గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Sep 30, 2020 , 00:35:10

జయహో.. జోహ్రా

జయహో.. జోహ్రా

భారతీయ దిగ్గజ నృత్యకారిణి, రంగస్థల కళాకారిణి, సినీ నటి జోహ్రా ముంతాజ్‌ సెహగల్‌కు గూగుల్‌ ప్రత్యేకంగా నివాళులర్పించింది. జోహ్రా నటించిన ‘నీచా నగర్‌' సినిమాను ‘కేన్స్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌'లో 29, సెప్టెంబర్‌ 1946న ప్రదర్శించారు.  ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ జోహ్రా డూడుల్‌ను గూగుల్‌ తన హోమ్‌ పేజీపై ఉంచింది. తమిళనాడుకు చెందిన పార్వతి పిైళ్లె అనే చిత్రకారిణి ఈ డూడుల్‌ను రూపొందించింది. 

ఏప్రిల్‌ 27, 1912లో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో జన్మించిన జోహ్రా ముంతాజుల్లా ఖాన్‌ బేగం, చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి పెంచుకున్నారు. తన తల్లి కోరిక మేరకు నాట్య విద్యను అభ్యసించారు. మొదట్లో ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ఉదయ్‌ శంకర్‌ బృందంలో నర్తకిగా తన కెరీర్‌ను ప్రారంభించి, 

ఆ బృందంతో కలిసి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చారు. 1942లోనే తోటి కళాకారుడు కామేశ్వర్‌ సెహగల్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. బాలీవుడ్‌లో అడుగుపెట్టి, అటు కొరియోగ్రాఫర్‌గానే కాకుండా నటిగానూ సినిమాల్లో తనదైన ముద్ర వేశారు. 1946లో జోహ్రా నటించిన ‘నీచా నగర్‌' సినిమా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో విడుదల కావడంతోపాటు అత్యున్నత ‘పామ్‌ డీ ఓర్‌' బహుమతిని కూడా గెలుచుకున్నారు. దేశంలో సంప్రదాయ నృత్య వికాసానికి జోహ్రా ఎంతో కృషి చేశారు. ఢిల్లీ నాట్య అకాడమీకి డైరెక్టర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. 60 ఏండ్ల సినీ జీవితంలో తన నృత్య, అభినయాలతో దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. 1998లో పద్మశ్రీ, 2002లో పద్మ భూషణ్‌, 2010లో పద్మ విభూషణ్‌ పురస్కారాలను అందుకున్నారు. చివరిసారిగా ‘సావరియా’ చిత్రంలో కనిపించిన జోహ్రా, 2014లో 102 ఏండ్ల వయస్సులో గుండెపోటుతో మరణించారు. 


logo