గురువారం 29 అక్టోబర్ 2020
Zindagi - Oct 01, 2020 , 03:10:11

లెక్కల ఫోబియా డౌన్‌.. డౌన్‌

లెక్కల ఫోబియా డౌన్‌.. డౌన్‌

19 ఆగస్టు, 2005. వరలక్ష్మీ వ్రతం. బంధువులతో ఇల్లంతా సందడిగా ఉంది. ఈ హడావుడిలో అయిదేండ్ల భాను తన బావతో కలిసి బండి మీద బయటికి వెళ్లాడు. ఎదురుగా లారీ వస్తున్నది. కొద్దిసేపైతే ఏమయ్యేదో! భాను బండి మీది నుంచి దూకేశాడు. బండి నడుపుతున్న పిల్లవాడు కూడా పడిపోయాడు. అతడికి చిన్న ఫ్రాక్చర్‌ అయింది. భాను తలకి బలమైన గాయమైంది. వెంటనే, హాస్పిటల్‌కు తీసుకువెళ్లడంతో  హుటాహుటిన ప్లాస్టిక్‌ సర్జరీ చేశారు. ఆరోగ్యం కుదుటపడగానే, రెట్టించిన ఉత్సాహంతో లెక్కలతో తన ఆట మొదలుపెట్టాడు... అందుకు మార్గదర్శి భాను తల్లి హేమలత. 

అది యూకేజీ క్లాసు. పిల్లలందరూ పరీక్ష రాస్తున్నారు. హఠాత్తుగా ఓ బుడతడు ప్రశ్నపత్రం పట్టుకుని టీచర్‌ దగ్గరికి వచ్చాడు. ‘మూడో లెక్కలో తప్పుంది టీచర్‌'... అంటూ ముద్దుముద్దుగా  ఫిర్యాదు చేశాడు.ఆ లెక్కను పరిశీలించిన టీచర్‌ ఆశ్చర్యపోయింది. నిజంగానే అందులో తప్పు ఉంది. అదే, బుడతడు ఇప్పుడు మానవ కంప్యూటర్‌ అయ్యాడు. మెంటల్‌ కాలిక్యులేషన్‌లో వరల్డ్‌ ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. మెంటల్‌ అర్థమెటిక్‌లో యాభై లిమ్కా అవార్డులు, నాలుగు వరల్డ్‌ రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకప్పటి గణిత మేధావి శకుంతలాదేవి రికార్డును బద్దలు కొట్టిన ఆ యువకుడి పేరు.. జొన్నలగడ్డ నీలకంఠ భానుప్రకాశ్‌. ఈ విజయం వెనుక  ఓ అమ్మ పెంపకమూ ఉంది. 

చిన్నప్పుడు ఇష్టంగా క్రికెట్‌ ఆడుతున్న భానును చూసి బిడ్డను  క్రికెటర్‌ చేయాలనుకున్నారు హేమ. కానీ, భానుకు లెక్కల మీద ఉన్న ఆసక్తిని చూసి, అటువైపే ప్రోత్సహించాలనుకున్నారు. వేసవి సెలవుల్లో పైతరగతి లెక్కలన్నీ చేసేవాడు భాను. అనుక్షణం తన మెదడులో అంకెలు నాట్యం చేస్తుండేవి. అందుకే బిడ్డకు గణితం గురించి సమస్త సమాచారమూ అందుబాటులో ఉంచారు. ఇందుకోసం అయిదో తరగతి నుంచే ఇంటర్నెట్‌, ఐపాడ్‌ లాంటి సౌకర్యాలు అందించారు. 

పిల్లలు మన ప్రతిబింబాలు

‘పిల్లల విజయానికి పునాది కుటుంబంలోనే పడుతుందని’అంటారు హేమ. ‘భారతీయ సంస్కృతి గొప్పదనమే ఇది. మన కుటుంబ వ్యవస్థే మనకన్నీ నేర్పిస్తుంది. ఇంట్లోని పెద్దవాళ్లు.. నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యల ప్రేమ, అనుభవం పిల్లలకు వ్యక్తిత్వ వికాస పాఠాలవుతాయి. ఇలాంటి వ్యవస్థలో ప్రత్యేకించి ఏ విషయమూ నేర్చుకోనక్కరలేదు. పిల్లల్ని ఎలా పెంచాలన్నది పుస్తకాలు చదివో, పేరెంటింగ్‌ తరగతులకు వెళ్లో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మన పిల్లలు మన ప్రతిబింబాలు. వాళ్లు ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నామో, మనమూ అలా ఉండగలిగితే చాలు. పిల్లల్ని చదువుకోమని చెప్పి మనం టీవీ చూస్తూ కూర్చుంటే ఎలా? వార్తల కోసం తప్ప మా ఇంట్లో టీవీ పెట్టం. పిల్లల కోసం ఎంత ఎక్కువ సమయం కేటాయించగలిగితే, వాళ్ల వ్యక్తిత్వం అంత చక్కగా ఉంటుంది. భానుకి చిన్నప్పుడే రామాయణ, మహాభారత కథలన్నీ వచ్చేశాయి. యూకేజీలో ఉన్నప్పుడే రామాయణం మొత్తం స్టేజీ మీద చెప్పాడు. లెక్కలు బాగా రావడానికో, చదువు బాగా అబ్బడానికో ఇవన్నీ ప్రత్యక్షంగా తోడ్పడకపోవచ్చు. కానీ చదువు పట్ల ఆసక్తి పెంచుకోవడానికి మాత్రం తప్పనిసరిగా ఉపయోగపడుతాయి’ అని చెప్తారు హేమ. 

లెక్కలు కావవి.. ఆటలు

లెక్కలు బాగా రాగానే, ఇంజినీరింగ్‌ చదివి ఏ అమెరికాకో ఎగిరిపోవాలనుకుంటారు చాలామంది. కానీ భాను ఇంజినీరింగ్‌ మధ్యలోనే వదిలేశాడు. తన లక్ష్యం సంపాదన కాదు. సాధారణంగా లెక్కలు అనగానే అదేదో భూతంలా భావిస్తారు చాలామంది. లెక్కలు జాగ్రత్తగా నేర్చుకోవాలంటూ చిన్నప్పటి నుంచీ పిల్లల్లో ఒక ఫోబియా క్రియేట్‌ చేస్తారు. కానీ, ‘లెక్కలంటే ఒక ఆట’ అంటాడు భానుప్రకాశ్‌. పిల్లలు లెక్కల్ని క్రీడల్లా ఎంజాయ్‌ చేయాలన్నదే అతని లక్ష్యం. లెక్కలు ఒక సబ్జెక్టు కాదు. ఇదొక కళ, ఒక క్రీడ. ఆటలు శరీరానికి ఫిట్‌నెస్‌ని అందిస్తే.... లెక్కలు మానసికమైన దారుఢ్యాన్ని అందిస్తాయంటాడు. అందుకే ఒలింపిక్‌ క్రీడల్లో మెంటల్‌ కాలిక్యులేషన్స్‌ని చేర్చాలంటాడు. రెండేండ్ల వ్యవధిలో.. కనీసం రెండు కోట్ల మంది పిల్లల్లో లెక్కలంటే భయం పోగొట్టి, వాటి పట్ల ఇష్టం ఏర్పడేలా చేయాలన్నది భానుప్రకాశ్‌ ఆశయం. ఇందుకోసం ‘ఎక్స్‌ప్లోరింగ్‌ ఇన్‌ఫినిటీస్‌' అనే స్టార్టప్‌ను స్థాపించారు. దీని ద్వారా పిల్లలకు డిజిటల్‌గా లెక్కల క్లాసులు నిర్వహిస్తున్నాడు. పలు విద్యాసంస్థలకు వెళ్లి  తాను రూపొందించిన ప్రత్యేక మెథడాలజీలో లెక్కలతో ఆటలు ఆడిస్తున్నాడు. వీటివల్ల ఏకాగ్రత, నిర్ణయాత్మక శక్తి, ఆలోచనాశక్తి, సృజనాత్మకత కూడా పెరుగుతాయి. విజన్‌ మాథ్స్‌ పేరుతో మాథ్స్‌ ఫోబియాను నిర్మూలించడానికి ఏకవ్యక్తి ఉద్యమంలా పనిచేస్తున్నాడు. టీ-శాట్‌ లాంటి సంస్థలతో ప్రాజెక్టు కూడా చేస్తున్నాడు. మీరు కూడా భానుతో కలిసి లెక్కలతో ఆడుకోవాలంటే expinfi.com లో లాగిన్‌ కావచ్చు.

భాను విజయం వెనుక..

మన కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా వాటి ప్రభావం పిల్లల మీద పడకుండా చూసుకుంటే వాళ్లే ప్రశాంతంగా చదువుకుంటారు. వాళ్ల ఆసక్తులను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. వాళ్లు చెప్పేది మనం వినగలగాలి. మనం ఏం చేస్తున్నామో, పెద్దయ్యాక వాళ్లూ అవే చేస్తారు. అందుకే ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, టీనేజ్‌ పిల్లల హార్మోన్లను మనం అర్థం చేసుకోగలగాలి. వాళ్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారని మనం కూడా మితిమీరిన కోపం ప్రదర్శించవద్దు.  స్నేహంగా ఉంటూ మంచి మాటలతో చెప్పాలి. డామినేట్‌ చేసే ప్రయత్నం చేయకూడదు. ఓపిక చాలా అవసరం. ఇలాంటి అతి సామాన్య పేరెంటింగ్‌ టెక్నిక్సే భానును సరైన దారిలో నడిపాయి. భాను కనిపెట్టిన కొత్త మెథడాలజీ పిల్లలకు ఓ మానసిక వ్యాయామం. దీనివల్ల వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాల నుంచి కలిసి పనిచేద్దామంటూ భానుకు ఆఫర్లు వచ్చాయి. ఎన్‌సిఇఆర్‌టి వాళ్లు కూడా చర్చలు జరుపుతున్నారు. 

-జొన్నలగడ్డ హేమ శివపార్వతి

భానుప్రకాశ్‌ తల్లి గణితాన్ని సబ్జెక్ట్‌గా చూడొద్దు 

ఇది మెదడుకు సంబంధించిన క్రీడ. దాన్ని ఒక కళగా చూడటం మొదలు పెట్టిన తరువాత గణితంతో నా దోస్తీ పెరిగింది. మన మెదడు కంప్యూటర్‌ కన్నా ఎక్కువ శక్తి కలిగివుంది. అందుకే మనలో ఉన్న కంప్యూటర్‌ను స్విచాన్‌ చేయమంటున్నాను. ఒక ఫార్ములాతో చెప్పేకన్నా ప్రాక్టికల్‌గా అనుభవంలోకి వస్తే సులువుగా అర్థమవుతుంది. నేను పిల్లలకు చెప్తున్నదీ అదే. నేను పరిశోధించి కనుక్కున్న ఈ మెథడాలజీ ద్వారా రెండుమూడు నెలల్లోనే లెక్కలంటే భయం పోతుంది. ఓ ఆటలా ఎంజాయ్‌ చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లోనే కాకుండా డిజిటల్‌ క్లాసులు, వర్క్‌షాప్స్‌ ద్వారా ఫోబియా పోగొట్టే ప్రయత్నం చేస్తున్నా. ప్రపంచంలోని పిల్లలందరూ గణితాన్ని భూతంలా కాకుండా ఫ్రెండ్‌లా చూడాలి. మ్యాథ్స్‌ ఫోబియాను నిర్మూలించడమే నా ధ్యేయం. 

- నీలకంఠ భానుప్రకాశ్‌

వరల్డ్‌ హ్యూమన్‌ కాలిక్యులేటర్‌


logo