ఆదివారం 25 అక్టోబర్ 2020
Zindagi - Oct 01, 2020 , 03:10:11

అక్కినేని ఫ్యామిలీ.. వంటలక్క!

అక్కినేని ఫ్యామిలీ.. వంటలక్క!

కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉన్నారంటే ఆ ఇంటి ఇల్లాలి వంటే కారణం. అక్కినేని వారసుల ఆరోగ్యం వెనుక  మాత్రం ఓ అందమైన అమ్మాయి ఉంది. తనకు వంట రాకపోయినా తన భర్తకు, పిల్లలకు పోషకాహారాన్ని అందించడంలో అమల ఏమాత్రం రాజీపడరు. కాబట్టే, ప్రత్యేకంగా శిక్షణ పొందిన షెఫ్‌ను నియమించారు. ఆమె పేరు కైరావి మెహతా. ఇటీవల అక్కినేని అఖిల్‌ ఆన్‌లైన్‌లో తనని ఆకాశానికి ఎత్తేశాడు కూడా. 

ఇంటి పనిలో సహాయం చేయమంటే చాలు.. ఇప్పటి పిల్లలు ఏదో ఒక సాకు చూపి తప్పించుకుంటారు. కానీ కైరావి మాత్రం అయిదో ఏట నుంచే కిచెన్‌లో ప్రయోగాలు చేసింది. స్కూల్‌ నుంచి ఇంటికి రాగానే తన కోసం తనే రోటీలు తయారు చేసుకునేది. మొదట్లో వాటి ఆకారం వివిధ దేశాల మ్యాప్‌లను తలపించేది. అయినా నిరాశపడకుండా పట్టుబట్టి గుండ్రంగా చేయడం నేర్చుకుంది. వాళ్ల అమ్మ కన్నా బాగా చేసే స్థాయికి ఎదిగింది. ఇక, వారాంతపు సెలవులు వస్తే కిచెన్‌కే అతుక్కుపోయేది. కైరావి  గుజరాతీ అమ్మాయి. మణిపాల్‌లో పాకశాస్త్ర పట్టా అందుకున్నది. ‘చిన్నప్పటి నుంచీ గుజరాతీ ఫుడ్‌కే అలవాటు పడ్డాను కాబట్టి, స్వతహాగా ఆ వంటకాలు అంటేనే ఇష్టం’అని చెప్తున్నది. వంట విషయంలో కైరావి నిత్య విద్యార్థి. ‘క్యాలెండర్‌లో తేదీ మారగానే, నేను నేర్చుకునేదాంట్లో ఏదో ఒక కొత్త విషయం చేరాలనుకుంటాను. రోజూ వంటింట్లో ప్రయోగాలు చేయడం నాకు ఇష్టం. ప్రత్యేకించి ఆహారం విషయంలో నేర్చుకోవడానికి పరిమితులంటూ ఉండవు. ఏ పదార్థమూ వృథా కాకుండా  ఫుడ్‌ ప్రిపరేషన్‌ ఉండాలి. నేను హైదరాబాద్‌లోనే ఉంటున్నాను కాబట్టి, ఇక్కడి సంప్రదాయ వంటకాలను గమనిస్తాను. వీటిలో కొత్త ప్రయోగాలు చేయడం ఆసక్తికరంగా ఉంటుంది’ అంటుంది కైరావి. వివిధ రంగుల కూరగాయలతో శాకాహార ఆమ్లెట్ల తయారీ మీద ప్రయోగాలు చేయాలన్నది ఆమె ఆలోచన.

అసలైన కళ ఇదే

వంట చేయడానికి ముందే అవసరమైన పదార్థాలన్నీ దగ్గర పెట్టుకుంటే ప్రతిదానికీ వెతుక్కునే పని ఉండదు. వంట పైనే పూర్తి ధ్యాస పెట్టవచ్చు. తొందరగా కూడా పూర్తవుతుంది. రుచికరంగానే కాదు.. అందంగా వండటం కూడా ముఖ్యమే. వంట పూర్తయిన తరువాత చాలామంది కూరగాయల వ్యర్థాలు, ఇతర పదార్థాలు చిందరవందరగా పడేస్తుంటారు. ఇది కరెక్ట్‌ కాదు. కిచెన్‌ శుభ్రంగా ఉంటేనే వంట చేయబుద్ధేస్తుంది. ఈ విషయాన్ని ఎవరూ విస్మరించకూడదు.


logo