ఆదివారం 25 అక్టోబర్ 2020
Zindagi - Sep 30, 2020 , 00:35:18

ఏ బిడ్డా..అనాథ కారాదు

ఏ బిడ్డా..అనాథ కారాదు

విశ్వామిత్రుడు, మేనక వదిలేసిన పసికందు కణ్వమహర్షి కంటపడింది.  గుక్కపెట్టి ఏడుస్తున్న బిడ్డను కణ్వుడు ఆదరించాడు. తానే అమ్మానాన్నగా మారి శకుంతలను పెంచాడు.  ఈ కథ జరిగింది పురాణకాలంలో! ధర్మం నాలుగు పాదాల మీద నడిచే రోజుల్లో.

మరిప్పుడో.. ధర్మం చిరునామా గల్లంతైన రోజులివి. బొడ్డు తడి ఆరకముందే గుడి మెట్ల దగ్గర ఓ బిడ్డ! ఎవరో చేసిన పాపాన్ని నవమాసాలూ మోసి రైల్వే ట్రాక్‌ మీద పడేసే తల్లి! ఆడపిల్ల పుట్టిందని అనాథాశ్రమం ఎదుట వదిలేసే తండ్రి ! విధి శాపమో, కాల వైపరీత్యమో ముక్కుపచ్చలారని చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. కానీ, వీరిని ఆదరించి ఆప్యాయతను పంచే తల్లిదండ్రులు ఎక్కడ? ఒకవేళ ముందుకొచ్చినా స్వార్థం పొడచూపిన వెంటనే ఆ చిన్నారుల పరిస్థితి అగమ్యగోచరం అవుతున్నది. ఆ బిడ్డలకు మంచి మనసున్న తల్లిదండ్రులను వెతికిపెట్టే బాధ్యతను ప్రభుత్వం భుజానికెత్తుకున్నది. దత్తత ఇవ్వడానికి ముందు ఆ దంపతుల అర్హతలు పరిశీలించి ఉభయతారకంగా అభయమిస్తున్నది సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ సెంటర్‌ (కారా).

బిడ్డలు పుట్టరనో, వారసులు లేరనో పిల్లల్ని దత్తత తీసుకోవడానికి ముందుకొస్తారు చాలామంది. కానీ, అన్ని దత్తత ప్రక్రియలూ సుఖాంతం కావు. బిడ్డను దత్తత తీసుకున్నంత వరకు బాగానే ఉంటుంది. ఈ దత్తపుత్రిక వచ్చిన వేళావిశేషంతో ఆ ఇంట ఓ బిడ్డ పుడితే.. అప్పటి వరకూ ఉన్న  ఆప్యాయత ఆవిరి అవుతున్నది. అన్నాళ్లూ ప్రేమగా చూసిన అమ్మానాన్నలు ఎందుకలా వ్యవహరిస్తున్నారో అర్థం కాదు ఆ పసి బుర్రలకు. ఇలా, ఎందరో పిల్లలు మళ్లీ అనాథలు అవుతున్నారు. అన్నాళ్లూ ఇంటి మనిషిగా మసలిన బిడ్డ పనిమనిషిగా మారిపోతుంది. పైపైకి ప్రేమ నటించినా,  దత్తత తీసుకున్న బిడ్డలపై అకృత్యాలకు పాల్పడుతున్న దారుణ ఉదంతాలూ కోకొల్లలు. కారణాలేవైనా దత్తతతో దక్కిన అదృష్టం ఆ పసివాళ్లకు మూణ్నాళ్ల ముచ్చటే అవుతున్నది. ఇలాంటి ఇబ్బందులకు  అవకాశం లేకుండా, నేరాలకు ఆస్కారం లేకుండా 2015లో  సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ సెంటర్‌ (కారా) విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇందులో దత్తత ప్రక్రియంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. దత్తత కోసం ముందుకు వచ్చిన తల్లిదండ్రుల అర్హతలు ఒకటికి రెండుసార్లు పరిశీలించాకే ఓ నిర్ణయం తీసుకుంటారు. ఈ విధానంలో 2016 నుంచి 2018-19 వరకు 9860 మంది చిన్నారులను దత్తత తీసుకున్నారు. ఇందులో 1882 మంది భారతీయ బాలలను విదేశీయులు దత్తత తీసుకోవడం మరో విశేషం.

అంతా ఆన్‌లైన్‌ ద్వారానే..

ఒక్కోసారి ఓ బిడ్డను చూడగానే పేగు కదిలినట్టు అవుతుంది. అంత మాత్రాన ఆ బిడ్డను తీసుకెళ్లి పెంచుకుంటామంటే చట్టాలు ఒప్పుకోవు. నిబంధనలు పాటించకుండా పిల్లలను దత్తత ఇచ్చినా, స్వీకరించినా నేరం. అందుకు మూడేండ్ల వరకు కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. ఈ నేపథ్యంలోనే పిల్లలను చట్టబద్ధంగా దత్తత ఇచ్చేందుకు ప్రత్యేకంగా సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ (కారా)ని ఏర్పాటు చేశారు. దత్తత తీసుకునేవారు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దత్తత తీసుకునేవారి ఫొటో, జనన, నివాస, ఆదాయ ధ్రువీకరణ, వివాహ ధ్రువీకరణ పత్రాలను జతచేయాల్సి ఉంటుంది. ఆ దంపతులు తమకు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు లేవని తెలుపుతూ హెల్త్‌ సర్టిఫికెట్‌ను కూడా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో కారా పేరిట రూ. 6వేల రుసుమును డీడీ ద్వారా చెల్లించాలి. అవసరమైతే  జిల్లా సంక్షేమశాఖ అధికారిని సంప్రదించాల్సి ఉంటుంది. 

నిరంతర పర్యవేక్షణ

దత్తత ఇవ్వడంలోనూ పలు నిబంధనలు ఉన్నాయి. 50 ఏండ్లలోపు దంపతులకు నాలుగేండ్లలోపు పిల్లలను, 50 ఏండ్లు పైబడిన దంపతులకు నాలుగేండ్లు పైబడిన పిల్లలను మాత్రమే దత్తతకు ఇస్తారు. అంతకు ముందు సంబంధిత జిల్లాకు చెందిన పిల్లలను ఆ జిల్లాకు చెందిన వారికే, అదీ 14ఏళ్ల లోపు వారినే దత్తత ఇచ్చేవారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా, 18ఏళ్ల లోపు పిల్లలను కూడా దత్తత తీసుకోవచ్చు.  దంపతులు దరఖాస్తు చేసుకున్న వెంటనే వారికి పిల్లలను ఇచ్చేయరు. ముందుగా దరఖాస్తు చేసుకున్నవారికి ముందుగా  పిల్లలను అప్పగిస్తారు. అధికారులు దత్తత ఇచ్చేసి చేతులు దులుపుకోరు. ఆ తల్లిదండ్రుల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తారు. పిల్లలను ఎలా చూసుకుంటున్నారు? వారి స్థితిగతులేమిటి? తదితర అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. రెండేండ్ల వరకు కారా బృంద సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు.  అనుమానం వస్తే విచారణ జరుపుతారు. తగిన చర్యలు తీసుకుంటారు. ఇలా కారా.. ఎందరో అనాథ పిల్లలకు అమ్మానాన్నలను ప్రసాదిస్తున్నది. బిడ్డల్లేక తల్లడిల్లుతున్న దంపతులకు సంతాన భాగ్యమూ కల్పిస్తున్నది.

అన్నీ నిర్ధారించుకున్నాకే..

పిల్లల దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నవారి వివరాలను కారా అధికారులు ఐసీడీఎస్‌ సిబ్బందికి అందజేస్తారు. వారు ఆ దంపతుల దరఖాస్తును పరిశీలించి అందులోని వివరాలను ధ్రువపరుచుకుంటారు. అన్నీ సజావుగానే ఉన్నాయని నిర్ధారించుకున్నాక దంపతులకు సమాచారం ఇస్తారు. దత్తత తీసుకోవాలని కోరుకునేవారికి ఆ పరిధిలోకి వచ్చే పిల్లల ఫొటోలోను ఆన్‌లైన్‌లో పంపుతారు. ఆ ఫొటోలు చూసిన 48రోజుల్లో ఒకరిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 15 రోజుల్లో ఆ చిన్నారిని ప్రత్యక్షంగా చూసి, దత్తతకు సరేనంటే వైద్యపరీక్షలను నిర్వహిస్తారు. అప్పుడు గానీ, బిడ్డకు వారికి అప్పగించరు. ఈ సందర్భంగా దత్తత తీసుకున్న తల్లిదండ్రులు మరో రూ.40వేలు జమచేయాల్సి ఉంటుంది. ప్రతి దశలో నిబంధనల్ని కచ్చితంగా పాటిస్తారు అధికారులు.

అమెరికా అమ్మానాన్నలు

భారతీయులే కాదు, విదేశాలకు చెందిన దంపతులు కూడా కారా సహకారంతో తల్లిదండ్రులు అవుతున్నారు.  ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 9,860 మంది పిల్లలకు తల్లిదండ్రుల అప్యాయతను అందించింది. ఇక భారతీయ బాలబాలికలను దత్తత తీసుకునేందుకు విదేశీయులు సైతం  మొగ్గు చూపుతున్నారు. అందులో అమెరికన్లు ముందుండటం గమనార్హం. 2018-19 సంవత్సరంలో సుమారు 653 మంది భారతీయ పిల్లలను విదేశీయులు దత్తత తీసుకోగా, అందులో 301 మంది చిన్నారులను అమెరికాకు చెందిన వారే తీసుకోవడం విశేషం. ఇటలీ, స్పెయిన్‌, కెనడా తదితర దేశాల వారు కూడా భారతీయ పిల్లలను దత్తత తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనివల్ల వీధిపాలు కావాల్సిన బాల్యం విధిరాతను మార్చుకుంటున్నది.

దత్తత వక్రమార్గం పట్టకూడదనే..

అనాథ బాలబాలికల దత్తత ప్రక్రియ వక్రమార్గం పట్టకుండా ఉండేందుకు కారా ఎంతో దోహదపడుతున్నది. చిన్నారులకు అన్నివిధాలా రక్షణగా ఉంటుంది. సొంత పిల్లలకు ఉండే హక్కులన్నీ దత్తత పిల్లలకు కూడా ఈ చట్టం ద్వారా వర్తిస్తాయి. పిల్లలు లేని దంపతులు కారా ద్వారా దత్తత తీసుకోవడం ఎంతో ఉత్తమ మార్గం. చిన్నారులను దత్తత తీసుకోవాలని అనుకునేవారు  1800-11-1311 టోల్‌ఫ్రీ నంబర్‌లో సంప్రదించాలి. మరిన్ని వివరాల కోసం జిల్లా బాలల పరిరక్షణ విభాగాన్నీ, ఐసీడీఎస్‌ అధికారులనూ సంప్రదించవచ్చు.

- రాజేంద్రప్రసాద్‌, 

ఆదిలాబాద్‌ జిల్లా బాలల పరిరక్షణ అధికారి


...మ్యాకం రవికుమార్‌
logo