గురువారం 29 అక్టోబర్ 2020
Zindagi - Oct 05, 2020 , 01:49:33

ఏ తమ్ముడికీ అలా జరగొద్దు

ఏ తమ్ముడికీ అలా జరగొద్దు

ఆ అక్కాతమ్ముళ్లిద్దరూ మంచి స్నేహితులు. 18 ఏండ్ల రాఘవ్‌ తన కవిత్వాలను అక్క రాశితో షేర్‌ చేసుకొని, ప్రసంశలు అందుకొనే వాడు. ఏమైందో తెలియదు, ఓ రోజు ఆ తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్నో విషయాలను తనతో షేర్‌ చేసుకున్న తమ్ముడు.. ఈ సంగతి ఎందుకు దాచిపెట్టాడో అర్థం కాలేదామెకు. ఆత్మహత్య చేసుకునేంత ఒత్తిడికి గురికావడానికి కారణాలేంటని ఎంతో శోధించింది. ఎన్జీవోలను కలిసింది. మానసిక సంఘర్షణే అసలు కారణంగా గుర్తించింది. తన బాధలు పంచుకునే వారు కరువై ఎందరో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలుసుకుంది. వారి బాధను విని, అర్థం చేసుకుంటే ఒక ప్రాణాన్ని కాపాడవచ్చని భావించింది. ‘యువర్‌ దోస్త్‌' పేరుతో ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసింది. ఒత్తిడిలో ఉన్న వారి ఆవేదనను వినేందుకు సదా సిద్ధంగా ఉంటుంది ఈ వేదిక. ఇందుకోసం ఐటీ  ఉద్యోగాన్ని వదిలేసిన రాశి తన మాటలతో ఆత్మవిశ్వాసం నింపడం ద్వారా ఎందరో తమ్ముళ్లను, చెల్లెళ్లను  కాపాడుకోగలిగింది.logo