బుధవారం 21 అక్టోబర్ 2020
Zindagi - Oct 03, 2020 , 00:22:03

తండ్రి వ్యాపారాన్ని వద్దనుకొని..

తండ్రి వ్యాపారాన్ని వద్దనుకొని..

పుట్టింది ధనిక కుటుంబంలో. అడక్కుండానే అన్నీ సమకూరేవి. అడిగితే కాదనేవారే లేరు. అయినా,  తనను తాను నిరూపించుకోవాలనుకున్నాడు.  ప్రతిభను నమ్ముకొని నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మోడల్‌గా రాణించాడు. కన్నడసీమలో బుల్లితెరపై మెరిశాడు. వెండితెర మీద తళుక్కుమన్నాడు. ‘త్రినయని’ సీరియల్‌తో తెలుగువారికి పరిచయం అయ్యాడు చందు బీ గౌడ. ఈ బుల్లితెర హీరో రియల్‌ లైఫ్‌ ముచ్చట్లు చదివేయండి..

చందు తండ్రి బెంగళూరులో వ్యాపారవేత్త. బైరప్ప పేరు చెబితే చాలు ఫలానా అని టక్కున గుర్తుపట్టేస్తారు. అమ్మ, చెల్లి.. చిన్న కుటుంబం. అన్ని రోజులూ సంతోషాలే. కావాల్సినంత ఆస్తి ఉన్నా ఏదో వెలితి చందును కుదురుగా ఉండనిచ్చేది కాదు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో బీఈ చేశాడు. కొన్నాళ్లు ఉద్యోగం చేశాడు. ‘ఒకరి కింద పనిచేయాల్సిన అవసరం నీకెందుకు, మన వ్యాపారం చూసుకో’ అన్నాడు తండ్రి. సరేనని వ్యాపార వ్యవహారాలు చూడటం మొదలుపెట్టాడు. అక్కడా సంతృప్తి లేదనిపించింది. ఏ కష్టం తెలియకుండా రోజులు సాగిపోయాయి. అన్నీ తండ్రే చూసుకునేవాడు. చాలెంజ్‌ అన్న మాటే లేదు. చేసేందుకు సరైన పని లేక విసుగొచ్చేది. ఇలా అయితే లాభం లేదనుకున్నాడు. బైరప్ప కొడుకుగా తప్ప తనకంటూ ఓ గుర్తింపు లేదు. ఎలాగైనా తనేంటో నిరూపించుకోవాలనుకున్నాడు.

చిన్నప్పటి నుంచీ కష్టం అంటే తెలియదు. చదువంతా బెంగళూరులోనే. స్టూడెంట్‌ లైఫ్‌  ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా సాగిపోయింది. “సప్తగిరి ఇంజినీరింగ్‌ కాలేజ్‌లోచదివే రోజుల్లో మిస్టర్‌ సప్తగిరిగా ఎంపికయ్యా. కాలేజ్‌ వేడుకల్లో చిన్న చిన్న స్కిట్స్‌ వేస్తుండేవాణ్ని. ఫ్రెండ్స్‌ ఊరుకుంటారా.. ‘నువ్వు హీరో కావాలిరా!’ అంటుండేవారు. వాళ్ల మాటలు సీరియస్‌గా తీసుకున్నది లేదనుకోండి. కానీ, నటనే ప్రధాన వృత్తి అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు” అంటాడు చందు.

అమ్మ ప్రోత్సాహం

చందు తన తండ్రి వ్యాపారాన్ని అన్నీ తానై చూసుకునే రోజుల్లో సన్నిహితులు సైతం ఇండస్ట్రీలో ప్రయత్నిస్తే తప్పేముందని ప్రోత్సహించారు. సలహా నచ్చింది. కానీ, ఎలా ప్రయత్నించాలో తెలియదు తనకు. అతనికే కాదు, చుట్టూ ఉన్నవాళ్లకూ ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధాలు లేవు. “ఇది వర్కవుట్‌ కావడం కష్టమే అనుకున్నా. ఓ రోజు నా మనసులోని మాటను నా స్నేహితులు మా అమ్మతో చెప్పారు. ‘టాలెంట్‌ అందరికీ ఉండదు. నీకు సహజంగానే నటన వచ్చు. నువ్వు యాక్టర్‌ కాగలవు’ అని అమ్మే నన్ను ఇటువైపు నడిపించింది” అని గుర్తు చేసుకున్నాడు చందు.

మోడలింగ్‌తో మొదలు..

మొదట్నుంచీ మంచి ఎక్సర్‌సైజ్‌ బాడీ తనది. ఫిట్‌గా ఉంటాడు. పూర్తిస్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టక ముందే ఓ రియల్‌ఎస్టేట్‌ వెంచర్‌ ప్రమోషన్‌ కోసం తెలిసినవారు చందును సంప్రదించారు. ఫొటోషూట్‌ చేసి కొంత డబ్బు చేతిలో పెట్టారు. తర్వాత వరుసగా మోడలింగ్‌ ఫొటోషూట్‌లకు పిలుపొచ్చేది. షర్ట్‌ లేకుండా, బాడీ చూపిస్తే ఎక్కువ డబ్బులు ఇచ్చేవారు. ‘గ్లామర్‌ ఫీల్డ్‌లో డబ్బులు సంపాదించడం ఇంత తేలికా అనిపించేది. ఆ ఉత్సాహంతోనే యాక్టింగ్‌ చాన్స్‌ కోసం ఎక్కడ ఆడిషన్స్‌ జరిగితే అక్కడికి వెళ్లిపోయేవాణ్ని. ఆడిషన్‌లో పాల్గొనడం, అవకాశం దక్కకపోవడం మామూలైపోయింది. చాలా తెల్లగా ఉన్నావని ఒకరు, ఈ క్యారెక్టర్‌కు సెట్‌ కావని మరొకరు, బాడీ బిల్డర్‌లా కనిపిస్తున్నావని ఇంకొకరు రిజెక్ట్‌ చేస్తుండేవారు. ఏడాది కాలం గిర్రున తిరిగిపోయింది. నా నమ్మకాలన్నీ పటాపంచలయ్యాయి. అమ్మ మాత్రం తప్పక సక్సెస్‌ అవుతావని చెబుతుండేది. ఇంత కష్టం అవసరమా అనుకునేవాడు నాన్న’ అని కెరీర్‌ తొలిరోజుల్లో ఎదురైన అనుభవాలు పంచుకున్నాడు చందు. ఇంతలో ‘గృహలక్ష్మి’ కన్నడ సీరియల్‌ ఆడిషన్స్‌ జరుగుత్నాయని తెలిసింది. ఆఖరిసారి ప్రయత్నించి విఫలమైతే  వ్యాపారం చూసుకుందామనుకున్నాడు చందు. ఇచ్చిన నాలుగు డైలాగ్‌లేవో చెప్పేశాడు. అపనమ్మకంతోనే అక్కడి నుంచి కదిలాడు. సీరియల్‌కు సెలెక్ట్‌ అయినట్టు కబురొచ్చింది. చూస్తుండగానే ఏడాదిన్నర పాటు సూపర్‌హిట్‌ సీరియల్‌లో కీలకపాత్రలో అలరించాడు. నటుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టాడు.

ఓపికే నిలబెట్టింది

జీవితంలో ఎన్నడూ క్యూలో నిలబడే అలవాటు లేని తను.. ఆడిషన్స్‌లో గంటల తరబడి లైన్‌లో నిల్చున్నాడు. ఆకలేస్తున్నా.. ఐదు నక్షత్రాల హోటల్‌లో తినే స్థాయి ఉన్నా.. లైన్‌ నుంచి కదిలితే అవకాశం ఎక్కడ పోతుందోనని అలాగే ఉండిపోయాడు. ఆ ఓపిక, నిబద్ధతే చందును నటుడిని చేసింది. ‘ఒక్కసారి అవకాశం దొరికితే ఇక మన ప్రతిభే గీటురాయి అవుతుంది. దాని మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా ఇచ్చిన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలి. పాత్రలో ఒదిగిపోవాలి. అప్పుడే ప్రేక్షకుల మెప్పు పొందగలుగుతాం. అన్నిటికీ మించి ఓపిక చాలా అవసరం’ అంటాడీ నటుడు.

చాలా ఇష్టం.. కొంచెం కష్టం..

బుల్లితెరపై మెప్పించిన చందుకు వెండితెర నుంచి పిలుపు అందింది. డైరెక్టర్‌ అమర్‌ గౌడ మొదటి చిత్రం ‘అటెమ్ట్‌ టు మర్డర్‌' అనే కన్నడ సినిమాలో అవకాశం వచ్చింది. మరికొన్ని చిత్రాల్లోనూ నటించాడు. కొవిడ్‌ కారణంగా ఇంకా విడుదల కాలేదు. అంతకుముందే తెలుగువారికీ పరిచయం అయ్యాడు. ‘త్రినయని’ సీరియల్‌ కోసం హైదరాబాద్‌ నుంచి పిలుపు అందుకున్న రోజు నిజంగా నేను మేఘాల్లో తేలిపోయాననే చెప్పాలి. తెలుగులో సినిమాలు ఎక్కువగా చూస్తాను. నాకు అల్లు అర్జున్‌ అంటే చాలా ఇష్టం. ఆయనకు నేను డైహార్ట్‌ ఫ్యాన్‌. అదీ కాకుండా నటించడానికి బాష ఒక పరిమితి కాకూడదు అని నేను నమ్ముతాను. బెంగళూరు నుంచి ఇక్కడికి ప్రయాణాలు కొంచెం కష్టంగా ఉన్నా.. ఇష్టమైన పనిలో వీటన్నిటినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదం’టాడు చందు. 

తెలుగు వాళ్లు సూపర్‌

“తెలుగు ఇండస్ట్రీలో మేకింగ్‌ చాలా భిన్నంగా ఉంటుంది. చిన్నచిన్న విషయాల గురించి కూడా చాలా శ్రద్ధ తీసుకుంటారు. నటులను గౌరవిస్తారు. ప్రేక్షకుల అదరణ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు లభిస్తున్నది. సినిమా నుంచి కూడా ఒక పిలుపు వచ్చింది. అవకాశం దొరుకుతుందన్న నమ్మకం ఉంది. ఇంత ఆదరణ, గుర్తింపు ఇచ్చిన త్రినయని సీరియల్‌ బృందానికి నా కృతజ్ఞతలు. అన్నపూర్ణ లాంటి పెద్ద బ్యానర్లో నటించడం నిజంగా నా అదృష్టం. అన్నింటికంటే ముఖ్యంగా నన్ను తమ వాడిగా అంగీకరించిన తెలుగు ప్రేక్షకులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.”logo