గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Sep 29, 2020 , 02:43:50

ఓ తల్లి ఒంటరి విజయం

ఓ తల్లి ఒంటరి విజయం

‘అయ్యో! పాపం ఆమె నుదుటి రాత బాగాలేదు’ అన్నారు. కానీ, ఆమె చేతుల్లో అమృతరేఖ ఉన్నది. తనకు జరిగిన నష్టానికి విధిని నిందించకుండా కష్టాన్ని నమ్ముకుంది. పాక ప్రావీణ్యాన్ని ఆసరాగా చేసుకొని కుటుంబానికి అండగా నిలిచింది. కూతురును ఉన్నతంగా చదివించింది. ప్రకృతి ప్రొడక్ట్స్‌ పేరుతో 200 రకాల పచ్చళ్లు చేసి ఔరా అనిపించుకుంది. ఆర్థికంగా తను విజయం సాధించడమే కాదు.. పచ్చళ్ల తయారీలో ఎందరికో శిక్షణనిచ్చి దక్షత చాటుకుంది.

దీపాలి భట్టాచార్య ఓ సాధారణ గృహిణి. అసోం రాజధాని గువాహటీలో కాపురం. భర్త, కూతురు, అమ్మలా చూసుకునే అత్త.. చక్కటి సంసారం. భర్త త్రిదివ్‌ భట్టాచార్య లెక్కల మాస్టర్‌. సంగీతం కూడా బోధించేవాడు. ఎక్కడా లెక్క తప్పకుండా సాగిపోతున్న వారి సరిగమల సంసారంలో అనుకోని కుదుపు. దీపాలి భర్త 40 ఏండ్లు ఉన్నప్పుడు గుండెపోటుతో మరణించాడు. వయసు మళ్లిన అత్త, తొమ్మిదేండ్ల కూతురు సుదిత్రీని చేతుల్లో పెట్టి ఆయన కన్నుమూశాడు. వారిద్దరినీ చూసుకుంటూ కన్నీరుమున్నీరైంది దీపాలి.

అసోంలో ఇడ్లీ సాంబార్‌..

రోజులు గడిచాయి.. భర్త పోయిన బాధను దిగమింగుకొని కూతురును బాగా చదివించాలని అనుకుంది దీపాలి. అత్త బాగోగులూ చూసుకోవాలి. అందుకు డబ్బు కావాలి. తనకు తెలిసిందొక్కటే వంట. దాన్నే నమ్ముకుంది. పచ్చళ్లు చేయడంలో మంచి పేరుంది దీపాలికి. తను ఏ పచ్చడి చేసినా భర్త లొట్టలేసుకుంటూ తినేవాడు. ఇరుగు పొరుగు తనను వారిండ్లకు పిలిచి మరీ పచ్చళ్లు పెట్టించుకునేవాళ్లు. ఆ ధైర్యంతోనే నాలుగైదు రకాల పచ్చళ్లు పెట్టి.. దుకాణాలకు వెళ్లి అమ్మింది. పెట్టుబడి పోగా సంతృప్తికరంగానే డబ్బులు మిగలడంతో ఆమెకు నమ్మకం కుదిరింది. దీపాలి అమ్మావాళ్లకు మసాలా దినుసుల వ్యాపారం ఉండేది. నాణ్యమైన మసాలాలు అమ్మేవాళ్లు. ఏ పచ్చడిలో ఎలాంటి మసాలాలు, ఏ పాళ్లలో వేయాలో చిన్నతనంలోనే నేర్చుకుందామె. దీపాలి అత్త ఆతరం వంటలు వండటంలో దిట్ట. ఈ రెండూ ఆమె వ్యాపారానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. రకరకాల పచ్చళ్లు, పొడులు, వంటకాలు చేయడం మొదలుపెట్టింది. ‘ప్రకృతి ప్రొడక్ట్స్‌' పేరుతో పచ్చళ్ల వ్యాపారాన్ని విస్తరించింది. మరోవైపు ఇడ్లీ, సాంబార్‌ వడ, దహీ వడ వంటి దక్షిణాది వంటకాలను అక్కడివారికి పరిచయం చేసింది. 17 ఏండ్ల కిందటే ఆహారాన్ని హోమ్‌ డెలివరీ చేసేందుకు ఓ ఉద్యోగినీ నియమించుకుంది.

పచ్చళ్లపై వర్క్‌షాప్‌లు 

పలు సంస్థలు నిర్వహించిన వంటావార్పు కార్యక్రమాల్లో తరచూ పాల్గొనేది దీపాలి. ఘుమఘుమలాడే వంటకాలు క్షణాల్లో సిద్ధం చేసి మొదటి బహుమతి గెలుచుకునేది. అలా సంపాదించిన మొత్తాన్ని వ్యాపార వృద్ధికి ఉపయోగించేది. నాణ్యత, రుచి దీపాలి పచ్చళ్లకు గిరాకీ తెచ్చిపెట్టాయి. రెండేండ్లు తిరక్కుండానే ఐదు లక్షల ఆదాయాన్ని సంపాదించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దాదాపు 200 రకాల పచ్చళ్లు తయారు చేస్తున్నది. ఇప్పటికీ ఇంట్లోనే వ్యాపారం కొనసాగిస్తున్నది. పదిహేను మందికి ఉపాధి కల్పించింది. కొబ్బరితో రకరకాల వంటలు, పచ్చళ్లు తయారు చేయడంతో అసోం కోకోనట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ దీపాలిని సంప్రదించింది. వారి ప్రోత్సాహంతో కొబ్బరితో వెరైటీ పచ్చళ్లు తయారు చేసింది. కేరళ వెళ్లి మరీ కొబ్బరి వంటకాల గురించి తెలుసుకుంది. 

వర్క్‌షాప్‌లు నిర్వహించి పచ్చళ్ల తయారీపై మహిళలకు అవగాహన కల్పించింది. తన కోసం కష్టపడుతున్న తల్లి ఆశలకు అనుగుణంగా చదివింది సుదిత్రీ. ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ చేసి ఫ్రీలాన్స్‌ డిజిటల్‌ కంటెంట్‌ రైటర్‌గా పనిచేస్తున్నది. ‘ప్రకృతి ప్రొడక్ట్స్‌' ఉత్పత్తులకు ఆన్‌లైన్‌లో ప్రచారం కల్పిస్తున్నది. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా ముందుకు అడుగేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది దీపాలి.logo