గురువారం 29 అక్టోబర్ 2020
Zindagi - Sep 29, 2020 , 00:31:26

దేఖో సిల్క్‌ బనారస్‌ వాలా!

దేఖో సిల్క్‌ బనారస్‌ వాలా!

క్షేత్రరాజం వారణాసి.. పుణ్యతీర్థం వారణాసి..భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతికి చిరునామా అయిన ఈ నిగూఢ నగరిలో మరో అద్భుతం బనారస్‌ సిల్క్‌. శతాబ్దాలు గడిచినా ఫ్యాషన్‌ ప్రపంచంలో  పట్టు స్థానం పదిలంగా ఉంటున్నది. కాశీ విశాలాక్షి ఆశీర్వాదంగా భావించి మగువలు ఈ చీరను కండ్లకు అద్దుకొని తీసుకుంటారు. తమ సృజనాత్మకత అంతా రంగరించి మహిళలకు కానుకగా అందిస్తున్న నేతన్నలకు వారణాసిలోని అన్నపూర్ణ సదా అనుగ్రహిస్తూనే ఉన్నది.

రకరకాల హంగులతో

కాలానుగుణంగా బనారస్‌ పట్టు కొంగొత్త రూపాలు సంతరించుకున్నది. చీరలుగానే కాదు డ్రెస్‌ మెటీరియల్స్‌, పట్టు ఎంబ్రయిడరీ దుస్తులు, దుపట్టాలుగా ఫ్యాషన్‌ ప్రియులను పలకరిస్తున్నాయి. రకరకాల ఫ్యాబ్రిక్స్‌ సైతం బనారసీ అందాలు అద్దుకొని మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. స్వచ్ఛమైన పట్టుతో జిలుగులు కురిపించే బనారస్‌ పట్టు ఆర్గంజాలో అదనపు దర్పం ప్రదర్శిస్తుంది. జార్జెట్‌ శైలిలో సహజంగా, కట్‌వర్క్‌లో ప్రత్యేకంగా, బుటీదార్‌లో ఆకర్షణీయంగా అలరిస్తుంది.

‘ఇది బనారస్‌ పట్టు..’ ఈ ముక్క చెప్పడంతోనే ‘ఎంత బాగుంది వదినా!’ అని ఆనందాన్ని పంచుకునే వారూ ఉంటారు. ‘మొన్నీమధ్య కాశీకి వెళ్లినప్పుడు ఇంతకన్నా కాస్ట్‌లీ బనారస్‌ పట్టుచీర మీ అన్నయ్య నాకూ తెచ్చారమ్మా!’ అని ఎదుటివారి ఉత్సాహాన్ని నీరుగార్చే వారూ ఉంటారు. అణువణువూ జరీతో మెరిసిపోయే బనారస్‌ పట్టుకోకను చూశాక ఎంత మంచి మనిషికైనా.. ఇంత గొప్ప చీర తన భోషాణంలో ఎందుకు లేదా అని ఈర్ష్య కలగడం సహజం. భారతదేశానికే కీర్తి తెచ్చిన చీరలవి. కట్టుకున్నవారికి నిండుదనం తెస్తాయి. అది చూసిన కట్టుకున్నవాడు ఆమెను ప్రేమగా చుట్టుకోకుండా ఉండలేడు. మహిమంతా ఆ చీరలోనే ఉంది.

16వ శతాబ్ది నుంచి..

బనారస్‌ సిల్క్‌ ఎంత బరువో.. అంత పరువునిస్తాయి. స్వచ్ఛమైన పట్టుదారాలు, మెరుపు కన్నా అధికంగా మెరిసిపోయే జరీతీగలతో చీరను నేస్తారు. అంచుల వెంబడి పరుచుకున్న మోటిఫ్‌లు ఈ చీరను ప్రత్యేకంగా నిలబెడతాయి. కల్గా, బెల్‌, ఆకులు ఇలా రకరకాల ఆకృతులతో అల్లుకున్న మోటిఫ్‌లు చూడచక్కగా ఉంటాయి. కాంపాక్ట్‌ నేత కారణంగా ప్రతి డిజైనూ క్షుణ్ణంగా కనిపిస్తుంది. ఫ్యాషన్‌కు తగ్గట్టుగా కొత్తకొత్త రూపాలు సంతరించుకుంటూ ఈతరానికీ చేరువయ్యాయి. నాణ్యతకు, డిజైన్లకు కేరాఫ్‌గా నిలిచిన బనారస్‌ పట్టుచీరను నేయడానికి పక్షం రోజుల నుంచి నెల వరకు పడుతుంది. ఒక్కోసారి ఆరు నెలలు శ్రమించాల్సి వస్తుంది. వారణాసి, గోరఖ్‌పూర్‌, చందౌలీ, అజాంగఢ్‌ తదితర జిల్లాల్లో బనారస్‌ పట్టు చీరలు నేసే చేనేత కుటుంబాలున్నాయి. 16వ శతాబ్దంలో కరువు కారణంగా గుజరాత్‌ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వలస వచ్చిన కుటుంబాలు తమ కళా కౌశలంతో బనారస్‌ పట్టును సృష్టించారని చెబుతారు. ప్రస్తుతం ఈ పట్టు పరిశ్రమపై దాదాపు లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గంగానది కాలుష్యం నేపథ్యంలో రసాయన రంగులకు స్వస్తిపలికి మొక్కలు, పువ్వులు, పండ్ల నుంచి తయారైన సహజ రంగులను వినియోగిస్తున్నారు.

ఇలా ధరించొచ్చు

  • పెండ్లి చీరల్లో బనారస్‌ పట్టు ఉండాల్సిందే. బంగారు, వెండి తళుకులీనే జరీ వాడటం వల్ల రాయల్‌ లుక్‌ వస్తుంది. ఈ చీరకు మగ్గం వర్క్‌ బ్లౌజ్‌ వేసుకుంటే ఠీవీగా కనిపిస్తారు. ఎల్బోహ్యాండ్స్‌ వరకున్న జాకెట్‌ అయితే మరింత రిచ్‌గా కనబడుతుంది. సంప్రదాయ చీరకు వెస్ట్రన్‌ టచ్‌ ఇవ్వాలనుకుంటే బ్లౌజెస్‌తో లుక్‌ మార్చేయొచ్చు. హ్యాండ్స్‌కి మూడుపొరలుగా రఫెల్స్‌ వేయడం, ఫుల్‌ హ్యాండ్‌ స్లీవ్‌ బ్లౌజ్‌ ధరిస్తే బాగా నప్పుతుంది. ఇలా ధరించినప్పుడు మెడలో హెవీ చోకర్‌ గానీ, చెవులకు పెద్దసైజు ఇయర్‌ రింగ్స్‌ వాడితే చాలా అందంగా కనిపిస్తారు. కాలర్‌ నెక్‌, పెప్లుమ్‌ స్టయిల్‌ బ్లౌజ్‌ కూడా ధరించొచ్చు.
  • బనారస్‌ దుపట్టాలు అందుబాటులో ఉన్నాయి. ప్లేన్‌ లాంగ్‌ గౌన్‌పైకి గానీ, అనార్కలి ప్యాటర్న్‌కి కూడా ఈ దుపట్టాలు చక్కగా ఉంటాయి. 
  • బనారస్‌ పట్టు ఫ్యాబ్రిక్‌తో లెహంగాలు అద్భుతంగా ఉంటాయి. వీటిపైకి మగ్గం వర్క్‌ చేసిన బ్లౌజ్‌, దుపట్టా వాడితే అదిరిపోతుంది. వెస్ట్రన్‌ స్టయిల్‌లో లాంగ్‌ స్కర్ట్‌లా, సూట్‌లా కూడా కుట్టించుకోవచ్చు.


logo