే చేతికి తగలని చిన్నచిన్న వాపులు కూడా ఒక్కోసారి ఎక్స్‌రేలో బయటపడుతాయి. దీనివల్ల తొలిదశలోనే గుర్తించడం సాధ్యమవుతుంది. మగవాళ్లు ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను కనుక్కోవడానికి పిఎస్‌ఎ లెవల్స్‌ పెరుగుతున్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలి. ఊబకాయులు మరింత అప్రమత్తంగా ఉండాలి. 


- డాక్టర్‌ అజయ్‌ చాణక్య

కన్సల్టెంట్‌ ఆంకాలజిస్ట్‌

కిమ్స్‌ హాస్పిటల్‌. సికింద్రాబాద్‌logo